2769* వ రోజు....... ....           16-May-2023

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడదగునా?

గ్రామ భద్రతా చర్యలు 2769* వ నాడు కూడా!

            మే నెల పదునారవ వేకువ సమయం - ముహుర్తం ప్రాతదే 4:306:00 ల నడుమ! స్థలం గంగులవారిపాలెం వీధి! తలపెట్టిన పని - చెట్ల సుందరీకరణ/రక్షణాత్మక చర్యలు! కార్యకర్త లైదుగురు!

            ఐతే - కొద్దిపాటి పని తరువాత వాళ్ల ప్రణాళిక మారి, పని వాయిదా పడి, బందరు జాతీయ రహదారిలోకి ప్రవేశించింది! చెట్టు కొమ్మల వ్యవస్థీకరణకన్న ఈ వీధిలో చెట్ల నీడే ముఖ్యమనిపించిందట!

            బందరు దారిలో ఎప్పటికప్పుడు డ్రైన్ల నుండి తోడి - ఎండుతున్న బురద గుట్టలున్నవి, అక్కడక్కడా ఇళ్ల, షాపుల ఎదుట చిన్నపాటి మన్ను - ఇసుక పెంకు - రాతి ప్రోగులున్నవి, ఇవి కాక ఇదే వీధిలో - స్వచ్ఛ సుందర టాయిలెట్ల దగ్గర - సచివాలయం ప్రక్కన - ఖాళీ పల్లం ఉన్నది.

 

            అన్ని రకాల మన్ను గుట్టల్ని ట్రాక్టర్లో నింపుకొని, ఆ పల్లాన్ని పూడ్చితే – అక్కడ నీళ్ళు నిలవకుండా ఉంటాయని రెస్క్యూ టీం వారికి ఆలోచన వచ్చింది.

            ఇటు రహదారి మీద అడ్డాలు తొలిగే - అటు చిన్న కార్ల స్టాండుకు సౌకర్యం కలిగే ఉభయతారకమైన ఊరి మెరుగుదల కృషి గంటన్నరలో కార్యకర్తల పంచకం పూర్తి చేసింది!

            చల్లపల్లి స్వచ్చోద్యమ నిత్య కార్యకర్త మాలెంపాటి అంజయ్య ప్రకటించిన శ్రమదాన నినాదాలతో వాళ్ళ నేటి కార్యక్రమం ముగిసింది!

            రేపటి వీధి శుభ్రతా చర్యల కోసం కమ్యూనిస్టు వీధి చివర - మా ఖాళీ స్థలంలో మనం కలవవలసి ఉన్నది!

          అర్థ రహితం శూన్యఫలితం

మనం చేయని మంచి పనులను ఎవరికో నీతులు వచించుట

స్వయంగా మనమాచరించక ఎదుటి వాళ్లకు బోధ చేయుట

అర్థ రహితం శూన్యఫలితంఅని గ్రహించని వారి కోసం

స్వచ్ఛ సైన్యం నిత్య నూతన శ్రమ విలాసం చూచుచున్నాం!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

 

   16.05.2023.