1931* వ రోజు....           24-Feb-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడం!   

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం1931* వ నాటి ఊడ్పులు, అమరికలు.

నేటి బ్రహ్మ ముహూర్తపు సమయంలోనూ, పశ్చాత్ కాలంలోనూ-అనగా4.03 నుండి 6.15 సమయం దాకా జరిగిన మన గ్రామ స్వచ్చ, శుభ్ర-సుందర ప్రయత్నంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న బాధ్యతాయుత పౌరులు 31 మంది. (చల్లపల్లిలో పుట్టని వారూ, ప్రక్క ఊళ్ల నుండి వచ్చి చాకిరీ చేసే వాళ్లతో కలిపి!)

ఈనాటి స్వచ్చ-శుభ్ర-సుందరీకృత ప్రాంతం అటు నాగాయలంక దారిలోని ఇంధన కేంద్రం మొదలు బందరు దారిలోని యడ్ల వారి వీధి దాకా, రెండు గంటలకు పైగా ఈ క్రమ శిక్షకులు సాధించిన వేవనగా:

- అవనిగడ్డ మార్గంలోని బంకు దగ్గరి చిన్న ఉద్యానం, పాతిక ముప్ఫై షాపుల ముందరి కంగాళీలు, మూడు రోడ్ల కూడలి విశాల ప్రాంతం, మరొక ఇంధన కేంద్రం, చిన్న కార్ల స్టాండు, ATM కేంద్రం, తోపుడు బళ్ల-టిఫిన్ బళ్ల, హోటళ్ల, కూరల అంగళ్ల నానాజాతి వ్యర్ధాలు, రెండు గుడుల ముంగిళ్లు అన్నిఇంకొక మారు శుభ్ర-సుందరం చేయడం.

- జాతీయ రహదారి తెల్ల వారే సరికి తన మీది ఇసుక-దుమ్ము-ధూళి, ఇతర అనర్ధాలు తొలగి సువిశాల సుందరంగా- ఈ కార్యకర్తల కృషి ఫలితానికి దర్పణంగా కనిపించడం.

- కొసరుగా బందరు దారి నుండి రైతు బజారు దాక కొందరు కార్యకర్తలు అప్పటికప్పుడు నిర్ణయించుకొని-మిగిలిన వాళ్లు కాఫీ-టీ ఆస్వాదనలో ఉన్నప్పుడు చకచకా ఊడ్చి రావడం.[రథం ముగ్గు వేస్తూ ఒకామె ప్రక్క- బజార్లు దాటి మరో ఊరి కెళ్లిపోయిందని పాత జోకు గుర్తొచ్చి, 6.30 దాటినా వీళ్లు ఆరుగురూ ఊడ్చుకొంటూ ఎటు వైపు పోయారోనని మిగిలిన వాళ్లు కంగారుపడడం కూడా!]

నేటి దైనందిన కృషి సమీక్షా సమావేశంలో:

- 6.45 నిముషాలకు దాసరి (హీరోషోరూం)శ్రీనివాస రావు తన కొద్ది రోజుల స్వచ్చ శ్రమదాన గైరు హాజరీకి విచారం వెలిబుచ్చి, ముమ్మారు పలికిన స్వచ్చ-శుభ్ర-సంకల్ప నినాదాలతో నేటి మన బాధ్యత వాయిదా పడగా-

- నిన్న 62 ఏళ్ల నాటి పల్లపాడు ఎలిమెంటరీ విద్యాభ్యాస షష్టి పూర్తి కార్యక్రమంలో నాకు, శివకుమారికి (చల్లపల్లి స్వచ్చ-సుందర కార్యకర్తలమనే  పేరుతో) ఘన సన్మానం జరగడాన్ని నేను ప్రస్తావించాను.

రేపటి మన స్వచ్చంద శ్రమదాన దీక్షను బందరు రహదారిలోని “కీర్తి ఆసుపత్రి” దగ్గర ప్రారంభిద్దాం!

       ఇదొక ఘనతా? ఇదొక ధాన్యతా?       

రెండు వేల దినాల పైగా- రెండు లక్షల గంటల పైగా

స్త్రీలు-వృద్ధుల నిత్య సేవల చేత పరిపుష్టమౌతున్నది

వందలాదిగ కార్యకర్తల త్యాగములనూ భరిస్తున్నది

ఎంత ధన్యతొ- ఎంత ఘనతో- ఈ మహత్తర చల్లపల్లిది!      

నల్లూరి రామారావు

స్వచ్చ చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

సోమవారం – 24/02/2020

చల్లపల్లి.