2831* వ రోజు ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల?

శ్రావణ శుక్రవారం బ్రహ్మ ముహుర్తపు వీధి సేవలు - @2831*

            వీధేమో బందరు ఉపరహదారిలో పెదకళ్లేపల్లి కాసానగర్ల కూడలి, జరిగిందేమో చెత్త - మురికి - దుమ్ము పని, కర్తలేమో 20 - 1 మంది ! ఇక, సమయమందురా - 4.15 - 6.05 మధ్యన!

            పని ఉద్దేశం - శనివారం వేకువ నాటబోయే 100 పారిజాత సుగంధ హరిత పుష్ప వృక్ష ప్రతిష్టాపనం! అందుక్కారణం – “ఊరి బైట కూడ అష్ట రహదార్లలో ఏ ఒక్క టీ బోసిగా కనిపించరాదుఅనే స్వచ్ఛ కార్యకర్తల పంతం!

            వాళ్ల ప్రస్తుత పచ్చతోరణ ప్రణాళిక ప్రకారం - ఈ జులై అగస్టు మాసాల వర్షానుకూల కాలంలో:

1) నడకుదురు వైపుగా దాతల సౌజన్యంతో వందలాది పండ్ల మొక్కల్నీ,

2) శివరామ వేంకటాపురాల నడిమి 2కిలో మీటర్ల రోడ్డును కోనేరు మారుతీ ప్రసాదు వితరణతో దట్టంగా చెట్లునాటి పెంచడాన్నీ,

3) ఈ 2.2 కిలోమీటర్ల బందరు క్రొత్త రహదారి పొడుగునా సుమారు 16 వందల పూల మొక్కల్నీ నాటి సంరక్షించాలట!

            ఇవన్నీ కలిపి - ఏ12 కిలోమీటర్ల కొంగ్రొత్త హరిత వనాలుగానో వాళ్ల మాటల్ని బట్టి తెలిసింది!

            అసలిదంతా ఎవరి బాధ్యత? ప్రజల చేత - ప్రజల నుండి ప్రజల కొరకు ఎన్నికైన పంచాయతీ జిల్లా - రాష్ట్ర యంత్రాంగాలదా? లేక - పట్టుమని పాతిక ముప్పై - 40 మంది స్వచ్ఛ సేవకులదా? ఎవరి బాధ్యతకెవరు సహకరిస్తున్నారు?

            అధికార వ్యవస్థలేమో ఈ పచ్చతోరణాల సంగతిని పట్టించుకోదగినంతగా పట్టించుకోవు, స్వచ్ఛంద శ్రామికులేమో తొమ్మిదేళ్లుగా ఏ ఒక్క పూటా చెమట చిందించడం మానరుగాక మానరు, పర్యావరణ విధ్వంసమేమో అందోళనకర స్థితికి చేరక ఆగదు!

            మన చల్లపల్లి గ్రామం సంగతే చూడండి - 2831 రోజులుగా శ్రమదానోద్యమమే లేకుంటే,

            తమ కష్టార్జిత ధనాన్నీ - అంతకన్న విలువైన కాయకష్టాన్నీ - అంచనా కట్టలేనంత విలువైన సమయాన్నీ ఈ కార్యకర్తలు మాట వరసకి విరక్తి చెంది, విరమించారనుకొందాం - ఇక అప్పుడు రాష్ట్రమంతటికీ ఉదాహరణయోగ్యమైన ఇక్కడి స్వచ్ఛ - పరిశుభ్ర - సౌందర్యాల సంగతేమౌతుంది?

            సూర్యోదయానంతరం - 6.05 సమయానికి పని విరమణ ఈల మ్రోగినప్పుడు శ్రమించి అలసిన దేహాలతో - తాము గంటన్నర పాటు కష్టించగా రూపొందిన నాలుగు రోడ్ల కూడలి అందచందాలను తృప్తిగా చూసుకొంటూ శ్రమ జీవులు తుది సమీక్షా సమావేశ స్థలికి చేరుకొన్నారు!

            రెడ్ క్రాస్ వారు నిన్న నాటిన 4 పూల మొక్కల, రేపు D.S.P. గారో, మరో ప్రముఖులో అతిథులుగా వచ్చే రహదారి పచ్చ తోరణాన్ని,

            ఆదివారం నాటి వైద్య శిబిర కార్యక్రమాన్నీ తెలుసుకొన్నారు.

            శివరామపురం కార్యకర్త BDR ఎలుగెత్తిన స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలకు బదులిచ్చారు.

            శనివారం వేకువ మనం కలిసి హరితీకరించవలసింది బందరు రహదారి పెదకళ్లేపల్లి బాటలు కూడలిలోనే!

            ఊరూరా ఎదగదగిన

 ఊరూరా ఎదగదగిన - ఉత్తేజం పంచదగిన

చల్లపల్లిలో పుట్టిన - జగమంతా మెచ్చుకొనిన

సామూహిక శ్రమతోనే జనపదములు వెలుగదగిన

ఆదర్శ శ్రమదాన మహత్తర మీ సంఘటన!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   21.07.2023.