2780* వ రోజు....... ....           27-May-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడుటేల?

4.15 కే - శనివారపు శ్రమసందడి! - @2780*

            27-5-23 వేకువలో అప్పటికే 15 మంది కార్యకర్తల ఉనికి! నేటి నికరశ్రమ దాతలు 38 మందైతే - 6.30 సమయానికి సాధనాల చందన - చైత్ర మహితల జన్మ దినోత్సవ వేళకు 48 మందిగా తేలారు!

            చల్లపల్లి స్వచ్ఛ - సుందరోద్యమ శ్రమ సందడే ఒక వింతనుకొంటే - అక్కడ జరిగే జన్మదిన వేడుకలూ - వైవాహిక స్ఫురణలూ అంతకన్నా వింత!

            మహిళల నగల పట్టు చీరల - అలంకరణల- అతిథుల, బంధు మిత్రుల సెంటు పరిమళాల, కొండొకచో మైకు పాటల - నృత్యాల నడుమ ఫంక్షన్ హాళ్ల నాల్గు గోడలకు పరిమితంగా జరుగుతున్న ఇలాంటి వేడుకలు కాస్తా -  గంటన్నర శ్రమతో మురికి బట్టల - చెమట కంపుల కార్యకర్తల సమక్షంలో జరగడమూ, ఇందరు పరోపకారుల -నెమ్మనముల ఆశీర్వాదాలు చిన్నారులకు దక్కడమూ వింత ఆచారమే మరి!

            30 మందికి పైగా వాలంటీర్ల శ్రమతో ఈ ఉదయం పునీతమయింది మళ్లీ భారతలక్ష్మి వడ్లమర వీధే! అంచనా ఎక్కడ తప్పిందో గాని - బందరు రహదారి దాక ఈ వీధి సర్వాంగ సుందరంగా మారవలసిందే! అక్కడికీ ఇద్దరు రైతులు కత్తీ - దంతెలతో ఆ తూర్పు పడమరల వీధిలోకి ప్రవేశించారు కూడ! ఐనా ఎందుకో గాని చెరువు గట్టు మినీ ఉద్యానవనం పునః శుభ్ర సుందరీకరణం 20 గజాలు మిగిలేపోయింది.

            కార్యకర్తల శ్రమలో లోపం లేదు, చెమటలో తక్కువ లేదు - కూర్చొని గడ్డి చెక్కి వీధి మార్జిన్లను విశాలపరచిన వాళ్లూ,

            ఉద్యానంలో దూరి, గడ్డినీ పిచ్చి కంపల్నీ ఖండ ఖండాలుగా నరికిన వాళ్ళూ,

            చెరువు నీటి వైపు పెరిగిన తీగల్నీ ముళ్ల మొక్కల్నీ అంతు చూసిన శ్రామికులూ, కొన్ని చెట్ల కొమ్మల్ని తొలగించి సుందరాకృతులుగా మలచిన సుందరీకర్తలూ,

            ప్లాస్టిక్ తుక్కుల్ని రెండు గోనె సంచులకు సరిపడా నింపిన ఇద్దరూ;

            రోడ్ల దుమ్ము - ఇసుక  - ఊడ్చి, డిప్పలకెత్తి, మోసి, సిమెంటు బాట అంచుల్ని బలపరిచిన నలుగురూ;

            ఉరుకులు పరుగులుగా, సందడి సందడిగా, వ్యర్దాల్ని డిప్పలకెత్తి ట్రాక్టర్ లో నింపిన ఔత్సాహికులూ......

            ఎందరు ఎంతగా శ్రమిస్తే - ఒక డాక్టరు భాషలో చెప్పాలంటే:

            క్రొత్తగా సిమెంటు రోడ్డు ఇప్పుడే వేసినంత అందంగాఈ దారి కనిపిస్తున్నదో చూడండి! అసలు ఏ ఊళ్లో ఇంతటి స్వార్ధ రహిత ఉమ్మడి కృషి జరుగుతున్నదో చెప్పండి?

            అందుకే ఈ చల్లపల్లి శ్రమ వేడుకొక ప్రత్యేకం - ఇక్కడ జరిగే ఫంక్షన్లు నవీనం - చాల మంది దృష్టిలో ఇవి ఆచరణీయం!

            సాధనాల కుటుంబం తరపున ముచ్చటగా ముమ్మారు సతీష్ తన గ్రామ స్వచ్ఛ - సుందరోద్యమని నాదాలు ప్రకటించాక పనిలో పనిగా సాధనల వారు స్వచ్చోద్యమ ఖర్చుల నిమిత్తం 2,000/- విరాళం సమర్పించాక కార్యకర్తలూ, అతిధులూ విధిగా కేకు ముక్కలకూ, ఇడ్లీ గారెలకూ న్యాయం చేయవలసి వచ్చింది!

            ఆదివారంనాటి చీకటి ఉదయాన మరొక మారు మన పునర్దర్శనం భారత లక్ష్మి వడ్లమర ప్రాంగణంలోనే!

            భవిత మెరుగులు దిద్దుకొంటది

 “మంచి గతమున కొంచెమేనని మహాకవి వాక్రుచ్చినాడట!

భవితపై నా భరోసాఅని ప్రజాకవి తేల్చేసినాడట!

స్వచ్ఛ సుందర చల్లపల్లికి వర్తమానం వెలుగుతున్నది

ప్రజలు పూర్తిగ కలిసి వస్తే భవిత మెరుగులు దిద్దుకొంటది!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   27.05.2023.