2832* వ రోజు ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల?

రహదారి పచ్చతోరణ కృషిలో 2832* వ నాడు.

          శనివారం - 22.7.23 - వేకువ 4.16 - 5.10 నిముషాల మధ్య - 26 మంది శ్రమ త్యాగధనుల ఉమ్మడి కృషి అది! ఇంత చలి గాలిలో, వాన తుంపరలో, ఊరికి 2 కిలోటర్ల దూరాన - పెదకళ్లేపల్లి బాట జంక్షన్ వద్దకు చీకటి వేకువలో చేరుకొని 111 (ఇందులో 100 పారిజాతాలు)  మొక్కలు నాటిన పట్టుదల వాళ్లది!

స్వచ్ఛ - చల్లపల్లి కార్యకర్తల పుష్ప - హరిత తోరణంలో నాలుగు దశలుంటాయి:

- ఈ వేకువ నాటబోయే పూల మొక్కల కుల నిర్ణయం, జంగిల్ క్లియరెన్సు, నిన్ననే జరిగిపోతవి.

- 2 వ దశలో మొక్క మధ్య కొలతలూ, గోతులు తీయడమూ,

- వెంటనే, కొందరు పూల మొక్కలు నాటుతూ పోవడమూ,

- నాటిన వాటికి చుట్టూ ముళ్ల కంప కట్టడము నాలుగో దశ! 

          ఈ వేకువ 21 మంది కార్యకర్తలూ, రెడ్ క్రాస్ సంస్థ ప్రతినిధులుగా ఐదుగురూ బందరు రహదారిలో శివరామపురం క్రాస్ రోడ్డుకు 4 ప్రక్కలా ఈ 3 దశలూ పూర్తి చేశారు. సుశిక్షితులైన కార్మికుల్లా అలవోకగా ఈ మట్టి పిసుకుడూ, మొక్క నాటుడు పనులూ చేసుకుపోతున్న వైద్య ముఖ్యులూ, పాత్రికేయులూ, వణిఖ్  ప్రముఖులూ, ఉద్యోగులూ, రైతులూ, శ్రమదాతలుగా మారడాన్ని మనసారా అభినందించాలి !

          20 - 25 రోజుల్నాడు వీళ్లు నాటిన పూలమొక్కలప్పుడే పూస్తున్నాయి. ఈ 111 మొక్కలూ (ఇందులో ఈరోజు పెట్టిన 96, నిన్న రెడ్ క్రాస్ ప్రముఖులు  పెట్టిన 4 కలిపి మొత్తం 100 పారిజాతాలు) త్వరగా పెరిగి, ఈ కూడల్ని సుగంధ భరితం చేస్తే - వీటిని స్వచ్ఛ - సుందర చల్లపల్లికి కానుకగా ఇచ్చిన రెడ్ క్రాస్  వారికీ, చెమటోడ్చిన  వాలంటీర్లకూ ఆత్మసంతృప్తి!

          వడివడిగా ఇన్ని మొక్కల్నాటిన స్వచ్ఛ కార్యకర్తలు ఇంకో 15  నిముషాలు నిర్దేశితకాలం మిగిలిపోతే- వాళ్ల బుద్ధి పోనిచ్చుకోకుండా - రహదారి దక్షిణాన ఎవరో వదలిన (ఫంక్షన్ల తాలూకు) గలీజులెత్తివేసే పనికి దిగారు!

చల్లపల్లి శివరామపుర గ్రామస్తులూ, ప్రయాణికులూ ఈ స్వచ్యోద్యమానికి చేయ దగ్గ సహాయమేమంటే :

           1) ఏ అల్లరి చిల్లరి వాళ్లో ఏ మొక్కనూ పీకకుండా చూచుట

          2) త్వరలో మొక్కలు పెరిగి, పూసినఈ సుగంధ సుందర రహదారి ఉద్యానాన్ని ఆస్వాదించుట. 

          యార్లగడ్డ గ్రామ స్వచ్చోద్యమ  సంచాలకుడు తూము వేంకటేశ్వరరావు గారి కుమార్తె  బ్యూలా ప్రసన్న (మేనేజర్ ఇండియన్ బ్యాంక్) 32 వ జన్మదిన సందర్భంగా స్వచ్చ చల్లపల్లికి 100 గుడి గన్నేరు మొక్కలను కానుకగా ఇచ్చారు. ప్రసన్న కు స్వచ్చోద్యమ  శుభాకాంక్షలు, ఇందిరా కుమారి దంపతులకు ధన్యవాదములు.

 

          ఎప్పట్లాగే - కాఫీ మాధుర్యాన్ని చవిచూసిన కార్యకర్తలు సమీక్షా సమయంలో నేటి తమ  గంటన్నర శ్రమనూ విస్మరించారు, రేపటి స్వచ్ఛ, వైద్య శిబిర కార్యక్రమాలను తెలుసుకొని, ఏ 7 గంటలకో ఇళ్లు చేరారు.

          గోపాళం వారి 21 ఏళ్ల వైద్య శిబిర కారణంగా రేపటి మన శ్రమదానం విజయవాడ బాటలోని విజయా కాన్వెంటు దగ్గర ఉండునట!

          సవినయంగా ప్రణతి శతములు!

ఎంతమందికొ ఎదను తాకిన - ఎంతో కొంతగ మార్చజాలిన

బ్రతుకు దృక్పథములను మార్చిన- గ్రామ సేవల బాట చూపిన

సమాజ బాధ్యత గుర్తుచేసిన- స్వచ్ఛ సంస్కృతి పాదుకొల్పిన

స్వచ్ఛ సుందర ఉద్యమానికి సవినయంగా ప్రణతి శతములు!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   22.07.2023.