2675* వ రోజు.....           08-Feb-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి?

ఈ గ్రామ స్వఛ్ఛ - సుందరీకరణ నివేదిక (2675* వ నాటిది!)

            బుధవారం (8-2-23) వేకువ 4.17 కే కళ్లేపల్లి దారిలో సాగర్ ఆక్వా పారిశ్రామిక ప్రదేశంలో - వానలా కురుస్తున్న మంచులో - తొలుత 10 మందితోనూ, క్రమంగా మరో 14 మందితోనూ జరిగిన వీధి పారిశుద్ధ్య బాధ్యత గురించిన ఒక వివరణ ఇది!

            ఇంత చలి వేకువ - ఏ 3.30 కో లేచి, వాహన దీపాల వెలుగులోనూ కనిపించని 23 కిలోమీటర్లను గడిచి, 24 వేల మంది పట్టించుకోని ఈ రహదార్ల భద్రతనీ, శుభ్ర సౌందర్యాలనీ - ఈ 24 మందే తగుదునమ్మాఅని - నడుములు వంచి, చెత్త దుమ్ము - దుర్వాసనల పనికెందుకు పూనుకోవాలి? ఇదేదో కాస్త ఓవరాక్షన్ లాగ ఉందే...అనుకొనే చల్లపల్లి గ్రామస్తులు కొంద రిదివరకుండే వారు గాని ఇప్పుడంత తెలివి తేటలు తగ్గిపోయినవి!

            2675* పని దినాల తర్వాత చాల మంది గ్రామ పౌరుల్నుండి సానుభూతి వర్షిస్తున్నది గాని, అడపాదడపా చందాలందుతున్నవి గాని, ఆచరణాత్మక క్రియాశూన్యత ఇప్పటికీ చెక్కు చెదరడం లేదు!

            ఈ శ్రమదానమేమో కేవలం స్వచ్ఛందం! సానుభూతిపరుల, అభిమానుల ఇళ్లకు పోయి – “దయచేసి ఈ ఊరంతటి మంచి కోరి చేసే శ్రమదానానికి వారానికొక రోజో - రోజుకొక్క గంటో వచ్చి సహకరించండిఅని అభ్యర్థించగలమే గాని, “ఏం - నెప్పా? వారానికొక్క గంట చొప్పున వస్తావా - చస్తావా...అని కఠినంగా అడగలేం కదా!

            ఇంతటి అననుకూల వాతావరణంలో రెండు గంటలు శ్రమించి, 150 గజాల రహదారిలో ఊడ్చి, గడ్డీ, పిచ్చి ముళ్ల మొక్కల్ని తొలగించి, రోడ్ల గుంటల్ని సరిచేసి, ప్లాస్టిక్ గ్లాసుల - సీసాల - కప్పుల దరిద్రాన్ని దుంప తెంచి, చలిలో - మంచులో సైతం సీసాల కొద్దీ మంచి నీళ్లు సేవించి, కార్యకర్తల సామాజిక బాధ్యతో ఆత్మ సంతృప్తో - దాన్నెందరు అర్థం చేసుకొంటున్నారు?

            ఒక్కసారి జై స్వచ్ఛ చల్లపల్లి సైన్యంవాట్సప్ మాధ్యమ చిత్రాన్ని పరిశీలించండి - 6.35 కు  - మంచునూ చీకటినీ సూర్యుడు ఓడించే వేళకు కార్యకర్తల 2 గంటల శ్రమ తర్వాత డ్రైను, బైపాస్ రహదారి ఎగుడు దిగుళ్లూ, సారా కొట్టు ప్రక్కన దట్టమైన కశ్మలాలూ తొలగిపోయి - అక్కడ అంగళ్ల వారికీ ప్రయాణికులకూ ఆహ్లాదకరంగా లేదూ? ప్రతి ఉదయమూ ఆ కాస్త సంతృప్తి చాలు - ఈ స్వచ్చ కార్యకర్తలకు!

            6.40 సమయానికి వాలంటీర్ల వదనాల్లో అలసట కన్నా ఈ ఊరికేదో సాయపడిన సంతోషమూ, మంచునూ - చెడువాసననూ ధూళినీ పీల్చిన దుస్ధితి కన్నా కాస్తైనా వాతావరణ కాలుష్యం తగ్గించాం గదా అనే సానుకూల దృక్పథమూ కనిపిస్తాయి చూడండి! నేటి శ్రమదానాన్ని సమీక్షించిన దాసరి వైద్యుల వారి మాటల్లోనూ అవే ప్రతిఫలిస్తాయి! (మరి - రెండు ముసలి ఘటాలు చిన్నపిల్లలుగా మారి, ఆడుకొన్న దృశ్యాన్ని గమనించారా?) ప్రయాణికులు ఉలిక్కిపడేలా ముమ్మారు నేటి స్వచ్ఛోద్యమ నినాదాలను ఆలపించింది కోడూరు వేంకటేశ్వరావు గారు!

            పాతికేళ్ల నాటి జనవిజ్ఞాన వేదికముమ్మర కార్యక్రమాలూ, అందులో పాల్గొనేందుకు తనకు దొరికిన ప్రేరణనూ దాసరి రామకృష్ణ ప్రసాదు గారు ఒక గేయ రూపంలో వ్రాస్తే నందేటి శ్రీనివాసుడది పాడితే - కార్యకర్తలు స్పందించిన వీడియోను గమనించారా? (ఈ వ్యాసం చివర్లో చదివి చూడండి!)

            నేటి మరో విశేషం - శాస్త్రి మహాశయుని నెలవారీ  చందా అక్షరాలా 5,000/- ఈ సందడిలోనే స్వీకరించడమైనది.

            రేపటి వేకువ బాధ్యతల కోసం మనం మరొక మారు కలువదగిన ప్రాంతం సాగర్ ఆక్వా ఆహారోత్పత్తి కర్మశాలఎదుటనే!

నాటి - నేటి ప్రేరణలు.

బ్రహ్మారెడ్డీ లక్ష్మణ్ రెడ్డీ

పురుషోత్తం అట్లూరు

జె. యస్, జి.వి.కె.లు

కూరపాటీ గుళ్ళపల్లీ

అలనాటి మా ఇన్స్పిరేషన్!

 

            శివన్ నారాయణ్ - వీర్ ఆంజనేయులూ

            రామ్ రావు నల్లూరీ - కోటేశ్వర్ వాసిరెడ్డి

            యోగాలూ - నాగాలూ, రాజాలూ - రమణాలూ

            ఇటీవల మా ఇన్స్పిరేషన్!

వి రామ్ చందర్ నిరంజన్ లూ 

మదర్ లక్ష్మీ ప్రసంగాలూ

ఇరువదేళ్లుగ అనుభవాలూ - అరువదేళ్ల ఆగతాలూ

మరెప్పటికీ మాకు చోదకాలు!

            రెండో శనివారం క్యాంపులూ

            మధ్యలో పబ్లిక్ మీటింగులూ,

            కరపత్ర ప్రచురణలూ - కమిటీ మీటింగులూ

            మాకు హుషారిస్తుంటాయ్ - నిషా చేస్తుంటాయ్!

పద్మ, రాణీ ప్రవచనాలూ

కామ్ ఈశ్వరి సంయమనలూ 

అహం ఎరగని - ఇహం మరవని

ఆప్త మిత్రుల అండదండతొ

నడచు జన విజ్ఞాన వేదిక

నాకు తరగని ఇన్స్పిరేషన్!

- డాక్టర్ DRK ప్రసాద్.

  

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

  08.02.2023.