1855 * వ రోజు....

          

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1855* వ నాటి విధి నిర్వహణ.

 

నేటి సుప్రభాత సమయంలో 4.06-6.15 నిముషాల నడుమ విజయవాడ రహదారిలో 3 చోట్ల జరిగిన ఆదర్శ శ్రమదానంలో 31 మంది కి ప్రమేయం ఉంది.

 

రోడ్డు మరమ్మత్తు కార్మికులుగా మారిన ఐదారుగురి రెస్క్యూ టీం విజయా కాన్వెంట్ గేటు ఎదురుగా రోడ్డు మీద తయారై, వాహన రాకపోకలకు ఇబ్బందిగా ఉన్న వెడల్పైన గుంటలను నాణ్యమైన తారు మిశ్రమంతో శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించారు. ఇందులో ఖర్చు 2000/- + రెస్క్యూ టీం వాళ్ల శ్రమ, చెమటలు అమూల్యం.

ఐదుగురు సభ్యుల సుందరీకరణ బృందం నీటి పారుదల శాఖ పురాతన భవనం ప్రహరీ వెలుపల శుభ్ర పరచి, గోడలను రంగులు పూసి అలంకరించారు, సమీపంలోని వ్యవసాయ శాఖ వారి పాత భవనం ప్రహరీని ఎంతో చాక చక్యంగా-డ్రైనులో నిలబడి శుభ్ర పరచి, రంగులు వేశారు. వీళ్ల గ్రామ సుందరీకరణ ఊహలకు, కృషికి ఆకాశమే హద్దు.

15 మంది కార్యకర్తలు 6 వ నంబరు పంట కాల్వ నుండి పాత కార్ల షెడ్డు దాక దారి కిరువైపుల – కత్తులతో, గొర్రులతో, చీపుళ్లతో చేసిన స్వచ్చ-శుభ్ర కృషి ప్రశంసనీయం. వీధి దీపాలు లేని చిమ్మ చీకటిలో డ్రైన్ల లో దిగి, పిచ్చి, ముళ్ల మొక్కల్నీ, గడ్డినీ, అక్రమ శాఖలనీ పీకి, నరికి ఈ వ్యర్ధాలన్నిటినీ ట్రాక్టర్ లోనికెక్కించి, చెత్త కేంద్రానికి చేర్చడం రాసినంత సులభం కాదు.

69 రోజుల స్వచ్చ యార్లగడ్డ ప్రణాళిక సజావుగా సాగిపోతున్నందుకు అక్కడి కార్యకర్తలు అభినందనీయులు. 

నాలుగేళ్ల క్రిందట ఊరిలోని ఎక్కడెక్కడి కల్మషాలు పోగులు పడి, డంపింగ్ కేంద్రంగా ఉండే ఈ సుందరీకృత ప్రాంతం నిజంగా వందలాది కార్యకర్తల-వేలాది పని గంటల స్వేద ఫలితం.

తూము ఇందిరా కుమారి సాధికారికంగా ముమ్మారు ప్రకటించిన స్వచ్చ-శుభ్ర సుందర సంకల్ప నినాదాలతో 6.40 కు నేటి మన గ్రామ విధ్యుక్త ధర్మం సమాప్తం.

రేపటి బాధ్యతను 6 వ నంబర్ కాల్వ దగ్గర నుండే ప్రారంభిద్దాం!       

      స్వచ్చ సుందర తాత్వికతకే...

జ్ఞాన దీపం వెలుగుతున్నా-కాలమెంతగ మారుతున్నా-

స్వార్ధమే పై చేయిగా ఈ సకల జగమును ఏలుతున్నా-

రోజుకొక గంటన్నరైనా గ్రామ సుఖముకు ప్రాకులాడే

స్వచ్చ సైన్యం తాత్వికతకే ప్రణతి ప్రణతని పలుకుతున్నా!

 

     నల్లూరి రామారావు,

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

మంగళవారం – 10/12/2019

చల్లపల్లి.