2793* వ రోజు ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వద్దనే వద్దు!

ఊరి బాగుదల దీక్షలో 25 మంది - @2793*

          9.6.23 - శుక్రవారం శుభోదయం సంగతది! ఈ వేకువ కూడ డజను మంది కార్యకర్తలు ఆగింది బందరు - మునసబు వీధుల వద్దనే - అక్కడి రెండు డ్రైన్లూ, సమీపాన కర్మల భవనమూ, ఇటుగా జమిందార్ల ‘వైజయంతమూ’, అటుగా 20 గజాల మరొక బాటా, కొసరుగా సజ్జా వీధీ వీటన్నిటి లోపాలకు సమాధానం చెప్పేందుకు పాతిక మంది వాలంటీమర్లూ!

          పని కాలం 4.15-6.00 నడిమిది. ఈ 105 నిముషాల వీధి కశ్మల వేటలో ఎవరే ఆయుధాలు వాడారో - కూర్చొనీ, నించొనీ, ఒంగొనీ వివిధ భంగిమల్లో ఎవరెంత కష్టించారో - సఫలీకృతులయ్యారో.... చెప్పాలంటే :

- తొలి ప్రస్తావనాంశం కర్మల భవనం వెనుకా - ముందూ భాగాల పనులే - అక్కడ ప్లాస్టికల కన్నా పుల్లా - పుడకా - ఎండుటాకు లెక్కువ. ఇంకా నయం - బావిలో వ్యర్ధాల జోలికెళితే ఆ ఏడెనిమిది మంది 6.00 దాక అక్కడే చిక్కుకు పోయేవారు!

- దీని ఉత్తర, పశ్చిమ డ్రైనులోనూ త్రాగేసిన కొబ్బరి బొండాలూ, ప్లాస్టిక్ సంచులూ, సీసాలూ లేకపోలేదు.

- మునసబు వీధిలోని RMP ఆస్పత్రీ, దాని ప్రక్క ఫర్నిచరు దుకాణమూ, పడమటి మురుగు కాలువా, దాని గట్టు మీది గడ్డీ, పిచ్చి మొక్కలూ ఆరేడుగురికి పరీక్ష పెట్టాయి.

- బందరు రాదారిలోని వైజయంతం ప్రహరీ వెలుపల కార్యకర్తలెన్ని మార్లు శుభ్రపరిచినా - ఇసుక, దుమ్మూ – వరి గడ్డి చేరుతూనే ఉంటాయి. అక్కడి శుభ్ర - సౌందర్యాలు సరి చూసుకొన్న సుందరీకర్తలు 6 గురు,

- చీపుళ్లతో నిర్విరామంగా 2 రోడ్లను ఊడ్చిన ముగ్గుర్నలుగురూ,

- దంతెలతో వ్యర్ధాల్ని గుట్టలుగా పేర్చిన నలుగురూ,

- ఆ గుట్టల్నీ, మట్టి గుట్టల్ని డిప్పల్తో ఎత్తి – ట్రాక్టర్ లో నింపి, సచివాలయం దగ్గర వంచి, సర్ది, చదును చేసిన నలుగురూ....

          ఎవరు మాత్రం అభినందనీయులు కారు? ఇందులో ఎవరికి మాత్రం ఈ గ్రామ సమాజం ఋణ పడి పోవడం లేదు?

          ఈ అప్పుల సంగతలా ఉంచి – 6.20 సమయాన నేటి శ్రమ సందడి ముగింపు సభలో:

          తోట పద్మావతి అనే ఉపాధ్యాయిని గ్రామ స్వచ్చ – సుందరోద్యమ నినాదాలు పలుకగా,

          ఈ ఉద్యమ సారధి నేటి సంతృప్తికర శ్రమదాన విశేషాలు వివరించగా,

          మల్లంపాటి ప్రేమానందుడు తన పెరటి నిమ్మ పండ్లను సహ కార్యకర్తలకు పంచి, ఎక్కడో గురజ గ్రామ నివాసిని 80 + వసంతాల సరోజిని గారు స్వచ్చోద్యమ (5000/-) విరాళాన్ని DRK గారికి సమర్పించగా,

          రేపటి శ్రమదాన వేదిక కూడ బందరు రహదారిలోని మునసబు గారి బజారు వద్దనే అని సమష్టిగా నిర్ణయించుకొనిరి.                    

(స్వచ్ఛ కార్యకర్తలు ఎక్కువగా వినే పాటల్లో ఇదొకటి)

శ్రమైక జీవన సౌందర్యానికి సజీవ సాక్ష్యం ఉందిగా

స్వచ్ఛ సంస్కృతికి ఉదాహరణగా చల్లపల్లి ఒకటుందిగా

శ్రమ సంస్కృతితో - సహకారంతో చల్లపల్లి వెలుగొందగా

వానలోన నడకుదురు రోడ్డులో – స్వచ్ఛ సైనికుల పండగ

                                                  శ్రమైక జీవన

విజ్ఞానంతో వియ్యమందుతూ – వినోదమిచ్చట పండగా 

విహార యాత్రలకు కాశ్మీరాలు – కొడైకెనాలూ ఏలనో    

                                                  శ్రమైక జీవన

సుమసుందర ఉద్యాన పరియమళం – శుభ సందేశం పంపగా

పర్యాటకులకు చల్లపల్లి ఒక స్వర్గధామమై పోయెగా   

                                                  శ్రమైక జీవన

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   09.06.2023.