2770* వ రోజు....... ....           17-May-2023

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడదగునా?

2770* వ నాటి గ్రామ స్వచ్ఛ భగీరధ ప్రయత్నం!

            ఆ చెప్పుకోదగ్గ పూనిక పాతిక మంది పుణ్యజీవులది (ఇందులో ఇద్దరిది అతిథి పాత్రలనదగ్గవి), బుధవారం (17/05/23) వేకువ నాలుగుంబావుకే ఆత్రపడిన సదరు సదుద్యోగం కమ్యూనిస్టు వీధి - బైపాస్ మార్గాలలోనూ, అస్మదీయ ఖాళీ నివేశన స్థలంలోనూ!

            ఈ రోజువారీ స్వచ్చ - సుందరోద్యమ చరిత్రను క్రమం తప్పక చదువుతున్న పాఠక జీవుల సంగతేమో గాని - వేలరోజులుగా మమేకమై బాగా దగ్గరగా చూస్తున్న - ఎడనెడా చేస్తున్న నాకు మాత్రం కొంచెం కూడ విసుగు లేదు సరి గదా మరో దశాబ్దమైనా - కలంలో ముషీరసం ఇంకిపోయేదాక వ్రాస్తూనే ఉండాలనిపిస్తున్నది!

            ఇక - కార్యకర్తల సంగతా? ఈ వేకువ ఇద్దరు వయోధిక శ్రమజీవులు స్వగతంగా అనుకొంటున్న - నాకు వినిపించిన మాటలివి!-

            ఊరి శ్రమదానోద్యమ మూలకారక వైద్యుడు - ఈ ఖర్చుల్ని, అంతకుమించి ఇన్ని సాధక - బాధక మానసిక వత్తిళ్లనెలా తట్టుకోగలుగుతున్నాడో! దశాబ్దం పాటు భరించి - భరించి, ఆయనెప్పుడైనా కాడి దించేస్తే - ఈ ఊరి స్వచ్ఛ స్వస్త - సౌందర్యాల మాటేమిటో! అంతకుమించి ఇంత సమైక్య- సదుద్దేశ్య పారిశుద్ధ్య సేవా కార్యక్రమం లేకుంటే మనకేం తోస్తుందో.....

            మరి - చల్లపల్లి శ్రమదాన మూల పురుషుడేమో సమీక్షాకాలంలో – “ఇంతటి కఠిన క్రూర వాతావరణంలో ఈ పాతిక మంది గంటన్నర పాటు ప్రతిఫలమాసించకుండా పాటుబడినందుకు జేజేలుపలికాడు!

            అసలీ రెండు అభిప్రాయాల క్రోడీకరణలోనే ఉన్నది ఒక గ్రామ స్వచ్చ సుందరీకరణోద్యమ ఘనత!

            సంస్కృత భాషలో ఒక పండిత సూక్తి ఉన్నది

            మణినా వలయమ్ వలయేనమణిః

            మణినా వలయేన విభాతి కరమ్...

            (మణి వల్ల ఆభరణానికీ ఆభరణం వల్ల మణికీ -

            ఆ రెండిటి వల్ల కడియాన్ని ధరించిన చేతికీ అందం వస్తుంది!)

            అలాగే ఉద్యమ ప్రవర్తకుని వల్ల కార్యకర్తలకూ, కార్యకర్తల కఠోర శ్రమ వలన నాయకునికీ, ఉభయుల సమష్టి ప్రయత్నంతో ఊరికీ ప్రయోజనం చేకూరింది!

            ఈ వేకువ కాల శ్రమదానాన్ని భగీరథ ప్రయత్నంఅని శీర్షిక ఎందుకు వ్రాయాలంటే 2770* నాళ్లుగా గ్రామ అస్తవ్యస్తతల మీద గజనీ - ఘోరీ తరహా దండయాత్రలు చూసి కాదు; కొందఱు పదేసి పర్యాయాలు నీళ్ళు త్రాగుతూ - పట్టువదలక, బెట్టు సడలక గంటన్నర పాటు వీధి కాలుష్యాలకన్నా క్రూరమైన వాతావరణం మీద చేసిన పోరాటాన్ని చూసి!

            ఆ పోరులో ఒక ఘట్టం - ఒకాయన మురుగు కాల్వ అంచున జారుతున్న కాళ్లు నిలద్రొక్కుకుంటూ పాతిక గజాల డ్రైను చెత్త లాగి, సిల్టు తీసి, నిలిచిన మురుగుకు నడక నేర్పడం!

            రెండవ దృశ్యం - సుందరీకర్తలనబడే ముగ్గురు కరెంటు తీగల్ని తాకుతున్న చెట్టు కొమ్మల్ని నిచ్చెనెక్కి, తొలగించి, సుందరాకృతిగా మలచడం! 

            మూడవది ఏడెనిమిది మంది కత్తులు, దంతెలు, చీపుళ్లతో 10 - 12 సెంట్ల ఖాళీ స్తలాన్ని శుభ్రపరచడం!

            రోడ్డు మార్జిన్ల గడ్డి చెక్కి, పనికిమాలిన మొక్కల్ని తొలగించి, వీధిని విశాల పరచిన దృశ్యం నాలుగవది!

            చీపుళ్లతో బాట నూడ్చిన, వ్యర్థాల్ని ట్రక్కులో నింపిన పని దృశ్యాలు మాత్రం వర్ణనాంశాలు కావా?

6.25 కు నేటి తుది సమావేశంలో:

            - దక్షిణ ప్రదేశ తీర్ధయాత్రలు చేసి వచ్చిన తాతినేని వేంకటరమణ విశిష్టోద్యమ నినాదాలూ,

            ఆనంద సమయంలో దానమూ, బాధల వేళ నిర్ణయమూవలదని శివబాబు సూక్తులూ,

            పలనాటి అన్నపూర్ణ కుటుంబీకులు పంచిన తిరుపతి లడ్డు ముక్కలూ

            రేపటి ఉదయం కూడ కమ్యూనిస్టు వీధి చివరే మన కలయికఅనే నిర్ణయమూ...

            అనంత స్ఫూర్తిగ - అమేయ కీర్తిగ

నిరామయంగా నిస్తేజముగా - నిరుత్సాహముగ గ్రామ స్వచ్ఛతలు

సదాశయంగా - శుభప్రదముగా - ఫలప్రదముగా ఉద్యమ రీతులు

అనూహ్యంబుగా - అనివార్యముగా. అప్రమత్తముగ కార్యకర్తలు

అనంత స్ఫూర్తిగ - అమేయ కీర్తిగ - ఆదర్శముగా గ్రామ దీప్తులు!

- నల్లూరి రామారావు,

   17.05.2023.