2669* వ రోజు...... ... ....           02-Feb-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం మానుదాం.

స్వచ్ఛ - సుందరోద్యమ చల్లపల్లిలో ఇవి 2669* వ నాటి సంగతులు!

            అవి 2.2.23 (గురువారం) నాటివి ! పెదకళ్లేపల్లి బాటలో నాగభూషణం గారి ఇల్లు మొదలు బైపాస్ రహదారి దగ్గరి ప్రభుత్వ మద్యం దుకాణం దాటి జరిగిన పాతిక మంది పట్టుదలకు చెందినవి! ఇన్నేళ్లుగా - ఇన్ని వేల రోజులుగా - చల్లపల్లిలో ప్రవేశించే 7 దారులూ, ఊరి ముఖ్యవీధులూ, శ్మశానాలూ, ఉద్యానాలూ వగైరాలకు సంబంధించిన సంగతులన్న మాట!

            ఆఁ! చేశారులే మహా! పాతిక మంది మనుషులు ఒక రోడ్డులో 120 గజాలు! ఈ కాస్త రోడ్డు ఊడ్చినందుకూ, కొన్ని పిచ్చి మొక్కలు కొట్టేసినందుకూ, డ్రైన్లలో తుక్కు లాగి, ట్రాక్టర్ లో నింపుకొని చెత్త కేంద్రానికి చేర్చినందుకేనా వాట్సప్ ఫేస్ బుక్కుల్లో ప్రశంసలు?”

            సరే! చేసేదోదో చేస్తున్నారు- రోజూ ఈ మైకు పాటలూ, 6.30 తర్వాత మీటింగులూ అవసరమా?”

            అసలు పంచాయతీలూ, ప్రభుత్వమూ ఏం చేస్తున్నట్లు.... ఇవన్నీ వాళ్ల బాధ్యతలు కావా?” అనే శంకలూ, ప్రశ్నలూ ఇప్పటికీ కొందరు గ్రామస్తుల మనసుల్లో ఉండవచ్చు! ప్రశ్నలెప్పుడైనా మంచివే గాని, వ్యక్తుల పౌర బాధ్యతల సంగతేమిటి?

            ఇంత పెద్ద - పాతిక వేల జనాభా ఉన్న ఊరి పారిశుద్ధ్యం. ఒక్క పంచాయతీకే ప్రస్తుత పరిస్ధితుల్లో సాధ్యం కాకపోవచ్చు! ఇన్ని స్వచ్చంద సంస్ధలూ, ఇందరు సామాజిక చైతన్య వంతులూ తలా ఒక చెయ్యి వేయకపోతే ఆ లక్ష్యం ఎప్పటికప్పుడు వాయిదా పడవచ్చు!

            విడివిడిగా గ్రామస్తులు తలొక చెయ్యీ వేసినప్పటికన్న స్వచ్చ కార్యకర్తల వలె సమూహంగా ప్రయత్నించినప్పుడు వాళ్ల శక్తియుక్తులు ద్విగుణీకృతం - త్రిగుణీకృతం కావచ్చు గూడ (వ్యక్తికి బహువచనం శక్తిఅని శ్రీ శ్రీ ఎప్పుడో చెప్పాడు)!

ఇక - నేటి వేకువ 4.20 - 6.16 వేళలో పాతిక మంది నెరవేర్చిన బాధ్యతలూ, తత్ఫలితాలూ చూద్దాం:

- నలుగురు - నిన్న తాము చేసిన చోట కొంతమేర చిరు లోపాలు కన్పించి, చక్కదిద్దగా,

- ఒక సీనియర్ డాక్టరమ్మ, ఇద్దరు నర్సమ్మలూ, ఇంకో గృహిణీ చీపుళ్లతో శివరామపురం బాటను సుందరీకరించగా,

- ఇద్దరో, ముగ్గురో సుందరీకర్తలు రెండు చెట్లను మరింత ఆకర్షణీయంగా మార్చగా,

- 100 గజాల డ్రైను తేలికగా బాగుపడినా, అసలైన కాలుష్య నరకం మద్య దుకాణం దగ్గరి పాతిక గజాల డ్రైనే! వందలాది గాజు సీసాలూ, వేల కొద్దీ ప్లాస్టిక్ గ్లాసులూ త్రవ్విన కొద్దీ ఏరిన కొద్దీ - డిప్పలు చాలక ఎక్కడి గోనె సంచి అక్కడే నింపుకొని - అదీ మద్యం సీసాల మురుగు వాసనల నడుమ - చుట్టూ దోమల పహారాలోనే డజను మంది శ్రమించిన వైనం ఆ దృశ్యాన్ని నాబోటివాడు వర్ణించే విషయం కాదు!

- ఈ వ్యర్థాలన్నిటినీ కొందరు ట్రక్కులోకి చేరిస్తే - అది శివరాంపురం దిశగా వెళ్లింది.

            లాభాల లెక్కలు తప్ప ప్రభుత్వ సారా అంగళ్లు పర్యావరణ నష్టాన్ని పట్టించుకోవా?

            6.356.50 సమయపు సమీక్షా సభలో - ఒక వంక కన్నడ అర్జునుల వారి పరామర్శతో - గట్టిగా ముమ్మారు స్వచ్ఛ సుందర నినాదాలను గర్జించిన మాలెంపాటి అంజయ్య వైఖరితో - జీవిత మార్గదర్శకాలైన నూతక్కి శివబాబు 3 సూక్తులతో - కార్యకర్తల కఠిన శ్రమదానానికి ఒక సీనియర్ స్వచ్ఛ వైద్యుని మెచ్చుకోలుతో.... నేటి కార్యక్రమం విజయవంతమయింది.

            మన రేపటి శ్రమదానం కోసం ఇదే కళ్లేపల్లి బాటలోని సారా అంగడి దగ్గర గాని, బైపాస్ రహదారి వద్ద గాని కలుసుకొందాం.

            భక్తులా శ్రమదాతలా ?

వేనవేల వసంతములలో ప్రతిష్ఠాత్మక శివుని పండుగ

కీ విధంగా నెలల తరబడి వీధి శుభ్రతకై తపించిన

కార్యకర్తల జూచియుండదు గదా! కదళీపురం మార్గం?

భక్తులా శ్రమదాతలా ఈ స్వచ్ఛ సుందర కర్మవీరులు?

 - ఒకానొక సీనియర్ కార్యకర్త,

   02.02.2023.