2670* వ రోజు...... ... ....           03-Feb-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం మానుదాం.

P.K.పల్లి బాటలోనే 2670* వ నాటి శ్రమ వేడుక!

          ఈ శుక్రవారం – (3-2-23) మాత్రమే కాదు మహా శివరాత్రి పర్వదినం దాక - పెదకళ్ళేపల్లి తిరునాళ్లకు వెళ్ళే భక్తజనులకు ఆహ్లాదకర ప్రయాణ సౌలభ్యం కోసం ఈ స్వచ్ఛ కార్యకర్తల నిత్య కృషి ఇదే వీధిలో. కనీసం శివరామపురం వరకైనా! 7 - 8 ఏళ్లుగా చల్లపల్లి స్వచ్ఛ - సుందరోద్యమంలో ఇదొక సంప్రదాయమైపోయింది మరి!

          ఇవాళటి 22 మంది - (సమీప గృహస్తుడు నాగభూషణం గారితో కలిపి) ఆ సంప్రదాయాన్నే 4.22 నుండి 6.15 దాక కొనసాగించారు! కార్యకర్తల శ్రమతో శుక్రవారం బాగుపడిన చోటులో సగం నిన్న చేసినదే! ఎందుకనగా -  మద్యం దుకాణం దగ్గర 24 గంటల కాలంలోనే మళ్ళీ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యర్ధాలు పడడమూ, సుందరీకరణ వారి చెట్లను ముస్తాబు చేసే, రోడ్ మార్జిన్ ను అద్దంలా రూపొందించే పనుల జాప్యం వల్లనో!

          సుమారు 35 - 40 పని గంటల్లో జరిగింది 100 గజాలకు కూడ తక్కువ పనే కావచ్చు, వారం రోజులుగా కార్యకర్తలే కాక, ట్రస్టు ఉద్యోగులు కూడ చేస్తున్నదే గావచ్చు - నిండా కిలోమీటరైనా లేని బైపాస్ రహదారి గూడ దాటలేదంటే ఒక కారణం స్వచ్ఛ - సుందర కార్యకర్తల సంఖ్యా బలం చాలకపోవడమైతే రెండోది పట్టి పట్టి రోడ్డునూ, డ్రైనునూ, మార్జిన్లనూ క్షుణ్ణంగా బాగుచేయడమే!

          ఉప రహదారి సమీపంలో మురుగుకాల్వను - గుంట, మెరకల కష్ట పరిస్థితిలో గడ్డిని చెక్కి, పిచ్చి చెట్లను ఖండించి, ప్లాస్టిక్ లను ఏరి 12 మంది - తూర్పు దిశ వరకు వంక బెట్టలేని విధంగా మెరుగుపరచగలిగారు. బాటకు పడమర డ్రైను రేపటికి మిగిలే ఉంది! ఊడ్చిన, దంతెలతో లాగి ప్రోగేసిన ఎండు వ్యర్ధాలు ట్రాక్టర్లోకి చేరి, చెత్త కేంద్రానికి చేరాయి గాని, కొమ్మలూ, ఆకులూ మిగిలిపోయినవి!

          వాలంటీర్లలో ఒకరిద్దరికి ప్రస్తుత కార్యక్రమం ఇంత నింపాదిగా జరిగితే - మేకలడొంక దాటి, క్రొత్త శివరామపురం చేరక ముందే పండగ వచ్చేట్లుందేఅనే బెంగపట్టుకొన్నది! ఒక పెద్ద ఊరికి సరిపడా స్వచ్ఛంద కార్యకర్తలు లేక రకరకాల అనర్ధాలను ఎవరికి వాళ్ళ బాధ్యతారహితంగా విసిరి, రోడ్లనూ, కాల్వలనూ ఇంతగా మలిన పరుస్తుంటే ఎంత స్వచ్ఛ సుందర చల్లపల్లిలోనైనా పరిస్థితి ఇలాగే ఉంటుంది మరి!

          సరే - ఏదో తమ శక్తి వంచన లేకుండ పాటుబడగలిగినంత పాటుబడిన కార్యకర్తలు 6.10 తరువాత పని విరమణ ఈలలు వినిపించి, కొందరు కాస్త అసంతృప్తిగానే విరమించి, 6.20 కి ముగింపు!

          సభాస్థలికి చేరి, కాఫీలు సేవించి, స్థానిక ఆతిధ్య గృహస్థు అభిమానంతో ఇచ్చిన బిస్కట్లను స్వీకరించి, కొత్తపల్లి వేంకటేశ్వరరావు గారు ముమ్మారు శబ్దించిన గ్రామ స్వచ్చ శుభ్ర సౌందర్య నినాదాలకు యధావిధిగా ప్రతి స్పందించి, ఈ 2670* వ నాటి శ్రమదానానికి తెరదించారు.

          మళ్ళీ ఫిబ్రవరిలో కూడా ఒక అజ్ఞాత మిత్రుడు చేసిన ఒక వింత ధన సహాయాన్ని షణ్ముఖ సంస్థ యజమాని - వేముల శ్రీనివాస్ మనకోసం మనంట్రస్టుకు కాస్త అజ్ఞాతంగానే బట్వాడా చేయడమైనది! ఉభయులకు స్వచ్చోద్యమ చల్లపల్లి ధన్యవదాములు.

          రేపటి వేకువ శ్రమదానాన్ని సాగర్ ఆక్వా వద్ద (పెదకళ్ళేపల్లి బాటలోనే) కలిసి కొనసాగించాలనే ప్రతిపాదనను అందరూ సమ్మతించారు!

          శ్రమకు చెమటకు ప్రతిఫలముగా!

చలో మంచో- ఎండో వానో - సక్రమంగా గ్రామ సేవలు

మురుగొ సిల్టో పేడ కంపో - మురికి పనులో - లేవు హద్దులు

దీక్ష ఒకటే దక్షతొకటే - తీరు తెన్నుగ ఊరి విధులు

స్వచ్ఛ సుందర కార్యకర్తల శ్రమకు చెమటకు ప్రతిఫలమ్ములు!

 - ఒకానొక సీనియర్ కార్యకర్త,

    03.02.2023.