2668* వ రోజు...... ... ....           01-Feb-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం మానుదాం.

స్వచ్ఛ సుందరోద్యమంలో 2668* వేకువ విశేషాలు!

            అది బుధవారం (1-2-23) వేకువ - 4.22 - 6.15 నడిమి కాలం - స్థలం పెదకళ్ళేపల్లి బాటలో ఊరికి 1½ కి.మీ. దూరాన - నాగభూషణం గారి ఇంటి వద్ద! స్వచ్ఛ కార్యకర్తలనబడే 21 మందితో జరిగిన 150 గజాల వీధి పునీత చర్యలు!

ఇక - విశేషాల సంగతికొస్తే

            అసలు 9 ఏళ్ళు దాటిన నిస్వార్ద శ్రమదానమే ఒక విశేషం! దేశంలో ఎక్కడైనా - మన సమకాలంలో 30 -40 - 50 మంది శ్రమదాతలు - అందునా సమాజంలో గౌరవప్రద స్థానంలో వారు - ఇంత వేకువ వేళ తమ కోసం కాక గ్రామ సమాజం మేలు కోసం కష్టించడమే అసలైన వింత!

- ఇంటి పనులకో, వృత్తికో పరిమితం కాక ఏ 3.30 కో లేచి ఊరికింత దూరంగా వచ్చి, పేడ - పెంట పనులకు నలుగురైదుగురు స్త్రీ మూర్తులు పూనుకొన్నారే అదేమన్నా సామాన్య విషయమా?

- అక్కడి గృహస్థులు పట్టించుకోని మురుగు కాల్వల్లోని, వాటి గట్లమీది గడ్డీ, పిచ్చి ముళ్ల మొక్కల్నీ, తీగల్ని - ఆ ఆసాములు కూర్చొని చూస్తుండగానే, తొలగించి, నాలుగు గోతాల ప్రమాదకరమైన ప్లాస్టిక్/గాజు సీసాల్ని కప్పుల్ని ఏరిన ఏడెనిమంది పట్టుదల మాత్రం విశేషం కాదా?

- ప్రత్యక్షంగా చూడనిదే నమ్మరేమో గాని, బోలెడన్ని అనారోగ్య సమస్యల్తో 83 ఏళ్ల సూపర్ సీనియర్ వైద్యుడూ, బాగా చురుకైన ఒక పోస్టల్ ఉద్యోగీ నడుం ప్రక్కకు ఒరిగి నడుస్తూ డిప్పలు మోయడమూ, కత్తితో పనిచేసి, చేసి అలసి కూర్చుండి పోవడమూ నిష్పక్ష పాత పరిశీలకుల దృష్టిలో విశేషమే!

- ఒక రైతు కాలు నొప్పితోనే తనకు చేతనైనంత శ్రమదానానికి పాల్పడడమూ, మరొక రైతు ట్రక్కులో నిల్చి (అతనికీ కొన్ని నడుం సమస్యలున్నా సరే-) రెండు బళ్ల వ్యర్ధాల్ని అణగ త్రొక్కి - ఒక్క ట్రక్కులోనే సర్దడం కూడ నా దృష్టిలో చెప్పుకోదగ్గ సంగతే!

- అన్నిటినీ మించిన విశేషమైన విశేషమేమంటే 2668* రోజులుగా ఏ నాల్గు లక్షల పని గంటలో తమకళ్లెదుటే ఎవరి ఆహ్లాద ఆరోగ్యాల కోసం స్వచ్చ కార్యకర్తలు శ్రమిస్తున్నారో గమనించి కూడ కొన్ని వీధుల్లో తప్ప ప్రజలు సరిగా స్పందించక - నిమ్మకు నీరెత్తినట్లుండిపోవడం!

            తెలిసి తెలిసీ - ఈ మురికి పనులకు పూనుకొన్నందున - అది తమకు ఆనందప్రదమని నిశ్చయించుకొన్నందున - 6.30 సమయంలో సమావేశమై ఈ నాటి తమ కృషినీ, తన్మూలంగా తొలగిన కాలుష్యం ముప్పునూ తలచుకొని కార్యకర్తలు గుండెల్నిండా సంతృప్తి పొందడంలో విశేషమేమున్నది?

            3 రోజుల్నాడు - భాగ్యనగరంలో జరిగిన (1977 - 81 నాటి) వైద్య విద్యార్ధుల కూడికలో చల్లపల్లి స్వచ్ఛోద్యమానికి దక్కిన విశేష మన్నన - మన DRK గారు వివరించిన సంగతి!

            ఈ నెల మొదటి తేదీ ఒక చిన్న విశేషం డా. గోపాలకృష్ణయ్య గారు యధావిధిగా 2,000/- విరాళంతో స్వచ్చోద్యమ చల్లపల్లిని ఆశీర్వదించడం!

            నేటి స్వచ్ఛ - సుందరోద్యమ నినాదాలను ప్రకటించిన వంతు వేముల శ్రీనివాస మహోదయునిది!

            రేపటి మన శ్రమదాన సంకేత స్థలం ఈ పెదకళ్లేపల్లి మార్గంలోని నాగభూషణం గారి ఇంటి వద్దే!

            సాహసాత్మక చర్యలే ఇవి

వృత్తిధర్మం కాదు కాదు - ప్రవృత్తి నడిపిస్తోంది వీళ్లని

ఎవరి ఆజ్ఞలు లేవు ఇందుకు - అంతరాత్మ ప్రబోధమే మరి

సొంత లాభం దృష్టి తగ్గి సమాజ బాధ్యత వృద్ధి చెందిన

స్వఛ్ఛ - సుందర కార్యకర్తల సాహసాత్మక చర్యలే ఇవి!

 - ఒకానొక సీనియర్ కార్యకర్త,

   01.02.2023.

ఈ నెల మొదటి తేదీ ఒక చిన్న విశేషం డా. గోపాలకృష్ణయ్య గారు యధావిధిగా 2,000/- విరాళంతో స్వచ్చోద్యమ చల్లపల్లిని ఆశీర్వదించడం!