2767* వ రోజు...........           14-May-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడదగునా?

                        వీధి మెరుగు బాటు కోసం 2767* వ ప్రయత్నం!

ప్రయత్న కారులు 35 మంది! నికర కార్యకర్తలు, ముగ్గురు కొసరు వాళ్ళు!  వెరసి - బైపాస్ వీధిలో 38 మందితోగూడిన చెప్పుకోదగ్గ బలగం !   వేకువ 4.25 నుండి తూర్పున కర్మసాక్షి బారెడు పైకెగ బ్రాకే దాక !

          ఇది చల్లపల్లి గ్రామ వీధుల్లో- ఏదోక చోటచిరకాలంగా జరిగే తంతే!  అసలీ కార్యకర్తల జాతే ప్రత్యేకం; శ్రమదానానికి వాళ్ళెంచుకొనే పనులే విభిన్నం; వాళ్లు పోటీ పడేది మురుగు- పేడ - బురద - కరుకు పనుల్లో; పని జరిగేదైతే వేకువ బ్రహ్మ కాలం; ఇక ఏరోజు కారోజుగౌరవ ప్రదం కాని పారిశుద్ధ్య కృషితో పొందే సంతృప్తేమో అమూల్యం!

            "లోకోః భిన్నరుచిః " అన్నట్లుగా - చల్లపల్లి ప్రజానీకంలో కూడ ఎంత వైవిధ్యం! ఈ శ్రమదాన వైభవాన్ని అభిమానించి -  ఆరాధించేవాళ్లు,  అండ దండలిచ్చి - పెంచి, పోషించేవాళ్ళు - ససేమిరా పట్టించుకోనివాళ్లు....

          అందుకతీతంగా అనివార్యంగా సుదీర్ఘ శ్రమదానం లో మరొక అంకంగా - సామాజిక వేత్తలకు ఆశావహంగా – ప్రయోగాత్మకంగా – పారదర్శకంగా  గ్రామ ప్రమోదదాయకంగా ఈ ఆదివారం(14-5-23) నాటి స్వచ్ఛ కార్యకర్తల శ్రమరీతులు!

 - ఎందుకోగాని, ముగ్గురు మళ్లీ నిన్నటి చోటనే- రాధా నగర్ దగ్గరే పని చేస్తూ కనిపించారు.

- సుందరీకర్తలు + భోగాది ప్రకాశరావు + ఈరోజు తళుక్కు మన్న సతీష్ ( ప్రాత కార్యకర్త) ఒక మినీ ఉద్యానాన్ని పట్టి పట్టి శుభ్ర- సుందరీకరించడానికి బాగా శ్రమించారు.

- బైపాస్ దారి ఉత్తరాన ట్రాన్స్ఫార్మర్ సమీపాన 10-12 మంది చేసిన పారిశుద్ధ్య కృషి - చేసినవాళ్లకూ, చూసిన వాళ్లకూ ఎంత సంతోషంగా ఉన్నదని!

బైపాస్ వీధి కశ్మలాల మీదే కేంద్రీకరించవలసి ఉండగా - ఏడెనిమిది మంది ఉత్తరం దిశగా సూరి డాక్టరు వీధిలోకి చొరబడ్డారు - 40 నిముషాలు ఆ బజారులోనే సరి పోయింది - అక్కడి డ్రైను కూడ ఇప్పుడు బాగుపడింది.

- మరోముగుర్నలుగురు చిల్లర దుకాణం / శీతలపానీయ దుకాణం దగ్గర ఊడ్వడం సరే అందులో ఒక ఎడమ వాటం కార్యకర్త మసక చీకటిలో- తాటాకుల గుట్టల- గుబురు చెట్ల మధ్య గడ్డి చెక్కడమే - పిచ్చి మొక్కల్ని నరకడమే కొంత భయా స్పదంగా అనిపించింది.

      ఎందుకంటే తొండల- సరీసృపాల చోటది!  

       ఇలా ప్రతిదీ వివరించుకు పోవాలంటే మళ్లీ వ్యాస విస్తరణ భీతి!

          తక్కిన శ్రమదాన సంగతు లట్లా ఉంచి, నేను తప్పక పరిశీలనగా చూసేది, సంతోషించేదీ 15-20 నిముషాల తుక్కు లోడింగు దృశ్యం ! ఆ సందర్భంలోనే 10 మంది కార్యకర్తల ఉత్సాహం, జవమూ, సత్త్వమూ విస్తుగొలిపేది!

          ఇది  ఆటవిడుపు- ఆదివారం కావడం వల్లా,  ముఖ్య గాయకుని అత్యుత్సాహం వల్లా - కార్యకర్తలు ఒకటో- రెండోకాదు- మూడు మంచి పాటలు వినగలిగారు!

          నిన్నటి లేదా మొన్నటి జన్మదిన బాలుడు-గోపాలకృష్ణుడు స్వచ్ఛ- సుందరోద్యమానికి 2000/- విరాళం సమర్పించాడు.

           పాటలకు ముందుగానే ఆస్థాన గాయకుడే దైనందిన స్వచ్ఛ- సుందరోద్యమ నినాదాలు ప్రకటించాడు!

          - నేటి కొసరు కార్యకర్తలిద్దరు - దివ్యతేజ -  అంజనీ కుమార్లు ముఖ్యంగా రెండవవారు- "చల్లపల్లి స్వచ్ఛంద శ్రమదానమంటే ఇలా ఉంటుందా? ఇంత ఉత్సాహ ఉద్వేగ భరితంగానా...” ? అంటూ ఆశ్చర్యపోవడమూ –

          బుధవారం నాటి శ్రమదానం కూడ ఇదే వీధిలో- కమ్మ్యూనిస్టు వీధి దగ్గర నుండే అనే నిర్ణయమూ జరిగిపోయినవి!

       కాలమహిమ కాదు సుమీ!

కాలమహిమ కాదు సుమీ కార్యకర్త శ్రమదానం

అనాలోచితం కాదీ అరుదగు స్వచ్చోద్యమం

ఒక సామాజిక బాధ్యత ఊపందిన ఒక దృశ్యం !

ఒక సామూహిక యత్నం ఒనగూర్చిన ప్రయోజనం!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   14.05.2023.