1927 * వ రోజు....           20-Feb-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడం!   

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం1927* వ నాటి సమయ శ్రమదానాలు.

నేటి వేకువ 4.01-6.15 నిముషాల నడుమ 27 మంది స్వచ్చంద శ్రమ దాతలు చల్లపల్లి-శివరామపురం దారి మెరుగుదల కోసం 50 పని గంటల పాటు శక్తి వంచన లేకుండ ప్రయత్నించారు.

ఐదుగురు సుందరీకరణ విభాగం వారు నిన్న శుభ్ర పరచినది పూర్తిగా నచ్చక సాగర్ ఆక్వా కంపెనీ ఎదుట బాట అంచుల్ని, మురుగు కాల్వ గట్లను, లోభాగాన్ని, డ్రైనేజి తూముల్ని నానా రకాల వ్యర్ధాలను లాగి, గుట్టలు పెట్టి సారా ఖాళీ సీసాలను వేరు పరచి సుందరీకరించారు. ఈ దారిలో ఇప్పుడు సౌకర్యంగా వచ్చి వెళ్లే వారెందరు ఇక్కడి స్వచ్చ- శుభ్ర-సౌందర్యాలను గమనిస్తున్నారో తెలియదు.

మిగిలిన కార్యకర్తలు బైపాస్ మార్గపు తూర్పు భాగాన్ని, చల్లపల్లి దారిలో ఉత్తర భాగాన్ని అన్ని రకాలుగా- అనగా స్వచ్చంగా, శుభ్రంగా, ప్లాస్టిక్ తదితర వ్యర్ధ రహితంగా తీర్చిదిద్దారు. అక్కడి మాదక ద్రవ దుకాణం(వైన్ షాపు)  ఎదుట ప్లాస్టిక్ గ్లాసులు, కప్పులు, ప్లేటు ఊడ్చి, ఏరి, ఆ పోగులను ట్రాక్టర్ లో నింపి, డ్రైన్లను శుభ్ర పరిచారు. (సదరు మద్య దుకాణం ఎదుట పెద్ద అక్షరాలతో వ్రాసిన పెద్ద జోకు (హాస్యోక్తి)” మద్యం మన ఆరోగ్యానికి హానికరం” అనే దాన్ని చూసి ఆనందించాను)!

6.40 నిముషాలకు-ప్రసంగ రహితంగా బాల దుర్గా రాంప్రసాదు ముమ్మారు గట్టిగా ప్రకటించిన మన ప్రాంత స్వచ్చ- శుభ్ర-సుందర-సంకల్ప నినాదాలతో నేటి గ్రామ బాధ్యత కు స్వస్తి! ఈ నాటి సమీక్షా సమావేశంలో:

- అమెరికా నుండి వచ్చి ప్రతి ఏటా కొన్నాళ్లు మన పాఠశాలల – కళాశాలల విద్యార్ధుల సరికొత్త అవగాహనలకై శ్రమిస్తున్న మండవ శేష గిరి రావు గారు అమెరికా నుండి తెచ్చిన వినూత్న పరికరంతో చెత్తను ఎరువుగా మార్చే ప్రక్రియను వివరించి, ప్లాస్టిక్ సంచుల ప్రత్యామ్నాయాలను ప్రదర్శించి స్వచ్చ-శుభ్రతల కొత్త మార్గాలను చూపే ప్రయత్నం చేశారు.

గ్రామ రక్షక సైనికులు వేంకటాపురం సమీపంలోని రహదారి వ్యర్ధాలను ట్రాక్టర్ లో నింపి తెచ్చారు.

 పల్నాటి భాస్కర్ గారి కోడలి సారెలోని తిను బండారాల పంపకం కూడ జరిగింది- ఇందుకే మనది ఒట్టి శ్రమదానం కాక, ప్రత్యేకమైన “శ్రమదాన వేడుక” అని పేర్కొనేది!

రేపటి మన శుభ్ర-సుందరీకరణ కృషి ఈ శివరామపురం దారిలో మేకల డొంక వద్ద కొనసాగిద్దాం.

        నిజంగానే పురోగమనం?

సమయదానం-శ్రమ విరాళం చాలనప్పుడు అర్థదానం

వినోదాల్లో-వేడుకలలో-స్వచ్చ సుందర సుసంకల్పం

సుమారుగ పందొమ్మిదొందల రోజులుగ ఈ స్వచ్చ యజ్ఞం

స్వచ్చ సైన్యం స్ఫూర్తి తో ఇక చల్లపల్లి పురోగమిస్తుందా?

నల్లూరి రామారావు  

 స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

గురువారం – 20/02/2020

చల్లపల్లి.