2766* వ రోజు...........           13-May-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడదగునా?

                 27 మంది ఊరి పారిశుద్ధ్య కార్యకర్తల శ్రమ విన్యాసాలు- @2766*

          ఆ విన్యాసాలు శనివారం (13.5.23) వేకువ సమయానివైతే- వారిలో డజను మందివి మరీ 4. 13 కే కనిపిస్తున్నవి ! కార్యకర్తలు ముందు గా ఆగింది పాత ప్రభుత్వాస్పత్రి దగ్గరి భోగాది ప్రకాశ రావు ఇంటి వద్దే గాని, వెంటనే కత్తులూ- డాళ్లు - దంతెలూ- చీపుళ్లూ ధరించి, కాలుష్యాన్ని వేటాడింది మాత్రం - ఆ బైపాస్ వీధిలో - అక్కడికి పడమర భాగాన్ని!

          వాలంటీర్ల గుంపు పరిమాణం బట్టి చూస్తే-వాళ్ల పురోగమన  జైత్ర యాత్ర ప్రాత కస్తూర్బాయి ఆసుపత్రి దాటి పోవాలి! అలా జరగకుండ అడ్డుపడినవి బైపాస్ వీధికి దక్షిణోత్తర భాగాల ఉద్యానాలే! ఒక్కటైతే - ఏకంగా 20 మంది కార్యకర్తల శ్రమను బలిగొన్నది!

          మరొకమారు తటవర్తివారి భవన పరిసరాలూ,రాధానగర్ వీధి మొదలూ ఏడెనిమిది మంది శ్రమకు ఆహ్వానం పలకడం కూడ నేటి స్వచ్ఛకార్యక్రమం రాశి తగ్గడానికొక కారణం! దుర్భర వాతావరణ ప్రతి బంధకం మరొక కారణం -  కార్యకర్తల దుస్తులు చెమటతో తడిసి - ఉక్కపోతకు ముఖాలు అలిసి శారీరక శక్తుల్ని పీల్చేస్తున్న వేసవి తడాఖాలో - ఇంతటి శ్రమదానమే ఆశ్చర్యావహం కదా!

  పైగా వీధి శుభ్రతలకు నేడు పాల్పడ్డకార్యకర్తల వైవిధ్యం చూశారా? రైతులు- నర్సులు- ఉద్యోగినులు- విశ్రాంతోద్యోగులు- వ్యాపారులు- విశేషించి నలుగురు వైద్యులు - అందులో ఒకాయనది 84 వ పుట్టిన రోజట - మరి ఇందరు గ్రామ ప్రముఖులు రోడ్లు ఊడ్వడానికీ కంపుల కశ్మలాలెత్తడానికీ- ఇన్నేళ్లుగా, ఇంత పట్టుదలగా కష్టించడమేమిటో - ఫంక్షన్ హాల్స్ లో కాక - రోడ్డుమీద- మురికి గుడ్డల చెమట సుగంధాల మనుషుల నడుమ - పుట్టినరోజు వేడుకలెందుకో- తొమ్మిదేళ్లుగా ఈ క్రొత్త సంస్కృతి పరమార్థ మెట్టిదో కాస్త ఆలోచించండి?

 [ఆలోచించడమంటే అర్ధాన్ని శ్రీశ్రీ ఇలా ప్రకటించాడు:

ఆలోచించడమంటే-

ఊకను దంచడం కాదు, ఊహను పెంచడం- వ్యధల్ని చించడం.

సుధల్ని పంచడం.....]

          ఇంతటి అననుకూల వాతావరణంలో గంటన్నర కృషి తో- 70-80 గజాల బైపాస్ వీధిలో పుట్టుకొచ్చిన వ్యర్థాలు ట్రాక్టర్ నిండుగా !

          చకచకా ఆ గుట్టల్ని ముందు డిప్పల్లోకీ, తదుపరి ట్రక్కులోకి ఒక్క ఉదుటున – 20 నిముషాల్లోనే నింపిన ఐదారు గురి సంతృప్తి ఎడదల్లో మెండుగా !

నేటి సమీక్షా సభ విశేషాలు :-

1)మాలెంపాటి గోపాల కృష్ణుల వారి జన్మ వేడుకలో పంచిన కేకులు, వారి శతమానం కోసం జరగవలసిన 16 మార్ల శుభా భినందనలూ;

2) ఊరి వేకువ శ్రమదానంలోకి క్రొత్తగా ప్రవేశించిన యువ వైద్యురాలు - కొర్రపాటి ప్రతిమ శ్రమ ప్రయత్నమూ,

3) నేటి స్వచ్చ- సుందరోద్యమ నినాదాల్ని నేనూ- సహ కార్యకర్తలూ ప్రకటించిన విధమూ,

“ జై స్వచ్ఛ-  సుందర చల్లపల్లి - జై జై స్వచ్ఛ సుందర చల్లపల్లీ!

“ స్వచ్ఛ సుందర- ఆరోగ్య చల్లపల్లిని - సాధిస్తాం, సాధిస్తాం!

  “ స్వచ్ఛ సుందర  - ఆనంద చల్లపల్లిని సాధిస్తాం, సాధిస్తాం!

  “ స్వచ్ఛ – సుందర- అభ్యుదయ చల్లపల్లిని సాధిస్తాం, సాధిస్తాం!

4) ఈ నెలకుగాను స్వచ్ఛ క్యాకర్తల ఆర్థిక విరాళ వివరాలు :

- ప్రాతూరి శాస్త్రి మహోదయుని, 5000/

-కోడూరి వేంకటేశ్వరుని 520/-

-(ఎవరిదో ఏమిటో తెలియని) 500/ వితరణ -వేముల (షణ్ముఖ) శ్రీనివాసునిది!

        అందరి సమష్టి నిర్ణయంగా - రేపటి వేకువ శ్రమదానం కూడ ఈ బైపాస్ వీధిలోనే- శిధిల కస్తూర్బాయి ఆస్పత్రి వద్ద నుండే!

         ఐకమత్యం నిలువ వలెనోయ్

జాగృతములై - శక్తిమయమై జనపదంబులు మెలగవలెనోయ్

శుభ్రముగ - ఆహ్లాద కరముగ - శుభంకరముగ వెలగ దగునోయ్

స్వచ్ఛ శ్రామిక కార్యకర్తల ఐకమత్యం నిలువ వలెనోయ్

స్వచ్ఛ - సుందర చల్లపల్లె జానపదులకు ఉదాహరణోయ్ !

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   13.05.2023.