2796* వ రోజు ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వద్దనే వద్దు!

2796* వ రిస్కీ చర్యలు - అలవాటుగా, అలవోకగా!

          మంగళవారం (13.6.23) వేకువ సమయపు సంగతది! సదరు గ్రామ సేవలు 6 గురివైతే మరో నల్గురివి మద్దతులు! ఆ విధంగా ఊళ్లో రెండు చోట్ల - గంటన్నరకు పైగా! చూస్తూ ఆగక వచ్చే వెళ్లేవాళ్లు డజను డజన్లు!

ఒక్కింత వివరాల్లోకెళితే:

- సోమ మంగళ వారపు బ్రహ్మ కాలంలో - అది వానో, మంచో, హడలెత్తించే మంటల కాలమో - చల్లపల్లి కోసం తెగించి కష్టించే ఐదారేడెనిమిది మంది రెస్క్యూ కార్యకర్తల్ని గురించి ప్రత్యేకంగా వర్ణించే అవసరమేమున్నది?

- మొన్నటి శంపా - ఝంఝల దెబ్బకి విరిగిన - ఒరిగిన చెట్ల కొమ్మల పని నాగాయలంక దారిలోని స్వచ్ఛ సుందర టాయిలెట్ల దగ్గరనే ఈ వేకువ స్వచ్చ కార్యకర్తలు నిర్వహించింది!

          చీకట్లో ఎత్తైన నిచ్చెన చివర నిలిచి కొమ్మలు తప్పించడమూ, సన్నని రాతి స్తంభం పైన నిలిచి, సర్కస్ వాళ్ళలాగా బ్యాలెన్ చేస్తూ పూర్తిచేయడమూ రెస్క్యూ పనులు కాక మరేమిటి?

          అది ప్రొద్దు తిరుగుడు పూవు పేరిటి పాఠశాల - వందలాది విద్యార్థులూ, కాలనీ నివాసులూ పదేపదే రాకపోకల వీధి! ప్రక్క రోడ్డుకడ్డంగా పడ్డ వేప చెట్టు వల్ల నాతో సహా ప్రక్క రోడ్డు మీదు గానో - చుట్టూ తిరిగో వెళ్ళున్నారు గాని - దాన్ని తొలగించి, బాటను చక్కదిద్దినది మాత్రం 6 గురు స్వచ్ఛ కార్యకర్తలే గదా!

          డాక్టర్ మాలెంపాటి గోపాలకృష్ణుని (Just 84!) త్రిగుణాత్మక నినాదాలతో వాళ్లు తమ నేటి కృషిని ముగించారు!

          బుధవారం నాటి వీధి శుభ్రత కోసం మనం కలువదగిన చోటు భగత్ సింగ్ ఆస్పత్రి దగ్గరే!

          బాధ్యతిదియని తెలుసుకొన్నాం

స్వచ్ఛ చర్యకు పెద్దలిందరు - విజ్ఞులందరు పూనుకొంటే

ఇంత కాలం ఇవేం పనులని విమర్శించాం - బద్ధకించాం

ప్రభుత్వాలె - వ్యవస్థలే ఇది నిర్వహించాలని తలంచాం

బాధ్యతిదియని తెలుసుకొన్నాం గ్రామ సేవకు తరలి వస్తాం!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   13.06.2023.