2775* వ రోజు....... ....           22-May-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడదగునా?

2775* వ శ్రమదానం బందరు రోడ్డులోనే!

            ఔను మరి ! ఆ జాతీయ రహదారి ఊళ్లోకెల్లా కిలోమీటరు కన్నా పొడవైన - ఉన్నంతలో విశాలమైన - మలుపులు తిరిగిన మార్గం! అక్కడి డ్రైన్లు మాత్రం రకరకాల తుక్కులూ, ఇసుకా, దుమ్మూ, ఇంకా ఏవేవో వ్యర్ధాలూ నింపుకొని, చిక్కటి జిగటగా మాగి, అటు పంచాయతీకీ, అంతిమంగా స్వచ్ఛ కార్యకర్తలకీ నిరుద్యోగ (ఉద్యోగం అంటే ప్రయత్నం అని కూడ) సమస్య రాకుండ చూస్తాయి!

            ఆ పనిలో ఇసుక చెత్త బళ్లూ కొందరు గ్రామస్తులూ చాతనైనంత సహకరిస్తుంటారు! కూరల, పండ్ల వ్యర్ధాల్నీ - టిఫిన్ ఖాళీ పొట్లాల్ని ఎంగిలాకుల్నీ డ్రైన్లో విసిరే గృహస్తులూ, ప్రయాణికులు సైతం మురుగు కాల్వల సిల్టును పెంచుతారు.

            వర్ష ఋతువుకు ముందు పంచాయతీ వారు ఆ సిల్టును బైటకు తోడించి, అందలి నీరూ దుర్గంధమూ ఎండలకావిరై పోయి - మిగిలిన మట్టి గుట్టలు మాత్రం రహదారి అందాన్ని వెక్కిరిస్తుంటాయి!

            ఈ సోమవారం (22.5.22) నలుగురైదుగురు గ్రామ భద్రతా దళ సభ్యులు వేకువ 4.30 - 6.00 మధ్య చేసిన ఉద్యోగమేమంటే - కంపు కాస్తంత తగ్గిన ఆ మట్టి గుట్టల్లో కొన్నిటిని పలుగుల్తో త్రవ్వి, పారల్తో ట్రాక్టర్లో నింపుకొని, అదే మార్గంలో - స్వచ్ఛ సుందర పబ్లిక్ టాయిలెట్ల ప్రక్కన చిన్న కార్ల నిలుపుదల స్తలం పల్లాన్ని నింపడం!

            అంటే ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్లు, ఉభయతారకంగా - బందరు దారి విశాలంగా, శుభ్రంగా మారడమూ, రహదారి ప్రక్క ఒక పల్లం మెరకైపోయి కొందరి సౌకర్యంగా మారడమూ! రెస్క్యూ టీం వారి శ్రమ తప్ప డబ్బు అంతగా ఖర్చు గాని పనిమెలకువన్నమాట!

            6.30 తరువాత - బృందావన శ్రామికుడు ముమ్మారు తన గ్రామ స్వచ్ఛ సుందరోద్యమ సంకల్ప నినాదాలతో నేటి తమ కృషిని ముగించెను!

            వానకు - ఎండకు గొడుగు!

ప్రజల కొరకు ప్రజల నుండి పసగలుగు సమాజసేవ

ఎవరైనా నడువ గలుగు హితకారకమైన త్రోవ

ప్రతి ప్రశాంత వేకువలో స్వచ్ఛ కార్యకర్త అడుగు

ప్రజాభ్యుదయ మార్గములో వానకు - ఎండకు గొడుగు!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   22.05.2023.