2774* వ రోజు....... ....           21-May-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడదగునా?

స్వచ్ఛ - శుభ్ర - సుందర గ్రామం తయారీలో - 2774*నాడు.

            "మేకింగ్ ఆఫ్ క్లీన్ - గ్రీన్ -  బ్యూటిఫుల్ చల్లపల్లి"లో ఈ ఆదివారం (21.5.23) వేకువ తమ సమయ - శ్రమ సమర్పక ధన్యులు 34 మంది! తామున్న ఊరి మంచికోరి వారు సమర్పించిన కాలం సుమారు 50 పని గంటలు!

            సదరు ధన్యజీవుల అమూల్య స్వేదంతో పునీతమై బాగు పడినవి 1 - 2 వార్డులకు చెందిన అశోకనగర్ - వడ్లమర ప్రాంతాలు!  ఉన్నంతలో ఈ ఊళ్లో ౼ ఎంతో కొంత స్వచ్ఛ- శుభ్ర స్పృహ ఉన్న వీధులేగాని ఇక్కడ కూడ ఎంగిలాకులకూ, ఖాళీ సీసాలకూ, గ్లాసులకూ, ఇటీవల వానలకు ఏపుగా పెరిగిన గడ్డీ, పిచ్చి మొక్కలకూ లోటు లేదు!

            మురుగు నీటి కదలికల నాపుతున్న, ఏపుగా పెరిగిన గడ్డినీ, నానా రకాల తుక్కుల్నీ ఈ స్వచ్ఛ కార్యకర్తలు కాక ఎవరు పరిష్కరిస్తారు? వరి చెత్త బళ్ల నుండి జారిన ఎండు గడ్డికీ, మురుగు కాల్వ అంచుల దర్భ జాతి మొక్కలకీ, వాటి వల్ల నడక మరచి, కుంటుతున్న మురుగు ప్రవాహాలకీ బాధ్యత తీసుకొనేది ఈ 30- 40 మంది శ్రమదాతలు కాక ఇంకెవ్వరు?

            అందుకే పౌర బాధ్యతలు మరచిన గ్రామస్తుల కారణంగానే -ఊరంతటి కర్తవ్యాలు తలకెత్తుకున్న ఈ స్వచ్ఛ కార్య కర్తల అవసరం!

            అదేదో న్యూజిలాండట ! ఆ ప్రజల్లో విశ్రాంత వయోవృద్ధ ఉన్నతోద్యోగులంతా క్రమం తప్పక - ప్రతీరోజూ 3-4 గంటల చొప్పున ఇలాంటి పారిశుద్ధ్య - సుందరీకరణ పనులకంకితులైపోతారట!

            ఈ చల్లపల్లనేది కొంతవరకైనా ఆ లక్షణమున్న "న్యూజిలాండ్ ఇన్ ఇండియా" అనుకొందాం !

            ఇంతకీ ఈ 'ఇండియన్ న్యూజిలాండ్' లో ఈ ఆదివారం- పరిమిత సంఖ్యాకులైన 30 మందికి పైగా కార్యకర్తలేమి సాధించారట? ఒకానొక సామాజిక - సామూహిక శ్రమ దానం గురించి మాత్రమే నేను వ్రాస్తుంటాను తప్ప - ప్రతి యొక్క కార్యకర్త శ్రమనూ, వివేచననూ, స్ఫూర్తిదాయక పని పద్ధతినీ

వర్ణించ లేకపోతున్నాను! ఐనా సరే - రెండు మూడు ప్రత్యేక సన్నివేశాల్ని మాత్రం ప్రస్తావిస్తాను:

            అందులో ఒకటి - 8-9 ఏళ్ల నాలుగో తరగతి విద్యార్థి బడుగు వర్షిత్ సాయి శ్రమ విన్యాసం ! అతగాడి వయస్సేమిటో - చెత్త బండి పైకెక్కి, నలుగురైదుగురు వెంటవెంటనే అందిస్తున్న చెత్త డిప్పలందుకొని, క్రమపద్ధతిలో సర్దడమేమిటో ఆలోచించండి!

            ఎన్నడూ లేనిది ఒక గట్టి పిండం గబుక్కున జారి - మురుగు కాల్వలో బిళ్ళ బీటుగా పడిపోవడమూ - ఇద్దరు అబలలు అతడ్ని ఒడ్డుకు లాగడమూ.. మళ్లీ 2 నిముషాల వ్యవధిలోనే ఆ ముగ్గురూ సర్దుకొని తమ పనిలో దిగడమూ!

            గడ్డి బళ్ల చెత్త పరకలు పడినందు వల్ల మళ్లీ నిన్నటి చోటు అశోక నగర్ నుండే చీపుళ్లవారు పనిమొదలెట్టారు.

            రోడ్డు ప్రక్క గడ్డి చెక్కే పనీ, కొన్ని పూలచెట్లు ప్రక్కకు ఒరిగిపోతే నిలబెట్టే కృషీ, గోకుడు పారల్తో సిమెంటు బాటల్ని చెక్కి, విశాల పరిచే ప్రయత్నమూ.... ఏవీ ఆగలేదు!

            ఆదివారం కనుక - 6.00 కే పని ఆపాలా, ఇంకాస్త పొడిగించాలా" అనే మీమాంస వచ్చి, చివరకు 6.15 కు గాని పారిశుద్ధ్య చర్యలాగలేదు! అప్పటికే 20 మంది బైపాస్ వీధిని వదలి, వడ్లమర వీధిలో 20 గజాల దాక శ్రమించారు!

            ధ్యానమండలి తరపున రాయపాటి రమ గారు ముమ్మారు నినదించిన గ్రామ స్వచ్ఛ - శుభ్ర సౌందర్య సంకల్పంతో నేటి సామూహిక కృషి పరిసమాప్తి!

     బుధవారం వేకువ సైతం మన కలయిక ఈ బైపాస్/వడ్లమర వీధి మలుపులోనే!

    తొమ్మిదేళ్ల కాలం కర్పూర కళిక!

తొలి రోజుల శ్రమదానం కొందరి సాహస వేదిక

మలి నాళ్లకు ఉద్యమమై మహనీయ ప్రకాశిక

వందలాది గ్రామాలకు, వేలకొలది పరిశీలక

బృందాలకు తొమ్మిదేళ్ల కాలం కర్పూర కళిక!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   21.05.2023.