2768* వ రోజు....... ....           15-May-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడదగునా?

2768* వ నాటి రెస్క్యూ స్వచ్చ చర్యలు!

            ఇది సోమవారం కనుక - మిగతా కార్యకర్తల సొంత కార్యక్రమాల నిమిత్తం పారిశుద్ధ్య ప్రయత్నాల ఆటవిడుపు కనుక పరిమిత సంఖ్యాక రెస్క్యూదళం రంగంలోకి దిగింది?

            15-5-23 వేకువ 4.30 కే వాళ్లు చేరుకొన్నది బందరు జాతీయ రహదారిలోని అమరావతి రాజ భవనం దగ్గరకు!

            పలుగూ పారల్తో శ్రమించినది ఒక మట్టి గుట్టను త్రవ్వి, అవసరమున్న మరొక వీధిలోనికి తరలించేందుకు!

            మరి ఆ మట్టేమో పంచాయతీకి చెందినదీ, ఏ రెండు నెలలనాడో కేంద్ర జలవనరుల మంచి నీటి సరఫరా కోసం త్రవ్వగా వచ్చినది!

            సదరు మట్టి కాస్త సారవంతమనీ, మొక్కల పెరుగుదలకు దోహదకరమనీ గ్రహించి, గంటన్నర పాటు శ్రమించి - ట్రక్కులో నింపి - అందుకవసరమైన చెమటలు చిందించి - అద్దానిని గంగులవారిపాలెం వీధికి తరలించినది ఐదుగురి బృందమైతే ఉదయపు నడకకు బయల్దేరి - గ్రామ రక్షక దళాన్ని, వారి కృషినీ పరిశీలించి, ప్రశంసించిన సూపర్ సీనియర్ కార్యకర్తలిద్దరు!

            తామనుకొన్నది సాధించాక - సంతృప్తికర వదనాలతో తమ స్వచ్చోద్యమ సారాంశ సందేశ పూర్వక నినాదాలు చెప్పి -  చెప్పించినది కస్తూరి శ్రీనివాసుడు!

            తొడలు గొట్టుట తెలివి కాదని -

తొమ్మిదేళ్ల స్వచ్ఛ ప్రగతికి తొడలు గొట్టుట తెలివి కాదని-

కొంత స్వార్థమునదుపు చేస్తే - సొంత బాధ్యత నిర్వహిస్తే

ఉన్న ఊరికి మేలు చేస్తే - ఉత్తమోత్తమ సేవలాఅని

విజ్ఞులగు ఈ కార్యకర్తలు విశద పరచుట న్యాయమేనని....

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   15.05.2023.