2665* వ రోజు...... ....           29-Jan-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం మానుదాం.

శ్రమదాన పనిదినాల సంఖ్య -@2665*

          ఈ ఆదివారం (29-1-23) తో ఇటు స్వచ్ఛ కార్యకర్తలూ, అటు ట్రస్టుఉద్యోగులూ తమ ఊరి శ్రేయస్సు కోసం ఎన్నిలక్షల గంటలు పాటు బడ్డారో లెక్కతేలాలి! తమ అరుదైన శ్రమదానంతో పాతిక వేల మంది జనాభాలో ఎంత మందిని ఆకట్టుకొని, ఎంత వరకు కార్యాచరణకు దించారో అంచనా వేయాల్సి ఉంది!

          ఈ నాటి వేకువ కూడ 4.18 - 6.18 నడుమ 28 మంది తమ సామూహిక శ్రమతో పెదకళ్లేపల్లి మార్గంలోని SVL క్రాంతి విద్యాసంస్థ మొదలు కోనేరు పట్టాభిరామయ్య/సాంబశివరావుల స్థలం దాక - 100 గజాలకు పైగా శుభ్ర - సుందరీకరించగలిగారు.

అందుమూలంగా ప్రోగుబడింది:  

1) బండెడు చెత్త,

2) రెండు గోతాల ఖాళీ సారా/మంచి నీళ్ల సీసాలు, ప్లాస్టిక్ గ్లాసులూ, కప్పులూ, సంచులూ

3) త్రాగిపడేసిన కొబ్బరి బొండాలూ, తాటి టెంకలూ,

4) గోనె సంచులూ ఎంగిలాకులూ - టీ/కాఫీ కప్పులూ, ఇక ఊడ్చిన దుమ్మూ సుకా సరే!

          ఇది వేలాది రోజులుగా ప్రతి వేకువా ఖర్చు లేకుండా – కేవలం తమ ఊరును స్వచ్ఛ - సుందరంగా ఉంచుకోవాలనే ఒక్క సంకల్పమే పెట్టుబడిగా 30/40 మంది చొప్పున జరుగుతున్న శ్రమదాన యజ్ఞం! లబ్ధిదారులైన గ్రామస్తులు పొగడినా - తెగడినా, అంటీ ముట్టకున్నా, కొందరు కొన్నాళ్లు పాల్గొన్నా, ఇంకొందరు సంఘీభావం ప్రకటించినా - ప్రతి వేకువా గంటన్నరా/రెండు గంటలు అనివార్యంగా జరుగుతున్న విశిష్ట ప్రయత్నం!

          ఎవరి విద్యాసంస్థ పరిసరాల్ని వారు, ఏ కర్మాగారం ఎదుట యజమానులు, గ్యాస్ కంపెనీల వారు, చిల్లర దుకాణదారులు, బొత్తిగా బాధ్యత వహించకున్నా - నిందించక, విసుగుకోక - సహనంగా సాగిస్తున్న సుదీర్ఘకాల గ్రామ సామాజిక సంస్కరణం!

 

          ఈ ఆదివారం వేకువ కూడ స్వచ్ఛ కార్యకర్తలది అదే తీరు! ఎక్కడ పనికి వంగినా, పిచ్చి ముళ్ల మొక్కలూ, తీగలూ! సిమెంటు విక్రయ దుకాణం ప్రక్కన పంట బోదె కాల్వ తూము దగ్గర నీరు నడవక అడ్డుపడిన రకరకాల తుక్కుల్ని ఓర్పుగా, నేర్పుగా బైటకు లాగిన ఇద్దరు రైతులు (అందులో ఒకాయన కాలు నొప్పి వల్ల వారగా నడుస్తూనే పని చేశాడు! బాటను ఊడ్చిన ముగ్గురు మహిళలు, ఎండు డ్రైన్లలోని అన్ని వ్యర్థాలనూ ఆ చీకటిలోనే ప్రోగులు చేసిన ఆరేడుగురు!

          ఇందరు కార్యకర్తలు తమ వీధి మెరుగుదల బాధ్యతలు మోస్తుంటే, 2 గంటలు శ్రమిస్తుంటే సదరు కాలుష్య కారణమైన షాపుల వారు, టీ కొట్ల వారు. టీ గ్లాసుల ఉత్పత్తిదారులు పట్టనట్లెందుకుంటారో రి? ఎప్పటికైనా మారవలసింది కొందరు వ్యాపారులు, గృహస్తులే గాని, ఆగవలసిందీ, ఆపవలసిందీ కార్యకర్తల శ్రమదానం కానే కాదు!

          శివరామపురం రైతు ప్రముఖుడు మల్లంపాటి ప్రేమానందం 6.35 వేళ ముమ్మారు పలికిన స్వచ్ఛ - సుందరోద్యమ నినాదాలతో నేటి శ్రమదానానికి ముగింపు! కళ్ళేపల్లి తిరునాళ్ల నాటికి ఈ రహదారి సుందరీకరణ పూర్తి కావాలంటే - ఎక్కువ సంఖ్యలో కార్యకర్తల అవసరం ఉన్నది.

          ఈ రోజు సాయంత్రం 6.30 నుండి నడకుదురు దారిలో గల R.K. కన్వెన్షన్ హాలులో వద్ద జరిగే – అడపా రాంబాబు గారి కొడుకు, కోడలు పరిచయ కార్యక్రమ వేడుకకు స్వచ్చ కార్యకర్తలందరం హాజరు కావలసి ఉన్నది.

          కనుక బుధవారం వేకువ మనం నూతనోత్సాహంతో కలిసి శ్రమించవలసిన చోటు - కళ్లేపల్లి దారిలోని నాగభూషణం గారి ఇంటి ప్రక్క స్తలం నుండే!

 

        ఈ స్వచ్ఛ గ్రామ కార్యకర్త

కలగనినది సక్రమమగు గ్రామస్తులు చైతన్యమె

ఆచరించి చూపునది శ్రమైక జీవ సౌందర్యమె

ఆశించిన దొటై గ్రామాభ్యుదయం స్థిరంగా

సాధించెడి దొకటె - ఆత్మ సంతృప్తినె మెండుగా!

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

   29.01.2023.