2776* వ రోజు....... ....           23-May-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడదగునా?

బందరు వీధిలోనే 2776* నాటి రెస్క్యూ టీం కృషి!

            పారిశుద్ధ్య కృషీవలురకు కొరతే గాని - చల్లపల్లి ఊరి ఏ వీధిలోనైనా ఇలాంటి శ్రమదానం అవసరం లేకపోతుందా? ఊళ్లోని సుమారు 130 రోడ్లలో బాగా ముఖ్యమనుకొన్న 10 - 12 బజార్లకే స్వచ్ఛ కార్యకర్తలు మొత్తం 50 మంది సరిపోవడం లేదే - బైటి రహదార్ల, జన కూడలులు - మినీ ఉద్యానాల నిర్వహణ ఇంకెంత కష్టం?

            ఊళ్లోని సహృదయులు మరో 100 మందైనా స్వచ్ఛ కార్యకర్తలుగా మారందే - ఇంత పెద్ద గ్రామ సుందరాకృతి ఎలా నిలుస్తుంది?

            అందుకే ఉన్న ఈ కొద్ది మంది వాలంటీర్లు 2776* రోజులుగా తమ శ్రమను ధారపోస్తున్నది! పాపం ఈ వాలంటీర్లు రోజూ గంటన్నర చొప్పున చెమటలే చిందించారో - స్తోమతను బట్టి తమ కష్టార్జితాన్నే ఊరి కర్పిస్తున్నారో  - ఎంత మేధో శ్రమ కావిస్తున్నారో..... 9 ఏళ్ల తరువాత కూడ సగం మంది గ్రామస్తులకు పట్టకుండడమే కాలం పలుకుతున్న ఒక వక్రోక్తి అలంకారం!

            సరే అన్ని సోమ మంగళవారాల్లాగే - ఊరి భద్రతాదళ చర్యలు - ఈ మంగళవారం (23 -5-23) కూడ!

            ఎండిన మురుగు దిబ్బల్ని మరి కొన్నిటిని ఆ కంపును భరిస్తూ పారలు గునపం - డిప్పల సాయంతో ట్రక్కులో నింపుకొని, పెట్రోలు బంకు ప్రక్క సచివాలయం దగ్గరి పల్లాన్ని పూడ్చారు. మరో నాలుగైదు ట్రక్కుల మన్నుతో గాని, ఆ గుంట పూడదు!

            కార్యకర్తల పని విరమణ తర్వాత ఊరి స్వచ్ఛ సౌందర్య నినాదాలిచ్చింది BSNL నరసింహుడే!

            రేపటి వేకువ విస్తృత కార్యకర్తల కలుసుకోదగిన చోటు బైపాస్ మార్గంలో భారతలక్ష్మి వడ్లమర దగ్గర!

            శ్రీరస్తని శుభమస్తని

శ్రీరస్తని - శుభమస్తని చేపట్టిన స్వచ్ఛోద్యమ

చల్లపల్లి తొమ్మిదేళ్ల సానుకూల పయనంగా

వేనవేల గ్రామాలకు విస్పష్ట నమూనాగా!

వెలుగుతోంది కార్యకర్త విస్తృత శ్రమదానంగా

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   23.05.2023.