2778* వ రోజు....... ....           25-May-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడదగునా?

ఇది 2778* వ నాటి శ్రమత్యాగ చరిత్ర!

            గురువారం (25-5-23) వేకువ 4.15 కే సదరు చరిత్ర 10 మందితో మొదలై, అనతి నిముషాల్లోనే చిలికి చిలికి 27 కు చేరింది! (వడ్లమర ఉద్యోగి సుబ్బారావు గారిది 27 వ సంఖ్య) నిన్న నిర్ణయించుకొన్నట్లే - వడ్లమిల్లు లోపలే తమ వాహనాల్ని నిలుపుకొన్న స్వచ్ఛ కార్మికులు :

- ముందుగా ఐదారుగురు బైపాస్ వీధి మురుగు మన్ను దిబ్బను త్రవ్వి ఏ వంద డిప్పల్తోనో మోసి భారతలక్ష్మి ధాన్యం మర వీధి సిమెంటు దారి అంచుల్ని బలపరచడానికీ, చెట్ల మొదళ్ల పటిష్టీకరణకూ వాడారు.

- ఒక భారీ వృద్ధ - విశ్రాంత ఉద్యోగైతే - తనకంటూ మిల్లు గేటు దగ్గర 2 - 3 సెంట్ల వీధిని కేటాయించుకొని క్షుణ్ణంగా గడ్డి చెక్కి - వెర్రి మొక్కల పని బట్టి ఊడ్చి సంతృప్తి చెందాడు!

- రాబోయే కాలంలో వస్తున్న రిలయన్స్ మాల్పడమర బాట అంచుల కశ్మలాలు మరో నలుగురైదుగురి వంతు!

- దివంగత విశ్రాంతోపాధ్యాయుడు ఒంటి చేత్తో నిర్మించిన బుల్లి ఉద్యాన సుందరీకరణలో తలమునకలైన సుందరీకర్తలు కరెంటు తీగల్ని తాకకుండ వేప చెట్ల కొమ్మల్ని తొలిగించారు.

- బాట పడమటి చెరువు నీటి వాలు దగ్గర దంతె/ చీపురు వారి అండతో పుర చేతి కార్యకర్త 40 నిముషాల పాటు ఎంతగా శ్రమించి, ఎన్ని చెమటలు చిందించెనంటే - ఆ ఎగుడు దిగుడు గుంటల్లో పనితో - అలసి, తూలి పడిపోతాడేమో అన్నంతగా!

- మరొక విశ్రాంత కేంద్ర ప్రభుత్వోద్యోగి - రెండ్రోజుల విరామం తర్వాత వచ్చి - కంపును తట్టుకొని - మురుగు కాల్వ నెంత శుభ్రపరచిందీ, చివరకు విధి లేక ఆ నిలవ మురుగు చెరువులో కెలా దారి తీసిందీ - ఫొటోల్లో తిలకించండి!

- ఆ వీధి మొత్తానికీ ఎవరూ బైటకే రాకున్నా - మిల్లు ఎదురింటి వారు వాకిలి బైటకైతే వచ్చారు గాని - కార్యకర్తల్లో కలిసే సాహసం చేయలేదు! శుభ్రపడుతున్న వీధి, ఎట్టకేలకు చలనం వచ్చిన డ్రైనూ, కార్యకర్తల కఠిన శ్రమ మూలంగా అందాలు చిందుతున్న బజారేమో తమది! ఎక్కడెక్కడ్నించో వచ్చి ఎవరో శ్రమిస్తుంటే - నిర్మొహమాటంగా కాలు పెట్టని వ్రేలు పెట్టని గృహస్తులు!

            మొత్తానికి - 6.10 తరువాత ఈ వీధి మెరుగులు దిద్దుకొని, అందచందాలు పెంచుకొన్నదంటే వింతేముంది! పాతిక మంది తలా గంటన్నర శ్రమ ఊరికే పోతుందా?

            నిన్నా - నేటి తమ కృషితో కనువిందు చేస్తున్న వడ్లమర వీధిని సంతృప్తిగా చూసుకొని ఈ అల్ప సంతుష్టులు మర లోపలకు చేరి మట్టా మహాలక్ష్మి ముమ్మార్లు లయబద్ధంగా చేసిన నినాదాలకు ప్రతిస్పందించి,

            DRK డాక్టరు గారు ఎప్పట్లాగే చేసిన ఆశ్చర్యానంద పూర్వక సమీక్షా వచనాలు ఆలకించి,

            శుక్రవారం వేకువ శ్రమదానం కూడా ఈ వీధిలోనే ఇక్కడి నుండే మొదలగునని గ్రహించి,

            తమ తమ గృహంబులకేగిరి!

            అపూర్వ శ్రమదాతలె

ఈ చారిత్రక గ్రామం ఒక నవచరిత్ర వ్రాస్తుందని

ఎవ్వర మూహించినాము ఎంత వరకు నమ్మినాము?

ఏ మాత్రం ప్రోత్సహించి అండదండలిచ్చినాము?

ఈ అపూర్వ శ్రమదాతలె ఆ చరిత్ర నిర్మాతలు!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   25.05.2023.