2673* వ రోజు...... ... ....           06-Feb-2023

పర్యావరణ ధ్వంసకమయ్యే - ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం మానుదాం.

గంగులవారిపాలెం వీధిలో 2673*వ నాటి స్వచ్చంద దినచర్య!

            సోమవారం(6.2.23) వేకువ 4.28 నుండి సుమారు 2 గంటల పాటు 4+2+4 మంది ప్రమేయంతో ఆ దినచర్య సాగింది. వీరిలో తొలి నలుగురు అసలు, ఇద్దరు కొసరులు, ఇంకో ఇద్దరు సహాయకులు, చివరి ఇద్దరేమో నడకలో భాగంగా అప్పుడప్పుడూ గెస్ట్ ఆర్టిస్టులం!

            అసలక్కడ జరిగిన పనేదో, శాస్త్రి గారు సామాజిక మాధ్యమంలో ఉంచిన దృశ్య సహిత, రహిత ఛాయా చిత్రాల్లో తిలకించుడు! ఆ నలుగురి చురుకుదనమేమిటో - పనితనమేదో వాళ్ల చేతుల్లో మర రంపాలు, పలుగులు ఏ విధంగా కదలాడయో ఫోటోలను చూసినా తెలిసిపోతుంది!

            గత సోమ, మంగళ వారాల్లో ఆస్పత్రి ఎదురుగా జరిగిన నగిషీ పనే ఈ ఉదయానా జరిగింది. ఎక్కడెక్కడో సమీకరించిన రెండు చెట్ల దుంగలు ఆస్పత్రి సందర్శకులో, ఇతరులో కూర్చొనే సౌకర్యవంతమైన ఆసనంగా మారిపోయినవి.

            రెస్క్యూ టీం అనబడే స్వచ్ఛ కార్యకర్తల ఆలోచన కార్యరూపం దాల్చడానికి 4 పని దినాల శ్రమ అవసరమైంది. వాళ్ల వరకు పని మొత్తం పూర్తయింది గాని, ఆ బెంచీకి మంచి రంగులు పూసేపని మిగిలింది.

            పదేళ్ల నాటి మురుగు కాలువా, జంతు కళేబర వ్యర్ధాలూ, నిస్సిగ్గుగా పగలే బహిరంగ విసర్జనలూ ఉండే ఈ వీధి ఇప్పుడింత నయన మనోహరంగా, ఆదర్శంగా, ఉదాహరణ ప్రాయంగా మారడం వెనుక ఏ సత్సంకల్పమూ, శ్రమదానమూ ఉన్నాయో బహిరంగ రహస్యమే!

            కనుక ఇకపై కొనసాగ వలసింది స్వచ్ఛ కార్యకర్తల శ్రమదానమూ, మరింత విస్తృతంగా గ్రామస్తుల అవగాహనా, ఈ వీధి వలె మారవలసినవి ఊరిలోని మిగతా వీధులూ, ఆ సుముహూర్తం కోసం మన ఎదురు చూపులూ!

 

            6.40 కి మాలెంపాటి అంజయ్య గారి కంఠం నుండి స్వఛ్ఛ సుందరోద్యమ నినాదాలు ముమ్మారు వినిపించాయి!

            అది చరిత్రే తేల్చనున్నది!

విజితులెవ్వరొ విజయులెవ్వరొ - వినయ వినమిత గాత్రులెవ్వరొ

అలసులెవ్వరో ఆప్తులెవ్వరొ - స్వాతి శయముల దూరు లెవ్వరొ

సదా ఈ స్వచ్చ సుందర చల్లపల్లికి భృత్యులెవ్వరొ

స్వచ్ఛ సంస్కృతి కర్తలెవ్వరొ - అది చరిత్రే తేల్చనున్నది!

- ఒకానొక సీనియర్ కార్యకర్త,

    06.02.2023.