2772* వ రోజు....... ....           19-May-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడదగునా?

శుక్రవారం 4.13 కే మొదలైన వీధి పారిశుద్ధ్య కృషి @2772*

            19-5-23 తేదీన VJA - MTM బైపాస్ వీధిలో జరిగిన కృషి అది! విజయనగర్లో 2 వ వీధి దాక కుదిరిన శ్రమదానంతో మరొక 50 - 60 గజాల ఉపమార్గమూ, కొసరుగా 2 అడ్డదారులూ తెల్లారి 6.30 తరువాత కళకళలాడుతున్నవంటే - అది పాతిక మంది తలా గంటన్నర పాటుబడితేనే!

            ఊరి పట్ల శ్రద్ధతో, వీధి శుభ్రతల యడ అంకితభావంతో - ఈ పాతిక (ముప్పై- నలభై) మందే కనుక శ్రమించకపోతే :

- రోడ్డుకు ఉత్తరం ప్రక్కన మురుగు డ్రైనుకు చలనం వచ్చేదా? దానిలో ఏపుగా పెరిగిన గడ్డి కాడలూ, సీసాలూ, కొబ్బరి బొండాలూ, చెత్తా తిష్ట వేసుకొనే కూర్చునేవి కాదా?

- అశోక నగర్ తొలి - సజ్జా వీధి మొదట్లో ముళ్ల పొదలూ, వాటి నడుమ ప్లాస్టిక్ కప్పులూ గ్లాసులూ కూల్ డ్రింకు సీసాలూ పోయి ఇలా చూడముచ్చటగా ఉండేదా?

- మురుగు కాల్వబారునా అంచుల గడ్డీ, తిక్క మొక్కలూ, పూల మొక్కల పాదులు కలుపూ ఐదారుగురి శ్రమపూర్వక సమన్వయ కృషితోనే కదా తొలగిపోయింది?

- విజయనగర్ తొలి అడ్డ వీధిలో కొంతైనా ఇప్పుడు మెచ్చదగినట్లున్నదంటే - ఆ పుణ్యం ఈ పాతిక మంది కర్మవీరులదే మరి!

- నలుగురైదుగురు మహిళలు చీపుళ్లను వాడి రోడ్డు దుమ్ము, ఆకులు, పుల్లల అంతు చూశారంటేనూ, దంతెలతో లాగి, గుట్టలు చేసి వ్యర్ధాల డిప్పలు మోశారంటేనూ, వాళ్ల మొహాల నిండా చెమట బొట్లు నిలిచాయంటేనూ - అది ఈ స్వచ్ఛ - సుందరోద్యమం ప్రభావం కాదూ?

            నేటి కాకలు తీరిన కార్యకర్తల్తో బాటు 10 - 15 ఏళ్ల కౌమారులు నలుగురు కష్టించడం విశేషం!

            ఇలాంటి ఉదంతాలే చల్లపల్లి స్వచ్ఛ - శుభ్రతల భవిష్యత్ శుభ సూచకాలు!

            కార్యకర్తల వీరోచిత శ్రమ విన్యాసాల్ని రోజూ గమనిస్తూనే ఉంటాను  - అలాంటి నేటి ప్రత్యేక దృశ్యాలు కొన్ని :

- ట్రాక్టర్ మీద నిలబడి, తుక్కు సర్దుతున్న ఒకాయన నల్లరంగు దుస్తులు తడిసి ముద్దై పోవడం,

- దూరం నుండే కాస్త పొడుగు కార్యకర్త బరువైన తడి చెత్త డిప్పను అవలీలగా దూరం నుండే ట్రక్కు పైకి విసరడం,

- ఏదొక రోజున కాస్త వీలు చూసుకొని, పని ముగిశాక కార్యకర్తలు ఒంటి మీద బట్టలు గనక గట్టిగా పిండితే ఎన్ని లీటర్ల చెమటౌతుందో చూడాలనే ఉత్సుకత!

            దైనందిన శ్రమ సమీక్షకు ముందు ఇలాంటి సరదా కబుర్లే వినిపిస్తుంటాయి!

            దుబాయి, బెజవాడల్నుండి వచ్చిన దాసరి వారసులు నేటి శ్రమదాన భాగస్తులు కావడమూ, వంతుల వారిగా అర్నవ్  ఆరవ్ లు స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలు ప్రకటించడమూ నేటి మరొక విశేషం!

            తలా రెండు గ్లాసులు నిమ్మ నీటి సేవనం ఈ రోజు కూడ!

            గంగులపాలెం వీధిలో మజ్జిగ పంపకం @40

            దాతలు 1. కంఠంనేని రవిశంకర్ గారి పుట్టినరోజు సందర్భంగా మేకా శ్రీనివాసరావు గారు (పాగోలు), 2. రావి విశ్వమోహన్ జ్ఞాపకార్ధం తల్లిదండ్రులు నాగమల్లికోటేశ్వరరావు, మాధురి గార్ల, 3. సోమిశెట్టి రాఘవేంద్ర (గ్లాసుల దాత)

            రేపటి వేకువ శ్రమ వేడుక కూడ ఈ బైపాస్ వీధి - అశోక్ నగర్ దగ్గరే!

      మన స్వచ్చ సుందరోద్యమం

కాస్త కష్టమైనా సరే - జాస్తి సమయమైనా సరే!

లక్షల ఖర్చైన గాని లక్షణముగ తీర్చిదిద్ది

జిల్లాలకు రాష్ట్రానికి దేశానికె  మేల్బం తిగ

చల్లపల్లి నెలాగైన సాన బట్టాలనే గదా!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   19.05.2023.