2779* వ రోజు....... ....           26-May-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడదగునా?

2779* వ వేళ కూడ - అదే వీధి - అవే చేతులు!

          అది శుక్రవారం(26.5.23) కావచ్చు - ఋతువులు మారనూ వచ్చు ఈ గ్రామ వీధుల స్వచ్ఛ శుభ్ర సౌందర్య క్రతువు మారదు! ఆ 3040 - 50 మంది కార్యకర్తల ప్రయత్న లోపముండదు! ఏదోఒక మూలన చల్లపల్లిలో సుందరీకరణ శ్రమదాన పతాకం ఎగరక మానదు!

          తొమ్మిదేళ్ల కాల పరీక్షకు నిలిచి - గెలుస్తున్న ఊరి పారిశుద్ధ్య కృషికి ఆరంభమే గాని అంతమూ కనబడదు! ఐతే,  “వేల కొద్దీ రోజుల - లక్షల పని గంటల గతం ఉన్న ఈ దైనందిన శ్రమ వేడుక మీద పని గట్టుకొని వాట్సప్ మాధ్యమం కోసం ప్రతి ఉదయం ఇలా పేజీలు నింపాలాఅనే ధర్మ సందేహం నాకు అప్పుడప్పుడు వస్తుంటుంది!

అందుకు తక్షణ సమాధానాలు:

1) ఒక మారుమూల పల్లెలో ఇంత సుదీర్ఘ కాలంగా ప్రత్యక్షంగా చూస్తే గాని నమ్మలేని నిజంగా - స్వార్థం అడ్రస్సే కనపడని త్యాగంగా - నిండు నిబద్ధంగా – నిరాడంబరంగా జరిగిపోతున్న శ్రమ వేడుక!

2) ఇందరి సామాజిక బాధ్యతా నిర్వహణం చూస్తూ దాన్ని ఆలోచించక విశ్లేషించక - కాస్త వర్ణనాత్మకంగా వ్రాయక - ఆగలేని నిస్సహాయత!

3) ఈ రోజు శ్రమదానం చేయని కార్యకర్తలు, గ్రామ - దేశ విదేశ చల్లపల్లి స్వచ్ఛోద్యమాభిలాషులందరికీ ఇక్కడి శ్రమ వేడుక వివరాలు తెలపాలనే కోరిక!

          కావున - నేటి కార్యకర్తల శ్రమదాన వివరాలను ఈ క్రింద యథాతథంగా తెలియజేయడమైనది!

          నేటి బ్రహ్మ కాలాన - 4.18 కే మొదలై 6.06 దాక ముప్పై ముగ్గురు పాల్గొన్నది భారతలక్ష్మి వడ్లమర వీధి!

          నిన్న వాన పడి పని చోట్ల చిత్తడిగా మారి, పైకి చల్లబడ్డట్లు కనిపించినా - ఉడికిపోతున్న ఉక్క వాతావరణం.

          సంఖ్య 33 కాని, ముగ్గుర్నలుగురు పై మనుషులు - అతిధి దేవుళ్లన్న మాట! వడ్లమిల్లు గుమాస్తా, హైదరాబాద్ నుండి వచ్చి, పని చోటును వెతుక్కుంటూ వచ్చిన గృహిణి మధు, రేపటి తన కుమార్తె 9 వ జన్మ వేడుక ప్రకటనకై వచ్చిన ఒక సాధనాల కార్యకర్తా వగైరాలు!

          40 రోజులుగా శ్రమదానానికి తప్పక దూరమైన ఒక జాస్తి ప్రసాదుని తొణకని - బెణకని వీధి పారిశుద్ధ్యాన్ని గమనించాను. 

          ఇదేం ఖర్మరాఅని కాక - ఊరి ప్రయోజనానికి పాటుబడడం అదృష్టంగా భావించిన ఐదారుగురు మహిళల కష్టాన్ని పరిశీలించాను;

          ఆరోగ్యంలో కాస్త ఎగుడు దిగుళ్లొచ్చినా వెనకడుగేయక వచ్చి - చాతనైన పనులు చేస్తున్న 75 - 84 ఏళ్ల పెద్దల్ని గమనించాను;

          తనకంటే పేద్ద చెత్త డిప్పను మోసుకెళ్తున్న ఎనిమిదేళ్ల బడుగు వర్షిత్ సాయిని (ఫోటో చూడండి) కనిపెట్టాను;

          ఉచ్ఛమడుగుల్లో - ఘాటు కంపుకొడుతున్న పారేసిన అన్నం గుట్టల్లో - రహదారి ఉద్యానం చీకట్లో నిర్వికారంగా పని చేసుకుపోతున్న,

          వ్యర్ధాల్ని రెండు ట్రక్కులో కెక్కిస్తున్న ప్రతి యొక్కరి శ్రమ విలువనూ ఊహించాను; మరి ఇవన్నీ చూసి చలించక, ఈ మాత్రమైనా వ్రాయక - ఎలా ఉండగలను?

          6.20 సమయంలో తన గ్రామ స్వచ్చోద్యమ సారాంశాన్ని నినాదాలుగా కీర్తించిన వ్యక్తి సాక్షాత్తూ సర్పంచమ్మే!

          ఎన్నోమారో గాని - కార్యకర్తల త్యాగ దీక్షకు ఆశ్చర్యపోవడం ఈ శ్రమదానోద్యమ ప్రారంభక వైద్యుని వంతు!

          మిగిలిపోయిన ఉద్యాన శుభ్రత కోసం మనం శనివారం వేకువ కలువదగినది భారతలక్ష్మి వడ్లమర దగ్గరే!

          ఒక సద్యః స్ఫూర్తి చర్య

ఒక సద్యః స్ఫూర్తి చర్య అలవోకగ నడుస్తోంది

మహోత్కృష్ట బాధ్యత సామాన్యులతో తీరుతోంది

వీరుల శూరుల - ధీరుల - మేధస్సుల కన్నను సత్

సంకల్పమె ఊరి భవిత శాసింపగ పూనుకొంది!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   26.05.2023.