2794* వ రోజు ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వద్దనే వద్దు!

శ్రమదాన చరిత్రలో 2794* వ ఘట్టం!

          ఆ ఘట్టానికి తెర తీసింది ఈ శనివారం (10.06.2023) వేకువ మరీ 4.12 కే - 12 + 28 మంది ప్రారంభోత్సవ స్థలం నిన్నటి నిర్ణయం ప్రకారం బందరు రహదారిలో మునసబు వీధి ప్రక్కన. ఇక వాళ్ల కర్మ క్షేత్రాలు :

1) కర్మల భవనం వెనుక

2)  మునసబు - సజ్జా - బందరు వీధులు

          అసలైన సుందరీకర్తల రాకతో ట్విల్స్ - భగత్ సింగ్ ఆసుపత్రి ప్రాంతాల రహదారి ముఖ్యంగా జమీందార్ల వైజయంతి నివేశనం దగ్గరా సిసలైన సుందరీకరణం జరిగింది. ఇందులో పాల్గొన్న మూడున్నర మంది ఎంత గడ్డిని చెక్కారో, ఎంత ఇసుక, దుమ్ము ఊడ్చి డిప్పలతో మోశారో, బిళ్ళ గన్నేరు పూల మొక్కలనెంతగా సంభావించారో ఈ ముగ్గుర్నలుగురి చెమటల ఫలితంగా రహదారి ఎంత మెరుగుపడిందో నేను వ్రాయనేలా? – వచ్చి చూడండి.

          అటు సజ్జా వీధిలో కొసరుగా కోట వారి బజారులో గరిక, వెర్రి, ముళ్ళ మొక్కలూ తతిమ్మా ప్లాస్టిక్ సంచులు సీసాలు, మద్యం బాటిల్సూ ఒకటేమిటిలే కశ్మలాల తుక్కు వదిలిపోయింది. మళ్ళీ గంట తర్వాత వీళ్ళే అన్ని వ్యర్ధాలను ట్రాక్టర్ లోకి బట్వాడా చేశారు.

          జమీందార్ల, పళ్ళ డాక్టర్ల కట్టడాల ఎదుట, ట్రాన్స్ఫార్మర్ల సందులలోనూ విచ్చలవిడిగా పెరిగిన దిక్కుమాలిన దోమల ముళ్ళ తీగల చిక్కులన్నీ విడగొట్టి, ఎంగిలాకుల మొదలు అన్నిటినీ ఏరి శుభ్రపరచిన డజను మంది శ్రమ ఎంత కఠినంగా సాగిందో నేను ప్రత్యక్ష సాక్షిని. (అందుకనే చల్లపల్లి గ్రామస్తుల పక్షాన ఈ కార్యకర్తలందరికీ నా సుమనస్సుమాంజలి!) 

          నేనింకా ఈ రెండు రోడ్లను చీపుళ్ళతో ఊడ్చిన ఐదారుగురు మహిళలనూ, ఒకొక్కరూ డజన్ల కొద్దీ డిప్పల వ్యర్ధాలను మోసిన ఆరేడుగుర్నీ, మంచి నీటి సరఫరా దారుల్నీ ప్రస్తావించకుంటే ఎలా?

          ఇక 6.20 దాటాక చొరవ చేసి ఆ మైకందుకుని నినాదాలనదరగొట్టిన దేసు మాధురి,

          రెండవ రోజు కూడా నిమ్మ పళ్ళు పంచిన శివరామపుర రైతు మల్లంపాటి ప్రేమానందంలను గుర్తుంచుకోవాలి.

          రేపటి వేకువ శ్రమ సందడి భగత్ సింగ్ ఆసుపత్రి ఎదుటనే మొదలు కాగలదు.

(కార్యకర్తలం బాగా ఇష్టంగా వినే ఈ క్రింది పాటను చిత్తగించండి!)

మాయమై పోతున్నడమ్మా మనిషన్న వాడూ

మచ్చుకైనా లేడు చూడు

 మానవత్వం ఉన్నవాడూ

                   ౹౹ మాయమై ౹౹

నిలువెత్తు స్వార్థమూ నీడలా వస్తుంటె చెడిపోక ఏమౌతడమ్మా...

చీమలకు చక్కెర, పాములకు పాలోసి

పంది నందిని చూసి పడిమొక్కుతుంటాడు

జీవకారుణ్యమే జీవితం అంటాడు

                   ౹౹ మాయమై ౹౹

తల్లినీ, చెల్లినీ ఊరవతలకి నెట్టి జనమంతటిని తానె ఉద్దరిస్తుంటాడు

ఇరవైదు పైసలగరొత్తులెలిగించి అరవైదుకోట్ల వరములడుగూతాడు.

                   ౹౹ మాయమై ౹౹

- అందె శ్రీ  

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   10.06.2023.