2829* వ రోజు ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల?

20 1 ½ 70 100 = 2829* నాటి శ్రమ వేడుక!

          అనగా 20 మంది వాలంటీర్లు, తలా గంటన్నర సమయమూ, 70 గజాల రహదారి, 100 పూల మొక్కల ఏర్పాటు ఇదీ 18.7.23 (బుధవారం వేకువ 4.17 - 5.50 ల నడుమ బందరు రహదారిలో ఊరి వైపున జరిగిన శ్రమదానం!

          ఇలా అంకెల్లో, ఈక్వేషన్స్ తో, ఒక్క వాక్యంలో 30 పని గంటల సామాజిక బాధ్యతను మాటల్లో చెప్పడం తేలికే గాని, ఆ జివ్వుమనే చలి గాలిలో - వాన తుంపరలో - కటిక చీకట్లో ఊరికి దూరంగా - రహదారికి దక్షిణంగా - ఎగుడుదిగుడు గుంటల్లో దిగి, కొలత లేసి, పాదులు త్రవ్వి, పూల మొక్కల్నాటడం మాత్రం చెప్పినంత సులభం కాదు!

          అందుకు చాల నిబద్ధత కావాలి! మనిషిగా పుట్టినందుకు - సమాజంలో పెరిగి, అవగాహన నెరిగినందుకు తీసుకొన్నదాంట్లో కొంతైనా తిరిగి చెల్లించే బాధ్యత తెలియాలి! తెలిసీ తెలియని తేలిక మనుషుల ఎద్దేవాలను తట్టుకొనే నిబ్బరం ఉండాలి! ఇన్ని వేల రోజులు శ్రమించి, కష్టార్జితాన్ని వ్యయించి, నాటిన పూల మొక్కలనెవరో - ఎందుకో పీక్కెళ్తే మళ్లీ నాటే సహనం కూడ కావాలి మరి!

          అవేవో చందమామ - కథల్లో భేతాళుడు విక్రమార్కుడితో చెప్పినట్లు - చల్లపల్లి స్వచ్ఛ కార్యకర్తకివన్నీ అవసరం! లేకపోతే శవంలోని భేతాళుడు గబుక్కున చెట్టెక్కేస్తాడు!

          స్వచ్ఛ శ్రమదాతలకీ లక్షణాలుండ బట్టే ఈ తొమ్మిదేళ్ల విజయవంతమైన హరిత -  సుందరోద్యమం! పాక్షికంగానైనా ఇంత పెద్ద గ్రామ శుభ్ర సుందరీకరణం! అందుకు ఈ వేకువ సమయపు 20 మంది కృషీ మరొక తార్కాణం!

          సన్న చినుకులు కాక మధ్యలో 2 మార్లు వర్షపురుషుడు గట్టిగా బెదిరించినా, నాటిన మొక్కలకు ఊత కర్రలు తక్కువైనా - మొత్తానికి నేటి తమ అంచనాలందుకొన్నారు కార్యకర్తలు! కాసానగర్ కూడలి దాక - 2.2 కిలో మీటర్ల ఈ రహదారికి ఉత్తర దక్షిణపుటంచుల్లో - అనగా 4.4  కిలోమీటర్ల మేర - ముందనుకొన్న 1213 వందలు బదులు - 1600 మొక్కలు నాటాలనే క్రొత్త అంచనాకొచ్చారు.

          రోజుటి కన్న 10 నిముషాల ముందే ముగిసిన నేటి శ్రమదానం పిదప జరిగిన సమీక్షాకాలంలో:

- 23 వ తేదీ - ఆదివారం నాటి వైద్య శిబిరానికి గోపాళం శివన్నారాయణ పనుపున స్వచ్ఛ కార్యకర్తలకు DRK అహ్వానమూ,

- చానాళ్ల తర్వాత గొంతు సవరించి, మట్టా మహాలక్ష్మి పాడిన మేఘ సందేశం సినిమా గీతమూ (నిన్నటి దాక శిలవైనా) ప్రధాన విశేషాలు!

- అది గుప్తమో లేక బహిరంగమో గాని షణ్ముఖ సంస్ధ వారి విరాళం - 500/- స్వచ్చోద్యమ ఖర్చుల నిమిత్తం ముట్టినదని తెలుస్తున్నది.

          తొమ్మిదవ వంద మొక్కలు నాటేందుగ్గాను రేపటి వేకువ మనం కలుసుకోదగినది పెదకళ్లేపల్లి రోడ్డుకు దగ్గర్లోని బందరు రహదారిలోనే!

         ఘర్మదానశీలతకీ

ఎన్నెన్నో సాధించిన - ఎంతెంతో కష్టించిన - ఏ మాత్రం గర్వించక - ప్రమత్తతకు చోటివ్వక

స్వచ్ఛోద్యమ కాలంలో - సాగించిన సమరంలో వెన్నుదన్నుగా నిలిచిన వేల మంది దాతలకూ

ఊరంతటి మేలే తమ ఊహల్లో నింపుకొనీ, చేతలుడిగి ఉండిపోక స్థిత ప్రజ్ఞతో నిలిచిన

కష్ట నష్టముల కోర్చిన కార్యకర్తలందరికీ, ఘర్మదానశీలతకీ కావిస్తున్నాం ప్రణతులు!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   19.07.2023.