1930* వ రోజు....           23-Feb-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడం!   

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం1930* వ నాటి సంగతులు.

          ఈ రోజు ఉదయం 4.09 - 6.25 నిముషాల వరకు పెదకళ్లేపల్లి మార్గంలోని వైన్స్ షాపు నుండి రోడ్డుకు ఇరువైపులా 100 మీటర్ల వరకు శుభ్రం చేశారు. ఈ శ్రమదానంలో పాల్గొన్న ఔత్సాహికులు 31 మంది.

          కార్యకర్తల్లో చాలా మంది చీపుళ్లకు, గొర్రులకు, కొంతమంది కత్తులకు పని కల్పించి మద్య దుకాణం దగ్గర నుండి చల్లపల్లి దిశలో ఊడ్చి, పిచ్చి, నిరర్ధక మొక్కల్ని, గడ్డిని నరికి, పోగులు చేశారు. వంగిన మొక్కలకు కర్రలు కట్టి, నిటారుగా నిలబెట్టి చక్కగా పాదులు చేశారు. అస్తవ్యస్తంగా రోడ్డు ప్రక్కన, కాలువలోనూ మందు సీసాలను ఏరి వైన్ షాపు ప్రాంతంలో ఒక గుట్ట వద్దకు చేర్చారు. మరికొంతమంది కార్యకర్తలు బందరు రోడ్డులో డా. పింగళి రాధాకృష్ణ గారి ఆసుపత్రి ముందు నర్సరీ ఖాళీ చేయగా మిగిలిన మట్టిని సరిచేశారు.   

          అనంతర సమావేశంలో ఎల్లుండి సాయంత్రం జరగబోయే స్వచ్చ నాగాయలంక వారి 1600* రోజుల వేడుక కార్యక్రమానికి నిరంజన్ రావు గారి ఆహ్వానాన్ని చెప్పడం జరిగింది. వీలైనంత ఎక్కువ మంది కార్యకర్తలు హాజరు కావడానికి ప్రయత్నిద్దాం.

6.40 నిముషాలకు బాల కార్యకర్తలు ఆరవ్, ఆర్యలు ముమ్మారు ప్రకటించిన గ్రామ స్వచ్చ-శుభ్ర-సుందర నినాదాలతో ఈ నాటి మన బాధ్యతలకు స్వస్తి.

రేపటి శ్రమదానం కోసం చల్లపల్లి మెయిన్ సెంటర్ వద్ద కలుసుకుందాం.  

దాసరి రామకృష్ణ ప్రసాదు

మేనేజింగ్ ట్రస్టీ - మనకోసం మనం ట్రస్టు,

ఆదివారం – 23/02/2020

చల్లపల్లి.