1933* వ రోజు....           26-Feb-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడం!   

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం1933* వ నాటి శ్రమ జీవన ఆదర్శం.

 ఈ దినం వేకువ 4.02-6.17 నిముషాల నడుమ జరిగిన గ్రామ స్వచ్చ – సుందరీకరణ కర్తలు 21 మంది. కొన్ని ఇతర కారణాల వల్ల-దూర ప్రయాణం-అనారోగ్యం-వివాహాది వేడుకల వంటి వాటితో నేడు స్వచ్చ కార్యకర్తల సంఖ్య తగ్గింది. ఈ నాటి గ్రామ శుభ్రతా చర్యల ప్రాంతం పెదకళ్లేపల్లి మార్గంలోని దక్కన్ సిమెంట్ దుకాణ పరిసరాలు. ఈ తక్కువ మంది కార్యకర్తలే సుమారు 40 పని గంటల సమయం లో నిర్వహించిన బాధ్యతల వివరాలు:

- ముందుగా నలుగురు స్వచ్చ కృషీ వలులు గంగులవారిపాలెం దారి మొదట్లో కళాశాల ప్రహరీ వెలుపల కత్తిరించిన వెదురు మొక్కల కొమ్మ-రెమ్మల వ్యర్ధాలను, కాలం చెల్లి పీకి వేసిన బంతి మొక్కల తుక్కును ట్రాక్టర్ లో నింపుకొని, శివరామ పురం దారిలో మిగిలిన కార్యకర్తలతో కలిశారు.

- అప్పటి నుండి సదరు దారి ప్రక్కన, డ్రైనులోన పిచ్చి మొక్కల్ని, కంప ను నరికి, గొర్రులతో పోగులు చేసి, ట్రాక్టర్ లోని కెక్కించారు. మొత్తం మీద ఈ తక్కువ మంది- ఈ తక్కువ ప్రాంతంలో నే ట్రక్కు నిండా వ్యర్ధాలు సేకరించి, చెత్త కేంద్రానికి తరలించారు.

- సుందరీకరణ సభ్యులు కూడ మిగిలిన కార్యకర్తలతో కలవడంతో ప్రత్యేకత వచ్చింది.

నిన్న మెహెర్ బాబా జన్మదిన వేడుకలలో భాగంగా విజయవాడ దారిలో వేలాది మందికి జరిగిన భోజన సమారాధన చాల వరకు ప్లాస్టిక్ రహితంగా- హరిత శుభ్రంగా జరిపిన మన కార్యకర్తలు, ఇతర పెద్దలు అభినందనీయులు.

నిన్నటి మరొక విశేషం-స్వచ్చ నాగాయలంక 1600* రోజుల వేడుక. మన కార్యకర్తలు కూడ పాల్గొని, ఆనందించి, అభినందించి వచ్చారు.

నేటి స్వచ్చ ప్రయత్న సమీక్షా సమావేశంలో 6.35 కు నేను ముమ్మారు చెప్పిన గ్రామ స్వచ్చ –సుందర- సంకల్ప నినాదాల తో మన బాధ్యతలకు ముగింపు.

రేపటి మన గ్రామ బాధ్యతా నిర్వహణ కూడ పెదకళ్లేపల్లి మార్గంలోనే-గ్యాస్ కంపెనీ –ఉభయ కళాశాలల మధ్యస్థ ప్రదేశంలోనే కొనసాగిద్దాం.

 

           భావితరముల కొరకు జాగృతి

ఈ మహోద్యమ స్వచ్చ సంస్కృతి-ఈ శ్రమాన్విత త్యాగ విస్తృతి

ఈ సుదీర్ఘ మహోన్నత కృషి-ఇందరిందరి వింత సత్మృతి

భావితరముల మేలు కొరకై ప్రాకులాడే గొప్ప జాగృతి

చల్లపల్లిని ఎల్లకాలం సంస్కరిస్తూ- ప్రమోదిస్తూ-సాగిపోనుందా!    

నల్లూరి రామారావు

స్వచ్చ చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

బుధవారం – 26/02/2020

చల్లపల్లి.