2828* వ రోజు ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల?

రిస్కీ టీమ్ బ్యూటిఫికేషన్ టీమ్ గా మారిన వేళ... @2828*

          మంగళవారం (18.7.23) - గంగులవారిపాలెం దారిలో బండ్రేవుకోడు ఉత్తరపు గట్టు చెట్ల దగ్గరి సమామాచారమిది. తొలినాళ్ల స్వచ్ఛ కార్యకర్త, ఇటీవల కొన్నాళ్లు మానిన స్వచ్ఛ - సుందరోద్యమకారుడు తన విధులకు పునరంకితుడైన రోజిది!

          యధాప్రకారం 4.30 కు ముందే కార్యక్షేత్రానికి చేరుకొన్న నలుగురు కాక – కాస్త వెనకా ముందుగా మరో ఇద్దరు పెద్దల ప్రమేయంతోనూ, ఉదయ కాలపు నడక కార్యకర్తలు ముగ్గురి రాకతోనూ ఈ పూట శ్రమదానం 6.00 కు ముగిసింది.

మరి – గంటన్నరకు పైగా ఈ శ్రామిక బృందం ఏ సుందరీకరణ సాధించిందయ్యా అంటే:

సదరు మురుగు కాల్వ గట్టున ఏడెనిమిదేళ్లుగా వీళ్ళే నాటి, పెంచిన 20 అడుగుల ఎత్తైన – పచ్చదనం పరవళ్ల త్రొక్కుతున్న చెట్లున్నవి గదా - మురుగు నీటి అంచున మొలిచిన - ఏపుగా ప్రాకుతున్న పసుపు పచ్చ పూల తీగల్ని ఒక్కో వృక్షమ్మీదకు పాకించే ప్రయత్నమే ఈ కార్యకర్తల నేటి నిర్వాకం!

          అందుగ్గానూ నిచ్చెన, త్రాడు, పలుగు, పార వగైరాలతో పని. మనలో ఎవరైనా – ‘ఇదేమంత ఘనకార్యం’ అనుకోవచ్చు, కాని కొద్ది రోజుల్లో ఆ తీగలు చెట్ల పైకి ప్రాకి, పూస్తే కనువిందు చేయడమే ఈ కొద్దిమంది దార్శనికత!

          కొన్నాళ్ల ఎడబాటు తర్వాత - ఈ వేకువ తన సామాజిక బాధ్యత తీర్చుకొన్న తూములూరి లక్ష్మణరావే నేటి స్వచ్చోద్యమ నినాద కర్త!

          ఊరికి దక్షిణాన – బందరు రహదారి ప్రక్కనే రేపటి మన పచ్చతోరణ ప్రయత్నం!

                              సహస్ర ప్రణతులు!

కష్టములన్నీ ఇష్ట పూర్వకము – భ్రష్ట కశ్మల విఘాత కారకము

సమగ్ర సుందర చల్లపల్లికై స్వచ్ఛ సైనికుల విశ్వ ప్రయత్నము

తొమ్మిదేళ్లుగా నమ్మజాలని సుదూర - సుదీర్ఘ క్లిష్ట ప్రయాణము

నాలుగు లక్షల పని గంటల శ్రమదాతలకే మా సహస్ర ప్రణతులు!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   18.07.2023.