2821* వ రోజు ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడాలా?

మరొక మారు గ్రామ భద్రతా దళ చర్యలు - @2821*

            పను లైదుగురివి, మరో ముగ్గురిది హంగులు, ఇవన్నీ చోటు చేసుకొన్నది కమ్యూనిస్టు వీధిలోని కమ్యూనిస్టు పార్టీ కార్యాలయం ఎదుట - మాలెంపాటి అంజయ్య గృహావరణలో!

            2 వారాలుగా, వాయిదా పడుతున్న ఆ పనేమంటే - తాడిచెట్టు కన్న మించిపోయిన ఆమ్ర వృక్ష ఖండనమే!

            అది నిచ్చెన కందని కాండం గనుక ట్రాక్టరు ట్రక్కు మీద నిచ్చెన వేసి, ఎత్తు మెట్టు మీద నిలిచి, చెట్టును కోసే మనిషొకడూ, మ్రోకులు కట్టి తెగిన చెట్టెటుగా పడాలో అటులాగే వాళ్లు ముగ్గురూ - ఏమైతేనేం, వేకువ 4.30 - 6.10 నడుమ కార్యకర్తలు తమ లక్ష్యాన్ని సాధించారు!

            నిచ్చెనకడ్డొచ్చిన కొమ్మల తొలగింపూ, తెగిపడిన చెట్టు కొమ్మ రెమ్మల్ని విభజించి, ట్రక్కులో నింపుకుపోతున్న దృశ్యమూ వాట్సప్ మాధ్యమ చిత్రాల్లో గమనించవచ్చు!

            వీళ్ల పరామర్శకులుగా ఇద్దరు పాదచార కార్యకర్తలూ, కాస్త ఆలస్యంగా ప్రాథమిక విద్యాభ్యాస కార్యకర్తా, మధ్యలో తొంగి చూసి, పనులు కాటంకం కలిగించని వాన మిత్రుడూ నేటి శ్రమ వేడుక సాక్షులు!

            మన కాలపురక్తదాన మహావీరుడు - కస్తూరి విజయుడు ముమ్మారు పలికిన స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలతో నేటి రెస్క్యూ కృషి పరి సమాప్తి!

            రేపటి వేకువ మన శ్రమదాన గమ్య స్థలం కమ్యూనిస్టు వీధి చివర దాసరి రామమోహన వదాన్యుని గృహ పరిసరమే!

            మేలిమి బంగారమగును!

సదుద్యమం మీదనినను - సాహసములు నీవనినను

గ్రామానికి ఖ్యాతి దెచ్చు కర్త కర్మలనుకొనినను

ఆడంబర మసలెరుగని అతి సామాన్యుల మనుకొను

మీనిగర్వ శ్రమదానమె మేలిమి బంగారమగును!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   11.07.2023.