2773* వ రోజు....... ....           20-May-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడదగునా?

శనివారం విరగడైన బైపాస్ వీధి కాలుష్యం శని! - @2773*

          20.5.23 వేకువ సదరు శని వదలగొట్టింది 35 మంది! 4.15 AM నుండి కొందరు వివిధ వేళల్లో వచ్చినా – అందరిదీ ఏకోన్ముఖ ఉమ్మడి ప్రయత్నమే! వీధి కశ్మల దరిద్రాల్ని చెండాడాక -6.15 కు బాగెన బైపాస్ మార్గాన్ని చూసుకొని – వారిదొ కేరకమైన సంతృప్తే!

          చర్విత చర్వణమైనా - అమూల్యమైన ఈ శ్రమదాన మహనీయత గురించి - ఎంత వ్రాసినా అది అరకొరే!

ఈ పూట శుభ్రపడి, చూడముచ్చటగా కనిపించిన వీధి భాగాలలో :

          ముందుగా ముచ్చటించుకోదగినది అశోకనగర్లోని సజ్జా వీధి! సగం మంది కార్యకర్తల మొండి పట్టుదలతో – పిచ్చి మొక్కలు, గడ్డి గుబురులు అదృశ్యమై, ఆ చిన్న వీధి ఇప్పుడెలా కన్పిస్తున్నదో ఫొటోలో చూడండి!

          తరువాత చెప్పుకోదగినది విజయనగర్ 2 - 3 అడ్డ రోడ్ల నడుమ బైపాస్ మార్గమూ, డ్రైన్లూ, వాటి అంచులూ!

          ‘ప్రతి పూల మొక్కనూ, పాదునూ పరామర్శిస్తూ - అవసరమైతే సుందరీకరిస్తూ - గడ్డిని తప్పిస్తూ – ఆ వ్యర్ధాల్ని గుట్టలు చేసి, ట్రక్కులోనికెత్తుతూ - శ్రద్ధగా చేసే నాణ్యమైన పనులే గాని మ్రొక్కుబడిగానూ, హడావుడిగానూ, నామకార్ధంగానూ చేసే పనులైతే గదా - వాసిని మించి రాశి కనపడడానికి?

          ఈ క్రమంలో ఒక కార్యకర్త చేయి ముళ్లు గీరుకు పోయినా పట్టించుకోలేదు! అసలీ వాతావరణమే అర్ధం కావడం లేదు - పైకి చల్లగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఉక్కపోసి, వళ్లు తడిసి, ఆకుల నూగు - దుమ్ము అంటుకొని మహా చిరాకు పుడుతుంది - (ఇదంతా చూస్తున్న నా బోటివాడికే – కార్యకర్తలు మాత్రం పని ఆపరు!) పైగా ఇదేమన్నా బట్టల్నలక్కుండా – ఫొటోల కోసం చేస్తున్న శ్రమదానం కాదాయే!

          కావాలంటే ఎవరైనా – ఏ వేకువ జాములోనైనా వచ్చి చూడవచ్చు - ఇంత ఉక్కపోతలో - డ్రైను మురుగు ఘాటువాసన నడుమ ఈ వేకువ ముగ్గుర్నలుగురు ఎన్ని ప్లాస్టిక్ సంచులు, మద్యం సీసాలు, త్రాగేసిన కొబ్బరి బొండాలు, సిల్టు బైటకి లాగారో!

          పురుషులు సరే - మహిళలు - అందునా లబ్ద ప్రతిష్టులైన డాక్టరమ్మ, సర్పంచమ్మలు కూడ ఈ మురికి పనుల్లో!

           తెల్లారే సరికల్లా ఈ పూట కూడ వ్యర్ధాలతో ట్రక్కు నిండినది - స్కూలు పిల్లలిద్దరు చెమటలు క్రక్కుతూ పనిచేసుకుపోయారు! పని మధ్య ఇద్దరు కార్యకర్తలు దివంగత వాసిరెడ్డి కోటేశ్వరుని సమాజ సేవా నిరతిని గుర్తుచేసుకొన్నారు కూడ!

          ఈ ఉదయం కూడ కాస్త ముందుగా - 6.00 కు ముందే పని విరమించాలనే కోరిక తీరలేదు - ఇద్దరైతే మరీ ఆలస్యంగా పని ముగించారు!

          శ్రమదాన సమీక్షకు ముందు మెండు శ్రీనివాసుడు సాధికారికంగా ముమ్మారు పల్కిన స్వచ్ఛ - సుందరోద్యమ నినాదాలు, ఆ పిమ్మట అడపా వాని సూక్తులూ, అంతకు ముందు సేవించిన షరబత్ పానీయమూ,

          నా నిన్నటి జిజ్ఞాస తీర్చేందుకన్నట్లుగా ఒక కోడూరు వేంకటేశ్వరుడు తన చొక్కా విప్పి గట్టిగా పిండి సుమారు 100ml చెమటను దారగా భూమికర్పితం చేశాడు. (మరి – ఇతగాడు మిగిలిన బన్నీ, ఇతరములన్నీ పిండితే....మిగిలిన కార్యకర్తలు కూడా ఇలా చేసి ఉంటే?)  

          తన పెళ్లి నాటి సంస్కరణగా స్వచ్చోద్యమ ఖర్చు నిమిత్తం తగిరిశ సాంబశివరావు గారి 500/- విరాళమూ,

 

          రేపటి వేకువ మనం కలిసి శ్రమించే స్థలం అశోక్ నగర్ - విజయ్ నగర్ల ప్రాంతమనే నిర్ణయమూ....

          సంచలనం ఐపోయెను!

నవ్వుల పాలైపోయిన నాపచేనె పండినట్లు

పడిన చోటు నుండే గెలుపు బాట మొదలు పెట్టినట్లు-

అకుంఠ దీక్షగ సాగిన అలుపెరుగని ‘చల్లపల్లి

స్వచ్చోద్యమ’ మీనాడొక సంచలనం ఐపోయెను!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   20.05.2023.