2809* వ రోజు ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు అవసరమా?

2809* వనాటి శ్రమ వేడుక !

         మంగళవారం (27.06.2023) చీకటి వేకువలో ఐదుగురు నిర్వహించిన వేడుకది! రంగస్థలం - చల్లపల్లిలోని RTC బస్ ప్రాంగణం - ద్విచక్రవాహనాల షెడ్డు దగ్గరే, పనీ ఇంచుమించుగా నిన్నటిదే!

         బాగా పెద్దదైన పడిపోయిన వేప చెట్టును నిన్న - నేటి వేకువ వేళల్లో - తడి మట్టి మీద నిలిచి పనిచేస్తూ - కొమ్మల్ని విడగొట్టి - ముక్కలు కోసి - వాటిని చేర్చవలసిన చోటుకు చేర్చిన నలుగురైదుగురు కార్యకర్తలభినందనీయులు - మళ్లీ ఆ వృక్ష వ్యర్థాలన్నీ ఊరి అవసరాల కోసం ఎప్పుడెక్కడెలా ఉపయోగపడతాయో - కార్యకర్తలకొక అంచనా ఉన్నది!

         మరి - SRYSP కళాశాల ముఖద్వారం దగ్గరా, ఊళ్ళో ఇతర చోట్లా గాలికి విరిగిపడ్డ కొమ్మల సంగతేమిటి? స్వచ్ఛ కార్యకర్తల కోసం ఎదురు చూడక - ఆయా చోటుల వారు పూనుకోవచ్చు గదా!

         నేటి కార్యక్రమానంతరం స్వచ్ఛ – సుందరీకరణోద్యమ నినాదాల వంతు గంధం బృందావనుడిది!

         “బుధవారం వేకువ విస్తృత సంఖ్యలో కార్యకర్తలం కలిసి శ్రమించడం – వర్షమున్నచో 216 వ జాతీయ రహదారి మీద, లేనిచో బందరు వీధిలోని ATM కేంద్రం” అనేది ఆదివారం నాటి నిర్ణయం!

         కారణ జన్ములు కారు

కారణ జన్ములు కారీ కర్తవ్య పరాయణులు

అద్భుత వ్యక్తులు కారీ అతి సాధారణ మనుషులు

ఒకింత సామాజిక స్పృహ - ఒక కొంచెం నిజాయితీ –

అవి ఉంటే స్వచ్ఛ కార్యకర్తలుగా మారగలరు!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   27.06.2023.