2822* వ రోజు ....

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల?

సామూహిక శ్రమదాన పరమార్థం - @2822*

            బుధవారం చీకటి (4.15 AM) కాలపు గ్రామ సేవకు తరలి వచ్చిన కార్యకర్తలు 34 మంది, వారి శ్రమ ఫలించి బాగుపడినవి

1) కమ్యూనిస్టు వీధి ఉత్తర భాగంలోని ఒక ప్రైవేటు స్థలం,

2) అక్కడికి తూర్పు దిశగా - అశోక్ నగర్ వైపున బైపాస్ వీధి,

3) సూరి డాక్టర్ వీధి అనబడే అడ్డ వీధి దాక

            ఎవరి వెర్రి వాళ్లకానందంఅన్నట్లుగా, ఎవరి వ్యసనం వాళ్లకు ముద్దేమో మరి! ఈ కార్యకర్తల స్వచ్ఛ వ్యసనం మాత్రం ఊరి వీధి పారిశుద్ధ్యాన్ని పట్టించుకోని కొందరు గ్రామస్తుల వైఖరికి భిన్నమూ, ఆమోదయోగ్యమూ!

            లేకుంటే - ఒక ప్రైవేటు స్థలంలో వంగి, గంటకు పైగా కష్టించే అవసరం 68 ఏళ్ల విశ్రాంత ఉద్యోగికేమిటి?

            అసలది ఎవరింటి ముంగిలో చూడక ఇంటి సొంతదారులే వారాల తరబడీ పట్టించుకోని మురుగు కాల్వ గట్టును పట్టి పట్టి శుభ్రపరచే అగత్యం మరొక 63 ఏళ్ల విశ్రాంత ఉన్నతోద్యోగికెందుకు?

            శ్రమదానంలో పాల్గొంటున్న వ్యాపారులూ, గృహిణులూ, ఉద్యోగులూ, రైతులూ, వైద్య సిబ్బందీ తామెందుకీ వీధి పారిశుద్ధ్యానికి పాల్పడుతున్నట్లు?

            ఈ శుభోదయాన ఒక 92 ఏళ్ల విశ్రాంత వ్యాయామోపాధ్యాయుడు తన జన్మదిన సంకేతంగా గ్రామ పారిశుద్ధ్య సుందరీకరణల నిమిత్తం తన పొదుపు సొమ్ము లక్ష (దీనితో ఇప్పటిదాకా వీరి ఆర్ధిక సహకారం 18 లక్షలకు చేరింది.) రూపాయలనేలదానమొనర్పవలె?

            తొమ్మిదేళ్లుగా జరుగుతున్న ఈ శ్రమదానమంతా కొందరు తేలిక మనుషుల దృష్టిలో కీర్తి కండూతిగా అనిపించవచ్చుగాక - మాలాంటి కొందరి లెక్క ప్రకారం కనీస సామాజిక బాధ్యత!

            చల్లపల్లిలో 100 కు పైగా కార్యకర్తలు నిత్య కఠిన సామూహిక శ్రమదానంతో తమ ఊరి స్వచ్ఛ - శుభ్ర సౌందర్యాలను ఒక్కో మెట్టు పైకెక్కిస్తున్నందుకు పాతిక వేల మందిమీ సదరు కార్యకర్తలకు కృతజ్ఞులమై ఉండాలి!

            ఈ హరిత సుందరోద్యమానికి సహకరిస్తున్న ఊరి - దేశ - విదేశ సహృదయులను చూసి జాగృతులమవ్వాలి!

            నేటి జన్మదిన వయోవృద్ధునికి మారుగా  అదే వీధి కాకలు తీరిన కార్యకర్త - మాలెంపాటి అంజయ్య వీధి అంతటికీ వినిపించేలా ముమ్మారు ప్రకటించిన స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలతో కార్యకర్తల చెవుల త్రుప్పు వదిలింది.

రేపటి వేకువ మనం శ్రమించవలసిన చోటు :

            వర్షం లేనిచో గ్రామ 3 వీధుల ముఖ్య కూడలిలోనూ,

            ఉన్నచో బైపాస్ మార్గంలోని విజయ్ నగర్ - అశోక్ నగర్ ల వద్దనూ ఉండగలదు.

            సందడిగా శ్రమరీతులు!

సుశ్రుతముగ, విస్తృతముగ - శోభస్కర రూపముగా

అందముగా - హరిత వర్ణ రంజితముగ - స్ఫటికముగా

మంద్రముగా - సుస్వరాల సంద్రముగా ప్రతి వేకువ

సామాజిక సామూహిక సందడిగా శ్రమరీతులు!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   12.07.2023.