2823* వ రోజు ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల?

ప్రకృతితో స్వచ్ఛ కార్యకర్తలతో ప్రకృతి దాగుడుమూతలు - 2823*

          జులై - 13, 2023 - గురువారం నాటి వేకువ 4.12 - 5.15 నడుమ 16 మంది కర్తవ్యనిబద్దుల పారిశుద్ధ్య క్రీడలవి! కరెంటు లేని, వానా, గాలీ దోబూచులాడిన చివరికని వార్యంగా 45 నిముషాల ముందుగానే అగిన స్వచ్ఛంద సేవల సంగతిది!

          అక్కడికీ - వాతావరణ సూచనలతో వాన రాకడను శంకించి, సాదా సీదా వర్షాన్నెదుర్కొనేందుకు సంసిద్ధులై, కోట మలుపు వద్ద ఆగిన కార్యకర్తలు పట్టుమని 15 నిముషాలు పెట్రోలు బంకు దాక వీధి సేవలు చేశారో లేదో - వానగాడు రానే వచ్చాడు. తడిసిన రోడ్డు పైన అంటుకొన్న దుమ్ము చీపుళ్లతో ఊడి రాక - కార్యకర్తలు మనసు మార్చుకొని, అశోక్ నగర్ కు మారారు!

          అక్కడ చీపుళ్లకు బదులు కత్తులు, దంతెలకు 15 - 20 నిముషాలు పని చెప్పారో లేదో - మళ్లీ వాన పలకరింపులూ చిలకరింపులూ! చెట్ల క్రింద నిలిచి, తడిసి, మరొక ప్రయత్నం కూడ చేసేంతలోనే పెళ పెళమని ఉరుములూ, తళ తళా మెరుపులూ, గాలి + వానాజమిలిగా విజృంభించి

          ఈ లోపే 3గ్గురు నాలుక్కిలోమీటర్ల దూరాన - వేంకటాపురం దగ్గర బాట ప్రక్కల పరిశీలనకు వెళ్లివచ్చి - చివరికి అర్ధాంతరంగానే ఆగిన శ్రమదానం! తడిసి ముద్దైన కార్యకర్తలు 6.00 కాక ముందే ఇళ్లకు చేరిక!

          ఇదీ టూకీగా గురువారం వేకువ సమయపు గ్రామ స్వచ్ఛసుందరోద్యమ సమాచారం! ఇంతటి గాలి, వాన, ఉరుముల, పిడుగుల వాతావరణంలో జరిగిన రిస్కీ శ్రమదానాన్ని నిబద్ధతనాలో వ్యసనమనాలో ఆదర్శమనాలో తెలియని పరిస్ధితి!

          ఐతే ఈ తొమ్మిదేళ్ల శ్రమదానం అమాయకం కాదనీ, అనాలోచితం కాదనీ, అదొక నిష్టా గరిష్ట, ప్రణాళికాబద్ధ, ప్రయోజనకర, ఆవశ్యక ఉద్యమమని మాత్రం చెప్పగలను!

             ఇక  రేపటి 100 పూల మొక్కల  ప్రతిష్టాపన నిమిత్తం బందరు ఉపరహాదారిలో - గంగులపాలెం & పెదకళ్ళేపల్లి అడ్డ రోడ్డుల మధ్య  ఉండునని ఇందుమూలంగా తెలియపరచడమైనది.     

    కావిస్తున్నాం సహస్ర ప్రణతులు!

అందమైన సొంతూరి కోసము సుగంధ భరిత రహదార్ల నిమిత్తము

కలిసికట్టుగా భావికాల సౌకర్య సాధనకు నడుం బిగించిన

ఊరి ప్రతిష్ఠకు ఉత్సాహించిన బలం డ్రైనులకె బలిగావించిన

కర్మవీరులకు - ఘర్మ దాతలకు కావిస్తున్నాం సహస్ర ప్రణతులు!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   13.07.2023.