2826* వ రోజు ....

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడాలా?

ఆదివారం నాటి బందరు రహదారి హరిత సుందరీకరణం - @2826*

        చల్లపల్లి స్వచ్ఛ - సుందరోద్యమకారుల శ్రమదానానికి 12-11-14 నాటి ఆది తప్ప - ఇప్పట్లో అంతం కనిపించడమే లేదు! సామాజిక - సామూహిక ప్రయోజనం కోసం కష్టించడంలో రుచి తెలిసిన, పరస్పర సత్సాంగత్యం తొమ్మిదేళ్లుగా అనుభవించిన, శ్రమైక జీవన సౌందర్యం 2826* నాళ్లుగా ప్రదర్శిస్తున్న సుమారు వంద మంది కార్యకర్తలు ఇక వెనకడుగేస్తారని ఎలా అనుకొంటాం?

        కోవిడ్ దుష్టకాలంలో కొద్దిరోజులీ కార్యక్రమం ఆగితేనే వీరిలో కొందరు తట్టుకోలేకపోయారు. తమ దైహిక - మానసిక ఆరోగ్యాల కోసం ఈ బహుళార్థ సాధక శ్రమ వేడుకను నమ్ముకొన్న వాళ్లందులో సగం మంది ఉన్నారు మరి!

        గ్రామస్తులందరి సంగతేమో గానీ, నాపాటికి నేను చలపల్లి లోపలా,బైటా ఎక్కడకెళ్ళినా రోడ్ల శుభ్రతనూ, కొట్టొచ్చినట్లు కనిపించే పచ్చదనాన్నీ, రహదార్ల పూల సొగసుల్నీ 8-9 ఏళ్ళుగా - ఒక్కొక్కటిగా కార్యకర్త కాయకష్టంతో వస్తున్న సౌకర్యాలనీ అనుభవిస్తున్నాను, ధన్యవాదాలు తెలుపుకొంటున్నాను!

        నేడు కాకుంటే మరొక నాడు – తన ఊళ్లో అడుగడుగునా సుమ సుందర దృశ్యాల్నీ, మెరుగుపడుతున్న వసతుల్నీ, పెంపొందుతున్న ఆరోగ్యాల్నీ పాతిక వేల మంది గ్రామ సోదరులూ అంచనా కట్టకపోరు! తుల లేని, వెల లేని శ్రమదానాన్ని అర్థం చేసుకొని, అనుసరించకపోరు! అట్టి ఆశావహ దృక్పథమే స్వచ్ఛ కార్యకర్తల లక్షల్లక్షల పనిగంటల శ్రమదాన రహస్యం!

        నేటి (16.7.23) బ్రహ్మముహుర్తాన - 4.15 - 6.00 వేళల నడుమ బందరు ఉపరహదారిలో 42 మందిలో కనిపించినది ఆ సానుకూల దృక్పథమే! చూస్తుండగానే 250 - 300 గజాల బారునా 100 ఎర్ర రేరాణి (నైట్ క్వీన్) పూల మొక్కల్ని కొలత లేసి, పాదులు త్రవ్వి, నాటడంలో పరమార్ధమదే!

        ఇదొక పవిత్ర కార్యమనుకొంటే - ఈ వేకువ అందులో భాగస్వాములు రెగ్యులర్ కార్యకర్తలతో బాటు ధ్యానమండలి, లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ వంటి సేవా సంస్థలతో బాటు ఇతర ఔత్సాహికులు!

        ఏదో మ్రొక్కుబడిగా కాక - నిష్టగానూ, మొహమాటానికాక ఐచ్ఛికంగానూ, ముక్కుతూ మూల్గుతూ కాక ఆట - పాట గానూ, స్వల్ప కాలికంగా కాక సుదీర్ఘం గానూ ఇక్కడ శ్రమదానం సాగుతున్నదంటే - ఎవరు నాల్గు రోజులు వచ్చి పాల్గొన్నా కారణం తెలిసిపోతుంది!

        రాయపాటి రాధాకృష్ణుల వారు విస్పష్టంగా ప్రకటించిన శ్రమదానోద్యమ నినాదాలతోనూ -  

        మనసున్న వాళ్లను కదిలించిన నందేటి శ్రీనుడి పాటల్తోనూ,

        స్వచ్ఛ వైద్యుని పట్టరాని ఆనందపూర్వక దైనందిన కృషి సమీక్షతోనూ - నేటి కార్యక్రమం ముగిసెను!

        ఈ హరిత సుందరీకరణ నిమిత్తమే బుధవారం వేకువ ఇదే బందరు రాదారిలో మనం కలుద్దాం!

        సమర్పింతు కృతజ్ఞతాంజలి

అర్ధరాత్రపరాత్రి బస్ దిగి స్వగృహమ్ముల కేగు సౌ

కర్యమే కనరాకయోమయ సంకట స్థితిలో ప్రయా

ణికుల కోసం ముందు కొచ్చిన షణ్ము వ్యాపారికిన్

సమర్పింతు కృతజ్ఞతాంజలి జనం తరపున మెండుగన్!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   16.07.2023.