2825* వ రోజు ....

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే  ప్లాస్టిక్కులు వాడనేల?

స్వచ్ఛోద్యమ చల్లపల్లిలో ఇప్పటి కృషి 2825* నాటిది!

కృషికారులు నాతో సహా 28 మంది - ఈ శనివారం (15.7.23) వేకువ 4.16 - 6.05 వేళల నడుమ జరిగిన రహదారి హరితాలంకరణం గంగులపాలెం మరియు పెదకళ్లేపల్లి రోడ్లమయాన! ప్రాత స్వచ్చ కార్యకర్తలేతప్ప – ఈ వేకువ ఇతర పౌరులకు దయ రాలేదు!

ఈ ఉషః కాలపు ఒకే ఒక బాధ్యత – పూల మొక్కలకు కంప కట్టుటే! “కంప కట్టుట” అనగా:

- ముందు రోజే ముగ్గుర్నలుగురు కార్యకర్తలు ఏ నాలుగైదు కిలోమీటర్లో పోయి ముళ్ల చెట్లను కనిపెట్టి, నరికి, ఈ రహదారి దగ్గరకు చేర్చుట,

- ఏ ముళ్ల చెట్ల కొమ్మలు రెండేళ్లకు పైగా పుచ్చకుండ మన్నుతాయో – ముళ్లు వాడిగా గుచ్చుతాయో ఎన్నిక;

- ఒక ఆల్ రౌండర్ నాయకత్వంలో నలుగురు కత్తుల వాళ్ళు సదరు ముళ్ల కొమ్మల్ని మొక్క చుట్టూ దడి కట్టేందుకు తగ్గ పరిమాణంలో ముక్కలుగా నరుకుట, రోడ్డు బారునా అవసరమైన చోట్లకు చేర్చుట;

- సుమారు డజను మంది పలుగుల్తో నేలకు కంతలు పెట్టి, మొక్క చుట్టూ కంపను గ్రుచ్చి, త్రాడు చుట్టి, ముడులు వేయుట;

ఈ డ్యూటీ నిన్నటి దాక ట్రస్టు ఉద్యోగులు చేయగా, ఈ రోజు చేసినది ఉద్యోగులు, గృహిణులు, డాక్టరమ్మలు, డాక్టరయ్యలు, వ్యాపారులు, రైతులు, వయో వృద్ధ విశ్రాంత ఉద్యోగులూ!

          “యథా యధాహి ధర్మస్య గ్లానిర్భవతి భారతః

          .......తదాత్మానాం సృజామ్యహమ్..”

అని విష్ణువు దశావతారాలెత్తినట్లు –

          పైన చెప్పిన మనుషులే తమ తమ ఐడెంటిటీల్ని వదలుకొని,

          కంపకట్టుడు వాళ్లుగా - మురుగు పని వాళ్లుగా - వీధి పారిశుద్ధ్య కృషీవలురుగా – శ్మశాన సంస్కర్తలుగా - ఎన్ని అవతారాలైనా ఎత్తుతుండడమే ఈ సమకాలపు విశేషం!

నేటి పని వేళ, సమీక్షా సమయ విశేషాలు కొన్ని:

- ఒకానొక శాస్త్రి గారు ఇంకా మానని కాలి గాయాల బ్యాండేజితో వచ్చుట,

- తరచూ పడిలేవడంలో మంచి అనుభవజ్ఞురాలైన అరవయ్యారేళ్ల గృహిణి మరొకమారు పడి లేచుట,

- గత కొన్నాళ్ల నుండి రాని గోళ్ల విజయ్ కృష్ణ స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలుచ్ఛరించుట,

- గురవయ్య గురువు అంబేత్కర్ సూక్తులు వినిపించుట,

- ఈ ఉదయం కంప రక్షణ చేసిన పూల మొక్కలు 47 గా గుర్తించుట,

          రేపటి వేకువ - మరొక - 7 వ వంద పూల మొక్కలు నాటుటకు ఇదే బందరు రహదారిలో కార్యకర్తలు కలువదగును!

                    సహస్ర ప్రణతులు!

ఏ ఒకరిద్దరొ విభేదించినా – విమర్శించినా - వెనకడుగేయక

సమస్యలెన్నో స్వాగతించినా – సమున్నతాశయ సాధన మరువక

ఆరాధనలకు - అవహేళనలకు - అతీతముగనే ముందడుగేసిన

రెండు వేల ఎనిమిదొందల రోజులు నిండు వేడుకకు సహస్ర ప్రణతులు!

 - ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   14.07.2023.