స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం 1848* వ రోజు పరిస్థితి.....

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!

ఈ నాటి వేకువ 4.12-6.12 నిముషాల మధ్య కొద్ది మంది స్థానికులు, పెదప్రోలు పంచాయతీ కార్మికులతో సహా 24 మంది చల్లపల్లి కార్యకర్తలు పాల్గొన్న శివరామపురం చెరువు గట్టు స్వచ్చంద శ్రమదానం విజయవంతంగా ముగిసింది. ఈ 3 రోజుల-100 మంది స్వచ్చ కార్మికుల 150 పని గంటల పాటు సాగిన స్ఫూర్తివంతమైన కృషితో చెరువు ఉత్తర-దక్షిణ-పడమర-3 గట్లు వాటి పైన గతంలో నాటి-పెంచిన పూల మొక్కల పరిసరాలు 3 దారులు స్వచ్చ సుందరంగా, సౌకర్యంగా కనిపిస్తున్నాయి.
 
నేటి ప్రధాన కృషి పడమటి, ఉత్తరపు గట్ల మీదే జరిగింది. ముఖ్యంగా శ్మశానం దారైన ఉత్తరం గట్టు దారి, ఉద్యానాలలోనే ఎక్కువ మంది కార్యకర్తలు దృష్టి పెట్టి పనిచేశారు.
 
ఒక సాహసికుడు దారి కడ్డొస్తున్న వేప చెట్టు కొమ్మను- చెట్టెక్కి మరీ నరకడం గమనించాను. స్వచ్చోద్యమ చల్లపల్లి ఐదేళ్ల సమయంలో ఇలాంటి సాహసాలు సాధారణమై పోయినవి.
 
ఈ రెండు గంటల సమయంలో-
దారుల మీది, ప్రక్కల గడ్డిని పారలతో చెక్కేవారు, కత్తులతో కోసేవారు, ఉద్యాన వనంలోని చెట్లను నిటారుగా నిలిపి త్రాళ్లతో కట్టేవారు, అక్రమంగా కనిపించే కొమ్మల్ని కత్తిరించి, కొత్త కళ తెచ్చేవారు, నరికిన కొమ్మలు-రెమ్మల్ని, గడ్డిని, ఎండు టాకుల్ని పోగులు చేసి, బండి కెత్తేవారు, అంతిమంగా శుభ్రపరిచిన ప్రాంతాన్ని చీపుళ్లతో ఊడ్చి ఆనందించేవాళ్లు......వాళ్లందరికీ మంచినీళ్లందించే వారు.....1848 రోజులుగా ఇదే వరస!
 
టీ, కాఫీల అనంతర సమీక్ష సమావేశంలో డాక్టరు గారు జరిగిన, జరుగుతున్న స్వచ్చ కృషి ఫలితాల పట్ల సంతృప్తిని ప్రకటించగా, లౌవ్లీ అనబడే కొత్తపల్లి వేంకటేశ్వర రావు గారు ఊరందరి సంక్షేమ కాంక్షను ముక్తాయించి, స్వచ్చ సుందర సంకల్ప నినాదాలను ముమ్మారు ప్రకటించగా, 6.30 నిముషాలకు నేటి బాధ్యతలకు స్వస్తి!
 
రేపటి మన స్వచ్చంద శ్రమదానం కోసం విజయవాడ రోడ్డు లో శివాలయం వద్ద కలుద్దాం!
 
స్వచ్చోద్యమ చల్లపల్లి
ఆచరణల పూర్వకముగా అది గాంధీ మార్గమే
సత్యాహింసల నిష్టతొ అతని బ్రతుకు ధన్యమే
స్వచ్చ సైన్య చల్లపల్లి ఆ దారి లొ ప్రయత్నమే
అరశాతం ఫలించినా ఆ గ్రామం స్వర్గమే!
 
నల్లూరి రామారావు,
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,
సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,
మంగళవారం – 3/12/2019,
చల్లపల్లి.