2830* వ రోజు ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల?

ఇది 2830* వ శ్రమ వేడుక సమాచారం!

            గురువారం(20.7. 23) వేకువ మరీ 4.13 సమయానికే 2/3 కిలోమీటర్ల ప్రయాణంతో ఏ నాలుగింటికో బయల్దేరిన కార్యకర్తలు N.H.16 దగ్గర తమ బాధ్యతలకు పూనుకొన్నారు! (చల్లపల్లిలో గాక - ఇలాంటి చిత్రాలు మరెక్కడ జరుగుతాయి?) స్వచ్ఛ వాలంటీర్ల సంఖ్య ఈ వేకువ కాస్త బలహీనపడి, కనా కష్టంగా 21 కి పరిమితమయింది!

            ఐతే - మనుషుల సంఖ్యదేముంది – “గంగిగోవు పాలు గరిటెడైనను చాలు....అని వేమన చెప్పినట్లు - పని నాణ్యత, చిత్తశుద్ధి, కార్యదీక్ష ఇవి కదా చూడవలసింది?

            ఈ కాస్త మంది కార్యకర్తలే జాతీయ రహదారి ఉత్తర దక్షిణాల్లో గోతులు త్రవ్వి, మొక్కలు నిరభ్యంతరంగా పెరిగేందుగ్గాను పిచ్చి మొక్కల గుబుర్లను తొలగించి, అక్షరాలా 90 సువర్ణ గన్నేరు పూల మొక్కలు నాటారు! దీంతో వివిధ జాతులు, రంగుల పూల మొక్కల సంఖ్య 890 కు చేరింది!

            చూద్దాం - ఈ రహదారిలో మిగిలిన 700 మొక్కల పూలవనం తయారీలో - ఇటు చల్లపల్లి వారూ,   అటు శివరామపురీయులూ, కాసానగరజనులూ కలిసి రాకపోతారా?

            ప్రస్తుతానికైతే - రేపటి సత్కార్యంలో పాలు పంచుకొనే సువర్ణావకాశం పెదకళ్లేపల్లి వీధి ప్రజలది! ఈ రహదారిలో శివరాంపురం బాటకు తూర్పు - పడమరల్లో 100 పారిజాత పూల మొక్కలు నాటి పెంచాలనే తాతినేని రమణుని ప్రతిపాదన కార్యకర్తలకు నచ్చింది. (ఈ మొక్కల ప్రాయోజకులు బహుశా రెడ్ క్రాస్ వారు కావచ్చు!)

            చల్లపల్లి - తదితర పరిసర గ్రామ ప్రజలే ఈ2.2 కిలోమీటర్ల అద్భుత పుష్పమార్గ ఆహ్లాద లబ్దిదారులు! వాళ్లలో ఎందరు ఎంత త్వరగా పర్యావరణ ఆత్మఘోషనాలకిస్తే ప్రతిస్పందించి, స్వచ్ఛ కార్యకర్తలతో కలిసి వస్తే - అది ఈ ప్రాంతానికంత శ్రేయోదాయకం!

            ఈదురు గాలి తప్ప - రెండు మార్లు వాన బెదిరింపులు తప్ప - నేటి రహదారి సుందరీకరణం సజావుగా సాగింది. కాకపోతే నిన్నటి కన్న ఎక్కువ సమయం - 6.10 దాక పట్టింది!

            పనిని ఇష్టంగా - బహుముఖ ప్రయోజకంగా - నిస్వార్థంగా చేసే వాళ్లకు అందరి ఆనందం కోసం శ్రమించే కార్యకర్తలకు - కాలనియమం అంతగా పట్టదనుకోండి!

6.20 నుండి జరిగిన శ్రమ వేడుక సమీక్షలో:

- గోళ్ల విజయకృష్ణ పేరు పేరునా కార్యకర్తల్నాహ్వానించగా,

- శుక్ర - శని - ఆదివారల శ్రమదాన ప్రణాళిక ను డాక్టర్ డి.ఆర్.కె. గారు వివరించగా,

- నిన్నటి - నేటి స్వచ్ఛ - సుందరోద్యమ నినాదాలను యద్దనపూడి మధు, BSNL నరసింహారావులు మ్రోగించగా,

నేటి కార్యక్రమం ముగిసింది!

            ఘర్మదాతలకు సహస్ర ప్రణతులు!

ఇది శ్రమదానమ! సమాజ బాధ్యత? అపూర్వ సేవల? అప్పు తీర్చుటా?

లక్షల గ్రామాలకు దిక్సూచిక? కనీస మానవ కర్తవ్యాంశమ?

ఊరి కోసమై నిరంతరంగా - ఉత్సాహంగా ఉద్విగ్నంగా

సాగు వేడుకా?..... కర్మవీరులకు ఘర్మదాతలకు సహస్ర ప్రణతులు!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   20.07.2023.