2782* వ రోజు....... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడుటేల?

ఇది అక్షరాలా 2782* వ శ్రమదానం!

            శ్రమదానం 6 గురికి చెందినది - సోమవారం (29-5-2023) వేకువ 4:30 - 6.00 నడిమి కాలానిది జాతీయ బైపాస్/ చల్లపల్లి గ్రామ కేంద్రానికి సంబంధించినది - ఒడలు వంచి, చెమటలు కార్చి, రెస్క్యూ టీమ్ అనబడే సోమ - మంగళ వారాల కొందరు ప్రత్యేక కార్యకర్తల కృషి అది!

            ఇంతటి అననుకూల - ఉక్కపోత వాతావరణంలో ఏ దైవ కార్యమో అన్నంత నిష్టతో ఈ రాతి - దుమ్ము - చెత్త పనులు ఈ కాస్తమందికే ఎందుకో,

            అవి కూడ ఇన్ని వేల రోజులుగా ఒక వ్యసనంగా మార్చుకొని, కండలరగదీసుకొని,

            ఏ వీధీ అసౌకర్యంగా మిగిలిపోరాదని - గుంటలు పడితే పూడ్చి చెట్లు పెంచి - పూలు పూయించి బుల్లి ఉద్యానాలు పెంచి...

            స్వచ్ఛ కార్యకర్తలు ఏ ఆనందానుభూతి పొందుతున్నారో గతంలోనే మనం ముచ్చటించుకొన్నాం!

            ఏ ఆత్మ సంతృప్తి లేకుండానే ఈ వేకువ ఈ షష్ఠ సంఖ్యాక కార్యకర్తలు గంగులపాలెం వద్ద రహదారి మీద ఎవరో దించి వెళ్లిన నానాకంగాళీ దిబ్బను త్రవ్వి, వ్యర్థాల్ని విడగొట్టి, రాతి - ఇసుక - మట్టి మిశ్రాన్ని, ట్రక్కులో నింపుకొని, 2 కిలోమీటర్ల దూరాన చిన్న కార్ల నిలుపుదల సౌకర్యం కోసం పల్లాన్ని మెరక చేసి - చదును చేస్తారా?

            వాళ్ల వ్యసనమే ఈ ఊరికి పట్టిన అదృష్టం!

            6.20 సమయంలో వాళ్ళు కస్తూరి విజయుడిననుసరించి - స్వగ్రామ స్వచ్చ - సుందర నినాదాలు ప్రకటించారు.

            నేటి స్వచ్చోద్యమ చల్లపల్లి

పర్యావరణ విధ్వంసక ప్లాస్టిక్ లకు పెనుఘాతం

సామాజిక సామూహిక సదాచరణ సన్మానం

 ఐకమత్య విశ్వాసుల కందరికది ఆహ్వానం

స్వయం కృషిని విశ్వసించు సజ్జనుల సమన్యయం!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   29.05.2023.