2672* వ రోజు...... .......           05-Feb-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం మానుదాం.

ఆదివారం (5.2.2023) నాటి ఊరి బాధ్యత 2672* వ నాటిది.

          వేకువ 4.22 కే అది మొదలై, 6.19 నిముషాలకు ముగిసెను . పాల్గొన్న ధన్యులు 35 మంది! వారిలో నలుగురు ధ్యాన మండలి మిత్రులు కాగా, పునః ప్రవేశించిన శాస్త్రి గారొకరు! మళ్ళీ ఇందులో ఇద్దరు వైద్యులు అరగంట ముందుగానే శ్రమదానం విరమించి, మచిలీపట్నంలో వైద్య శిబిర పర్యవేక్షణ కై వెడలిరి.

          నేటి శ్రమదానము సైతము పెదకళ్ళేపల్లి దారిలోని చేపల తిండి తయారీ కర్మశాల మరియు బైపాస్ ఉప మార్గములు కేంద్రాలు గానే జరిగెను. నేను గమనించిన కొన్ని శ్రమ జీవన సొగసులను నివేదింతును:

1) ఒక గంటకు పైగా 15మంది కష్టాన్ని సారా అంగడి ప్రక్క లోతైన మురుగు కాల్వే జీర్ణించుకొన్నది. నేటితో తన కాలుష్య శని విరగడై అది సంతసించినట్లు నాకనిపించెను.

2) సుందరీకర్తల పంచకం ఎత్తైన జాతీయ ఉప మార్గాన్ని అనుసంధిస్తున్న మట్టి- రాతి ముక్కల బాట నిర్మాణ మందే దృష్టి సారించెను. వెల కట్టజాలని శ్రమతో సదరు మట్టి రోడ్డు పునర్నిర్మాణము నేటితో ముగిసినట్లే కన్పించుచున్నది.

3) డజను మంది బైపాసు మార్గ పరిశుభ్రతకై శ్రమించి, సుమారిరువది గజాల దాక తుక్కులు లాగి, పిచ్చి చెట్లను తొలగించి, మెరుగులుదిద్దిరి.

4) స్వచ్చ కార్యకర్తల దశదిన శ్రమదానము పిదప ఎట్టకేలకు బందరు – పెదప్రోలు రహదారినధిగమించి, సాగర్ దాణా కేంద్రం వద్దకు చేరెను. అచటి కశ్మల భీభత్సమును 10 మంది ఎదిరించి, విజయము సాధించుట ముదావహము.

          తొలినాటి నుండీ ఈ గ్రామ స్వచ్చ సుందరోద్యమంబున పాల్గొనుచున్న నాదొక సందేహము లేక ప్రశ్న.

పాతిక వేల మంది గ్రామస్తులకు లేని పట్టింపు, ఊరి వీధులు, బహిరంగ ప్రదేశములు – ఏడు రహదారులిట్లు పరిశుభ్రముగా నుండవలెనను పంతమూ ఈ 35 మందికే ఏల ఉండవలె? ఉండెను బో- 2672* దినములు నాల్గు లక్షల పైగా గంటల మురికి- వెగటు పనుల కేల పాల్పడవలె? పాల్పడితిరి బో – సగం మంది గ్రామ పౌరులు కొంచెమైనను చలించక ఈ ఉద్యమమున కేల దూరముగా నుండవలె?

          ...... ఈ ప్రశ్నలన్నిటికి భవిష్యత్కాలమే తగు సమాధానమీయవలె.

6.40 సమయమున – దాణా తయారీ కర్మాగారమందు జరిగిన సమీక్షా సభ యందు విశ్రాంతోపాధ్యాయిని రాయపాటి రమ గారు కాస్త శ్రావ్యముగా ముమ్మారు వినిపించిన గ్రామ స్వచ్చ- శుభ్ర – సౌందర్య సాధనా నినాదములను మార్చి, క్రొత్తవి వ్రాయవలెనను ఆలోచనమొకటి కలిగినది.     

          ‘మన కోసం మన’ మను ధార్మిక సంస్థ ఉద్యోగిని – మల్లీశ్వరి గారు-తన మనుమని జన్మదినంబును పరోపకార పారీణుల సమక్షమున జరుపుకొని, సహ శ్రమదాతలకు బలవర్థకములగు పప్పుండలను పంచి, సముచితానందమును పొందిరి!

          రెండు నాళ్ళ తాత్కాలిక విరామము తదుపరి – ‘ పండుగ నాటికైన ఈ మార్గమును శివరామపురము దాక సుందరీకరించవలెనను’ లక్ష్య సాధనకై – బుధవారపు బ్రహ్మ ముహూర్తమున మనము సమైక్య శ్రమకు పూనుకొనదగు స్థలము ‘ సాగర్ మత్స్యాహార ఉత్పత్తి కర్మాగారము’ ఎదుటనే!

          ఇదొక లోకోత్తర త్యాగము!

హిమాలయములు ఎక్కుటా ఇది? ప్రమాదాలను కౌగిలించుట?

గాలిలో వ్రేలాడు ఆటా? నేల విడిచిన సాము చేటా?

కాదుకాదిది కేవలం సొంతూరి మేలుకు చేయు యత్నం

ఇదొక లోకోత్తర త్యాగమ? ఇదొక అంతిమ మహాదర్శమ?    

- ఒకానొక సీనియర్ కార్యకర్త,

    05.02.2023.