2827* వ రోజు ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల?

2827* వ నాటి రెస్క్యూ టీమ్ పరిమిత సేవలు.

            మళ్లీ సోమవారం (17-7-23) వచ్చేసింది. 4.30 కాకముందే బొత్తిగా పరిమిత సంఖ్యలో - కేవలం 3గ్గురు స్వచ్ఛ కర్మిష్టులు గంగులవారిపాలెం రోడ్డెక్కనే ఎక్కారు.

            ఎంచేతో గాని - సర్వకాల సర్వావస్థల్లో రెస్క్యూ టీమ్ వెన్నంటి నిలిచే ఇద్దరు సీనియర్ మోస్ట్ లు ఈ వేకువ కనపడలేదు!

            అనుకోకుండా ఇదే వీధికి చెందిన మరో ఇద్దరు వయసు రీత్యా సీనియర్లు మాత్రం ½  గంటపాటు పారిశుద్ధ్య కృషిలో వ్రేళ్ళు పెట్టారు! త్రిమూర్త్యాత్మకమైన నేటి శ్రమదానం పంచ ముఖీనమయిందన్న మాట!

ఇవాల్టి పని వివరాల కొస్తే:

- గత వారంలో ఎప్పుడో గాని - విద్యుత్ శాఖ వారు గంగులపాలెం వీధిలో రోడ్డు వైపు పెరిగిన చెట్ల కొమ్మల్నీ, కరెంటు తీగలదాక ఎదుగుతున్న ఒక పెద్ద చెట్టునూ కొట్టి వేసిన కారణాన

- వాటిని తొలగించే పనిమాదికాదని చేతులు దులుపు కొన్నందున,

- బాట పొందికకూ, శుభ్రతకూ లోపం జరిగితే చూసి తట్టుకోలేని స్వచ్ఛ కార్యకర్తల బలహీనత వల్ల,

- సదరు కొమ్మ రెమ్మల్ని - ఆకుల్నీ, డ్రైన్లో దిగి మరీ ఎత్తి, ఊడ్చి, టాక్టర్ లో చేర్చి, చెత్త కేంద్రానికి తరలించడమే నేటి పరిమిత కృషన్న మాట!

            ముమ్మారు గ్రామ స్వచ్ఛ - సుందరోద్యమ నినాదాలతో సోమవారం శ్రమ వేడుకను ముక్తాయించినది మాలెంపాటి అంజయ్య మహాశయుడే!

శ్రమదానం విలువేదో తెలియకుంది!

అడగకనే సమకూరిన స్వచ్ఛ శుభ్రతలు గావున

అభ్యర్థింపకనే ఈ హరిత సంపదున్నందున

వద్దన్నా ఆగని ఒక స్వచ్చోద్యమ ప్రగతి వలన

శ్రమదానం విలువేదో గ్రామానికి తెలియకుంది!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   17.07.2023.