1928 * వ రోజు....           21-Feb-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడం!   

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం1928* వ నాటి పర్వదిన సముచిత శ్రమదానం.

 

ఈ మహా శివరాత్రి పర్వదినం వేకువ 4.04 నిముషాల నుండి 2 గంటల పైగా – 4.16 దాకా 28 మంది స్వచ్చ కార్యకర్తల సమయోచిత-సముచిత పరి చర్యలు పెదకళ్లేపల్లి మార్గంలోని మేకల డొంక వంతెనకు ఉత్తర-దక్షిణములలో కర్తవ్య నిష్టతో – ఉత్సాహ భరితంగా సాగినవి.

 

పురాణ ప్రసిద్ధమైన ఈ దక్షిణ కాశి మహా శివరాత్రి తిరునాళ్లకు అసంఖ్యాకంగా భక్తులు రావడం పరిపాటే! దురదృష్టవశాత్తు వీరిలో అత్యధికులకు తమ పుణ్య సముపార్జనలో, ఆత్మ సంతృప్తిలో ఉన్నంత శ్రద్ధ పర్యావరణ రక్షణలో ఉండదు. అందుకే చల్లపల్లి స్వచ్చ సైనికులు గత నాల్గు రోజులుగా ఆలయాధికారులను,  ప్రజలను అప్రమత్తం చేశారు. చల్లపల్లి లోని ఇతర ప్రదేశాలను కాక గత 10 రోజులుగా ఈ మార్గాన్నే ఎన్నుకొని శుభ్రపరుస్తున్నారు-వచ్చిపోతున్న వేలాది వాహనదారులకు తమ నిస్వార్ధ శ్రమదానంతో సకాల-సముచిత స్వచ్చతా సందేశమిస్తున్నారు!

 

ఈ కార్యకర్తల 1928 నాళ్ల సుదీర్ఘ సేవా ప్రస్థానంలో- ఇదే కళ్లేపల్లి రహదారిలో వీరి బాధ్యతా నిర్వహణం ఇది వరుసగా 5 వ మహా శివరాత్రి! ఈ నాటి రెండు గంటల శ్రమలో వీళ్లు-

 

- వంతెన కిరుప్రక్కల రహదారిని ½ కిలో మీటరుకు పైగా స్వచ్చ- శుభ్ర-సుందరీకరణం చేశారు. వేంకటాపురం రోడ్డు రద్దు తారు ముక్కల్ని ట్రాక్టర్ లో నింపి తెచ్చి ఇక్కడి రోడ్డు ప్రక్కల పల్లంలో సర్ది రోడ్డును విశాలం చేసి, బలపరిచారు.

 

- కొందరు చీపుళ్లతో – ఇదే తమ దేవాలయమన్నంత శ్రద్ధ తో ఊడ్చి-ఊడ్చి శుభ్రపరిచారు.

 

- మరి కొందరు ప్రక్కల తాడి చెట్ల మధ్య కూడ పిచ్చి మొక్కలు నరికి, గడ్డిని చెక్కి తమ నట్టింటిని శుభ్రం చేసుకున్నంతగా శ్రమించారు.

 

ఇదంతా నిముషానికైదారు తీర్థ యాత్రా వాహనాల రాకపోకల మధ్య ఆ చలిలో- మంచులోనే చెమట క్రక్కుతూ కష్టించారు.

 

[తమ చుట్టూ ఉన్న పౌర సమాజ భద్రత కోసం ఇలా నిరంతరం పాటు బడుతున్న ఈ స్వచ్చ సైనికులదా, కృష్ణలో స్నాన మాచరించి, మహాశివుని దర్శించుకొనే భక్తులదా-ఎవరిది ఎక్కువ పుణ్యం?]

 

ఈనాటి స్వచ్చంద కృషి సమీక్షా సమావేశంలో స్వచ్చ సైనికుల సకాల స్వచ్చంద సేవా ఫలితాల పట్ల డాక్టర్ రామకృష్ణ ప్రసాదు గారు తన నిండు హర్షాన్ని ప్రకటించారు. ధ్యాన మండలి వారు రుచి-శుచికరమైన పులిహోర ను వడ్డించారు.

 

ఈ శ్రమదాన కార్యక్రమం ముగిశాక ఇందులో కొందరు స్వచ్చ సైనికులు అత్యధిక పరిమాణంలో తయారు చేసిన పులిహోర ను పెదకళ్లేపల్లి లో భక్తులకు ప్రసాదంగా పంచి, పర్యావరణ స్పృహ పెంచేందుకు వెళుతున్నారు!

 

పద్మావతి హాస్పటల్ ఉద్యోగి పిండి నాగ జ్యోతి ముమ్మారు ప్రకటించిన స్వచ్చ-శుభ్ర-సుందర సంకల్ప నినాదాలతో మన ఈ పండుగ బాధ్యతలు ముగిసి-

 

రేపటి మన శ్రమదాన వేడుకకై ఇదే రహదారిలో సాగర్ ఆక్వా ఫీడ్స్ సమీపంలో ఉదయం 4.00 కలుసుకొందాం!

             

         ఇది ఇప్పటి భారత కథ

అర్థరథులు-మహా రథులు- అతి రథులూ భారతమున

సమర్థులూ-త్యాగధనులు-సాహసులీ స్వచ్చ సేన!

చంపు-చచ్చు పని వాళ్ళది-స్వచ్చోద్యమ కథవీళ్లది

స్వచ్చ చల్లపల్లి సైన్య చరిత్రమొక భారతమే!

 

నల్లూరి రామారావు  

 స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

శుక్రవారం – 21/02/2020

చల్లపల్లి.