2771* వ రోజు....... ....           18-May-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడదగునా?

చల్లపల్లి స్వచ్చోద్యమ కాలవాహినిలో 2771* వ బిందువు.

            గురువారం(18.5.23) వేకువ 4.17 - 6.00 నడిమిది మా మూలుగా నైతే అహ్లాదకర ఉత్తేజకర ముహూర్తమే! ఏ మంచి పనికైనా నా అనువైన వేళే! కాని - గత మూణ్ణాలుగు రోజుల్నుండి మాత్రం ఈ బ్రహ్మకాలం సైతం వాతావరణపరంగా కఠినమైన అగ్ని పరీక్షగానే!

            తొమ్మిదేళ్లనాడు మొదలై అసిధారావ్రతంగా నడుస్తున్న గ్రామ స్వచ్ఛ - సుందరీకరణకు పూనుకొన్నది రోజు వారీ కూలి పనుల్తో రాటు తేలిన శ్రామికులు కాదు - విద్యాధికులు, ప్రస్తుత, విశ్రాంత ఉద్యోగులు, నర్సులు, డాక్టర్లు, వృత్తి పనివారు, బేహారులు, గృహిణులు! వీరిలో ఎక్కువ మంది మానసికంగా కాకున్నా - శారీరకంగా సుకుమారులు!

            తమ ఊరి మంచి కోరి, ప్రతి వేకువా రోడ్లెక్కి ఏ కరకు, మురికి పనులకైనా వాళ్లు తెగబడడమే పెద్ద వింత! పైగా - సగం మందికి పైగా సోదర గ్రామస్తులు అంటీ - ముట్టని పనులివి!

 

            క్రీస్తుకు ముందు కాలపు సంస్కృత కవి ఒకాయన

            “కాలోహ్యయమ్ నిరవధి ర్విపులాచ పృథ్వీ...

            (నా కావ్య - నాటకాల్ని అర్థం చేసుకోనే సహృదయు లెప్పటికైనా వస్తారు - కాలమనంతమైనది, లోకం విశాలమైనది...)

            అన్నట్లుగానే -

            ఈ గ్రామ స్వచ్చోద్యమకారులు సైతం

            “మా గ్రామ పారిశుద్ధ్య ఉద్యమం ఎప్పటికైనా నూరు శాతం మందిని తనలో ఇముడ్చుకొంటుందిఅనే కృతనిశ్చయంతో సాగుతున్నట్లుంది!

            అందుకే నేటి పాతిక మంది కార్యకర్తలు ఎప్పట్లాగే ఏమంత గౌరవప్రదం కాని తమ పనులు కొనసాగించారు!

            కమ్యూనిస్టు వీధి నుండి విజయనగర్ కాలనీ మొదటి లైను దాక - బైపాస్ వీధి ముస్తాబు చర్యలు యధావిధిగా జరిగిపోయినవి.

            చెట్ల పాదుల సవరణలూ, కొమ్మలు ఖండించి, సుందరీకరణలూ, మురుగుకాల్వ పరిష్కరణలూ, మార్జిన్ల తుక్కులేరి, పిచ్చి చెట్లు తొలగించి, కొన్ని క్రమబద్ధీకరణలూ, సంస్కరణలూ ఏ లోటూ లేకుండానే ముగిసినవి!

            అసలీ నిర్దాక్షిణ్య వాతావరణ పరిస్థితి వల్ల రోజుటి కన్న అరగంట ముందే పనులాపాలని ఒకరిద్దరు ప్రతిపాదించినా - కార్యకర్తలు పనులాపనే లేదు!

6.20 సమయంలో - నేటి కృషి సమీక్షా సమయంలో:

- ఎలుగెత్తి తన ఊరి స్వచ్ఛ - సుందరోద్యమ సంకల్పాన్ని చాటి చెప్పిన పంచాయతీ ప్రెసిడెంటూ,

- ఉక్కపోత కుపశమనంగా కార్తకర్తలకు లభించిన కమ్మని నిమ్మ నీళ్ళూ,

- 31 వ రోజుకు చేరిన సంచలనాత్మక మజ్జిగ పంపిణీ నిర్వహణా,

- స్టేట్ బ్యాంక్, రోటరీ సంస్థల ఆధ్వర్యంలో ఎముకల వైద్య పరీక్షల సంగతి,

            ‘రేపటి శ్రమదాన స్థలం విజయనగర్ - అశోక నగర్ల పరిధిలోఅనే నిర్ణయమూ....

          ఈ స్వచ్చోద్యమం

ఎండల్లో గొడుగు రీతి - చలిలో దుప్పట్ల భాతి 

అక్కరకొక చుట్టం వలె - ఆపదలో ధైర్యం వలె

ఆదరించు నేస్తం వలె - అండ దండలందిస్తూ

చల్లపల్లి నెలాగైన - చక్కబెట్టుటకే గదా!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   18.05.2023.