2671* వ రోజు...... .......           04-Feb-2023

పర్యావరణ ధ్వంసకమయ్యే - ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం మానుదాం.
స్వచ్ఛ - సుందరోద్యమం = 2671* రోజులు → 4 లక్షల గంటలు!
ఆ ఉద్యమం ఇప్పట్లో ఆగేదీ కాదు, అలాగని 100% మంది గ్రామస్తుల్లో దాని స్ఫూర్తి నిండిందీ లేదు! 40 ఊళ్ల చైతన్యవంతులకీ, దేశ విదేశాల సదాలోచనా పరులకీ ఒక ఆదర్శంగా, ఆవశ్యకంగా కనిపిస్తున్న ఈ శ్రమదానం సగం మంది గ్రామస్తుల్నెందుకు కదిలించలేకపోతున్నదో తెలీడం లేదు!
ఈ శనివారం (4-2-23) వేకువ కాలాన కూడ 23 మంది కార్యకర్తలు మాత్రం నింపాదిగా 4.18 - 6.18 నడుమ 2 గంటల తమ సమయం ఊరంతటి ప్రయోజనార్థమై శ్రమించారు. పెదకళ్లేపల్లికి పోవు దారిలో - జాతీయ ఉప రహదారి దగ్గరే 40 పని గంటల ప్రయత్నం సఫలమయింది.
బైపాస్ రోడ్డును కలిపిన కళ్లేపల్లి రోడ్డు దగ్గర అన్ని గుంటలూ, కాంట్రాక్టరు వదిలేసిన మట్టి గుట్టలూ, చెట్టు - చేమలూ, గడ్డి దుబ్బులూ ప్లాస్టిక్ వంటి ప్రామాదిక వ్యర్థాల ప్రోగులూ, ప్రక్కనే మద్యదుకాణం వల్ల వికృతంగా తయారైన డ్రైనూ - అన్నిటికీ ఈ వేకువ కాలంలో సమాధానం దొరికింది.
ఇప్పుడెవరైనా జిజ్ఞాసువులటుగా వెళ్తే - బైపాస్ రహదారి ఉత్తర దక్షిణ భాగాల వ్యత్యాసం స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా రెండు సారా అంగళ్ల వారికీ!
అక్కడ చట్టైపోయిన మట్టి గుట్టల్ని సుందరీకరణ బృందం ఎంతగా శ్రమిస్తే - పలుగుల్తో త్రవ్వి, పార – డిప్పల్తో గుంటలు పూడ్చి చదును చేస్తే ఈ మాత్రం సౌకర్యంగా మారిందో - వాహనదారులు గుర్తించాలి .
వంచిన నడుము లెత్తకుండ లోతైన తడీ - పొడీ కాల్పలో దిగి, గడ్డినీ, ముదనష్టపు ముళ్ల మొక్కల్నీ, తీగల్నీ కత్తులతో దునుమాడి_ప్లాస్టిక్ దరిద్రాన్ని ఏరి, కంపు గొట్టుతున్న బండెడు వ్యర్థాల్ని ట్రక్కులోకెక్కించి, క్రొత్తూరు చెత్త కేంద్రానికి తరలించిన డజను మంది కర్మవీరుల శ్రమ విలువను గుర్తిస్తే మంచిది!
ఆరోగ్యశాఖ, పంచాయతీ, సమీప గృహస్తులు, దుకాణదారులు, ప్రజానీకానికవసరమైన పరిశుభ్రతను సాధించలేనప్పుడే ఈ స్వచ్చ - సుందర కార్యకర్తలు తమకు చాతనైనంతగా ఆ బాధ్యతను మోస్తున్నారు మరి! 
నేటి కాఫీ సమయంలోనూ, సమీక్షా సభలోనూ ప్రముఖంగా ప్రస్తావనకొచ్చిన ఒక సంగతేమంటే – 10 రోజాల్నాడు హైదరాబాదు దివిసీమ ఉప్పెన (1977) నాటి వైద్య విద్యార్థుల పునః కలయికలో – A.V. గురవా రెడ్డి చొరవతో – ఆయా ప్రముఖ వైద్యులు స్వచ్చ – సుందరోద్యమ కారిణి – Dr. పద్మావతి ని సత్కరించడం. (ఐతే – ఆమె దృష్టిలో ఈ గౌరవం చల్లపల్లి లోని వందలాది కార్యకర్తలకే చెందాలట!)
సమీక్షా కాలంలోనే ద్విచక్ర వాహన చోదక సమయంలో తీసుకోదగిన పలు మెలకువలను DRK ప్రసాదు గారు ఏ కరువు పెట్టారు.
తాను పాల్గొన్న ఒక వైద్య శిబిరంలో స్వచ్చ చల్లపల్లి కార్యక్రమ ప్రస్తావన గురించి చెప్పి, నేటి నినాదాలను ప్రకటించిన వారు – శ్రీమతి కోట పద్మావతి !
పెదకళ్ళేపల్లి రహదారి సుందరీకరణ లక్ష్యం కోసం రేపటి వేకువ మనం కలిసి శ్రమించవలసినది సాగర్ ఆక్వా ఫీడ్స్ వద్దనే!
స్విజర్లాండుగ – న్యూజిలాండుగ
ఒకానొక సుముహూర్తమందున ఒక్క పెట్టున ఊరి జనములు
స్వచ్ఛ స్పృహతో వీధి వీధిని శుభ్రపరచీ, అందగించీ
స్విజర్లాండుగ - న్యూజిలాండుగ చల్లపల్లిని తీర్చిదిద్దే
స్వచ్చ - సుందర దివ్య దృశ్యం చూడగలమా మనం త్వరలో!
- ఒకానొక సీనియర్ కార్యకర్త,
04.02.2023.