2777* వ రోజు....... ....           24-May-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడదగునా?

2777* వ నాటి వీధి శుభ్ర - సుందరీకరణ సంగతులు!

            ఆ సమాచారం 12 మందితో 4.18 కే శ్రీకారం దాల్చింది! ఎక్కడంటే - బైపాస్ వీధి, భారతలక్ష్మి వడ్లమిల్లుల సంగమ స్థానంలో! ఎప్పటి వరకనగా - 6.00 వరకు మాత్రమే! తొలి డజను మందికి తోడైన మలి 12 గురితో మొత్తం 24 మందితో జరిగిన పారిశుద్ధ్య కృషి ఎక్కడందురా అది ప్రధానంగా 8 ఏళ్ల నాడు వాసిరెడ్డి కోటేశ్వర కీర్తిశేషుని శ్రమ - ధన త్యాగంతో అందంగా రూపొందిన వీధిలోనే!

            గ్రామ చరిత్రైనా - దేశ ఇతిహాసమైనా కొందరు విశిష్ట వ్యక్తుల - కొన్ని ప్రత్యేక సంఘటనల సమాహారమే కదా! అలాంటి ఒక ప్రత్యేక వ్యక్తి వా.కో. అనుకొంటే - అనూహ్యమై న మంచి సంఘటన గత తొమ్మిదేళ్ల స్వచ్ఛ కార్యకర్తల శ్రమదానం!                     

            పుట్టుకనూ, కుల - మతాన్ని బట్టీ ఎవ్వడూ మహోన్నతుడో - హీనుడో కాదు! సమాజం పట్ల, జరుగుతున్న పరిణామాల పట్ల అతని స్పందనను బట్టే చర్యలను బట్టే మహనీయుడో బ్రహ్మ రాక్షసుడో ఔతాడు! దాన్ని వాడి జీవిత కాలమే నిర్ణయిస్తుంది!

            తాము నివసిస్తున్న ఊరి కోసం, కలిసి బ్రతుకుతున్న గ్రామ సమాజం కోసం తమ జీవితంలో చెప్పుకోదగ్గ తొమ్మిదేళ్ల కాలాన్నీ, శక్తియుక్తుల్నీ సమర్పిస్తున్న స్వచ్ఛంద శ్రమదాతలది గుర్తించదగినంత ఘన చరిత్ర కాకపోతుందా?

            ఒకానొక బడి పంతులు తన ఉద్యోగమేదో తాను చేసుకోక - పూతి దుర్గంధ దారుణమైన ఈ ఇరుకు వీధిని నెలల తరబడీ కాపుకాచి చెట్లు పెంచి - పూలు పూయించి ఇంతగా సుందరీకరించిపోనేల?

            ఈ వేకువ సమయంలో - ఉక్కపోతల్ని తట్టుకొని - 5 గురు మహిళా కార్యకర్తలూ - పొరుగూళ్ల నుండి వచ్చి మరీ కొందరు రైతులూ, వైద్యులూ, వృద్ధులూ - విశేషించి ఎనిమిదేళ్ల బాలుడూ తలా గంటన్నర శ్రమించి - ఊడ్చి - చెట్లను నవీకరించి - పచ్చదనాన్ని కూడ రెగ్యులేట్ చేయనేల?

            ఎండిన మురుగు మట్టిని త్రవ్వి డిప్పల్తో తలల మీద మోసి, సిమెంటు బాట అంచుల్లో పోసి, విశాల పరచి, భద్రపరచుటేల?

            మురుగ్గుంట అంచున కూర్చొన్న నలుగురైదుగురికి గడ్డి పీకి, కత్తుల్తో కోసి, పిచ్చి చెట్లను తొలగించి, ఈ భారత లక్ష్మి వడ్లమర వీధిని మరింత ఆకర్షణీయంగా శ్రమించవలసిన అవసరమేమి?

            ఏమంటే - ఈ పాతిక మంది గుర్తించి, త్రికరణ శుద్ధిగా పాటిస్తున్న తమ గ్రామ సామాజిక బాధ్యతే! ఒక మంచి ఆశయమే వాళ్లను నడిపిస్తున్నది!

            అష్ట వర్షప్రాయుడైన - ట్రక్కులోనికెక్కి తుక్కులు సర్దుతున్న ఆ కుర్రవాడు చల్లపల్లి పాతికవేల జనానికాదర్సుడు కాడా?

            6.25 కు - ఆస్పత్రి సీనియర్ నర్సు కొండపల్లి కృష్ణకుమారి ముమ్మారు చల్లపల్లి స్వచ్ఛ సౌందర్యాలను నినదించాక - కార్యకర్తల మహత్తర శ్రమదానాన్ని DRK గారు ప్రస్తుతించాక తొమ్మిదేళ్లకు ముందు - ఈ బైపాస్, వడ్లమర వీధుల దుస్థితుల్ని అందరూ గుర్తు చేసుకొన్నాక -

            రేపటి వేకువ శ్రమ బాధ్యతలు కూడ ఈ వడ్లమర వీధిలోనేఅని నిర్ణయించుకొని

            సంతృప్త వదనాలతో కార్యకర్తలు ఇళ్లకు తిరుగు ప్రయాణం!

            అంతస్తుకు చిహ్నమ్ముగ

స్వచ్ఛ - మాన్య చల్లపల్లి సందర్శనె అదృష్టముగ

ఆ ఊళ్లో నివాసమే అంతస్తుకు చిహ్నమ్ముగ

అచటి ప్రజల అదృష్టమే అసూయగా - అబ్బురముగ

భావించే రోజొక్కటి భవిష్యత్తున రానున్నద?

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   24.05.2023.