2824* వ రోజు ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల?

2824* వ నాటి హరిత యజ్ఞం.

          ఇటీవల ఈ యజ్ఞంఅనే మాట వాడి, వాడి అరిగిపోతున్నది! జలయజ్ఞం, అక్రమ ధన యజ్ఞం, విద్యాయజ్ఞం వంటివి వినపడుతున్నవి! స్వచ్చ చల్లపల్లిలో మాత్రం గ్రామ సుందరీకరణ యజ్ఞం, శ్రమదాన యజ్ఞం, రహదార్ల పచ్చ తోరణ యజ్ఞం అనే పదాలు పత్రికల్లో, టీ.వీ.ల్లో, గ్రామస్తుల చర్చల్లో చోటుచేసుకుంటున్నవి!

          ఈ శుక్రవారం పూట వేకువ కూడ ఊళ్లో మరెక్కడా చోటు లేక - బందరు జాతీయ రహదారి కేంద్రంగా 100 గన్నేరు పూల చెట్ల ప్రతిష్ఠాపనా యజ్ఞం ఒక క్రమ పద్ధతిలో జరిగిపోయింది! సదరు పుష్ప - హరిత యజ్ఞ కర్తలు 35 మంది! రెగ్యులర్ కార్యకర్తలు - 19మెకానిక్ కార్యకర్తలు  11, పాత్రి కేయ - ఛాయాగ్రాహక మిత్ర కార్యకర్తలు - నలుగురైదుగురూ!

          యజ్ఞంసంగతేమో గాని, ఊరికి దూరంగా రహదారి చెంత ఇన్ని వర్గాల - వయస్సుల వాళ్లు వేకువనే గుమికూడడమూ, తమ ఊరినే కాక చుట్టూ 8 రోడ్ల మీద వేల సంఖ్యలో చెట్లూ, పూల మొక్కలూ నాటే లక్ష్యాన్ని సాధించడమే ఈ రోజుల్లో అద్భుత సంఘటన!

          మరి, “గంటన్నర పాటు ఇందరు ఉత్సాహవంతులు రాదారికి దక్షిణాన కొలువు తీర్చింది 100 గన్నేరు పూల చెట్లనేనా?” అంటే :

          అక్కడికదే గొప్ప! ఎత్తు రోడ్డు నుండి జారిపడకుండ దిగాలి, అడ్డదిడ్డంగా పెరిగిపోతున్న జిల్లేడు - మేడి - పిచ్చి చెట్లను తీగల్నీ తొలగించాలి, పాదులు త్రవ్వాలి, ఊత కర్రను పాతి అప్పుడు గదా మొక్కలు నాటేది?

          ఇక - ఇక్కడి ప్రత్యేకతేమంటే - ఇందరిలో ఏ ఒక్కరూ మొహమాటపడి, తప్పని తద్దినానికి వచ్చినట్లు కాక తన ఊరి హరిత హార పక్రియలో తన పాత్ర ఉండాలనీ, అది తన బాధ్యతనీ భావిస్తూ పనిచేసుకుపోవడం! మరి అందుకే గదా – “స్వచ్ఛ పరిశుభ్ర హరిత - సుందర - శ్రమదాన చల్లపల్లిఅని ఈ ఊరికి పేరొస్తున్నది?

          6.20 సమయాన నేటి శ్రమదాన సమీక్షా సమావేశంలో కాలికి కట్లతో వచ్చిన శాస్త్రి మాస్టారూ, మీడియా ప్రతినిధులూ శ్రమదాతల సమూహాన్ని కెమేరాల్లో దాచారు. రెండేళ్ల భవిష్యత్తులో ఈ రహదారి రంగురంగుల పూలతో ఎంత కనువిందు చేయనున్నదో DRK గారు విశదపరిచారు.

          మెకానిక్ ల పక్షాన నేటి పూల మొక్కల ఖర్చుగా 1000/- ను ఉస్మాన్ షరీఫ్ సమర్పించి, ముమ్మారు కాదు ఆరు మార్లు స్వచ్ఛ - సుందరోద్యమ నినాదాలను ప్రకటించారు!

          నేటితో 600 పూల మొక్కలు రక్షణ కంపల్తో సహా ఈ రహదారి ప్రక్కల కొలువు తీరినవి!

          రేపటి వేకువ సైతం గ్రామ దక్షిణ భాగపు ఈ జాతీయ రహదారి వద్దనే మన కృషి!

         ప్రజారోగ్యమున కాదిమంత్రములు!

ఊరి మేలుకై నిరంతరముగా స్వచ్ఛ సైనికుల సమగ్ర సేవలు

ఆర్థిక సమయ - శ్రమదానములతొ అలంకృతముపై గ్రామ వీధులు

స్వచ్ఛ - శుభ్రతా - సౌందర్యములే ప్రజారోగ్యమున కాదిమంత్రములు!

గ్రామస్తుల సహకారము లేనిదె రావు గదా ఆ సౌభాగ్యమ్ములు!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   13.07.2023.