2667* వ రోజు...... ... ....           31-Jan-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం మానుదాం.

మంగళవారం - 2667* వ వేకువ శ్రమదానం -

ఈ జనవరి మాసాంతాన రెస్క్యూ దళం సేవలు రెండు చోట్ల రెండు రకాలుగా జరిగాయి

1) అస్పత్రి ఎదుట - ఇది నిన్న అసంపూర్ణంగా చెక్కిన శిల్పం పని,

2) 1 వ వార్డు ప్రవేశం దగ్గర గత వారం సరిచేసిన రంగు రాళ్ల పని.

            రెండు పనులూ 4:20 నుండి 6.30 దాక ముగించిన కార్యకర్తలు 5+2 మంది (- చివరి సంఖ్య గ్రామ వీధుల్ని పరిశీలిస్తూ నడక పనికి వెళ్లిన మా ఇద్దరిది!)

            ఆస్పత్రి ముందర - దుంగలతో చేస్తున్న చెక్క బెంచీ పని దాదాపుగా ముగిసింది. రంగులు వేసి ముస్తాబు చేయడమే మిగిలింది. చెక్క పని వాళ్లకిదొక పెద్ద పని కాకపోవచ్చు గాని, ఈ క్రొత్త వడ్రంగులది మాత్రం పది మందికీ పనికొచ్చే సృజనాత్మక కృషే! ప్రతి వీధినీ, వీలైన ప్రతి చోటునూ మరింత ఆకర్షణీయంగా చేయాలనే తపనే ఈ శ్రమదానానికి మూలకారణం!

            బందరు రహదారి ప్రక్క ఈ వేకువ జరిగిన తాపీ పని మాత్రం తక్కువదా? ఐదుగురు కార్యకర్తలే తాపీ మేస్త్రీలు, తాపీ కూలీలు, వాళ్లే వీధి సుందరీకర్తలు! ఏ ఖర్చూ లేకుండ - సిమెంటు, సన్నరాతి ముక్కలు, ఇసుక - ఏ వీధి వ్యర్థాల్నో సేకరించి, దానికి తమ శ్రమను జోడించి, ఈ మాత్రం సృజనాత్మకంగా ఆలోచించి, ఒక వార్డు మలుపు లోపాన్ని సరిదిద్దిన కార్యకర్తలు అభివందనీయులు!

            చల్లపల్లి స్వచ్చ సుందరోద్యమ స్వభావాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకొని, ఆర్థిక హార్దిక సహకారమందిస్తున్న దోనేపూడి శరత్ వంటి దాతలూ అభినందనీయులే!

            ముదితల్ నేర్వగలేని విద్యగలదే ముద్దార నేర్పించినన్...అని 19 - 20 వ శతాబ్దపు కవి చిలకమర్తి లక్ష్మీ నరసింహం వేరే సందర్భంలో అన్నట్లుగా - తమ ఊరి అవసరార్థం ఈ స్వచ్ఛ కార్యకర్తలు మురుగు పనేంటీ తాపీ పనేంటీ - దేన్నైనా అవలీలగా నేర్చేస్తారన్న మాట!

            నేటి స్వచ్ఛ - సుందర - చల్లపల్లి నినాదాలను ప్రకటించినది తూములూరి లక్ష్మణరావు.

            రేపటి వేకువ పెదకళ్ళేపల్లి దారిలో - నాగభూషణం గారి ఇంటి దగ్గర మన పునర్దర్శనం.

            ఒక సామూహిక పయనంగా

ఎన్నికలకు నిలబడకా - ఎంపికలకు ఇష్టపడక

పదవులకతి దూరంగా - ప్రచారాల విముఖంగా

గ్రామ బాధ్యతకు మాత్రం కలివిడిగా - సుముఖంగా

స్వచ్ఛ సుందరోద్యమ మొక సామూహిక పయనంగా!

 - ఒకానొక సీనియర్ కార్యకర్త,

   31.01.2023.