2833* వ రోజు....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడాలా?

                    ఈ ఆదివారం నాటిది 2833 *   శ్రమదానం.

        శ్రమ దాతలు 23 మంది, వీధి పారిశుద్ధ్య స్థలం బెజవాడ మార్గంలోని ప్రభుత్వ సామాజిక వైద్యశాల, పని వేళ వేకువ 4.30 -7.00 ల నడిమిది, బాగుపడ్డ వీధి నిడివి సుమారు 70 గజాలు....

        ఆ ప్రక్కనే అంతకు ముందే మొదలైన- విజయా కాన్వెంట్ లోని G.B.R. ఫౌండేషన్ వారి- (నెలలు లెక్కిస్తే - 245 వ)  వైద్య శిబిరం!  ఈ 23 మంది కాక, వైద్య శిబిర కార్యకర్తలూ కలిసి 30 మంది సామాజిక శ్రమదాతలన్నమాట!

        4.30 AM కు మొదలౌతున్న మెడికల్ కాంపులోనూ ఐదారుగురు స్వచ్చ కార్యకర్తలు చీపుళ్ల తో ప్రవేశించి, ఆవరణను ఊడ్చి, తమ నైజాన్ని చాటుకొన్నారు.  అంటే దీనర్థం - ఈ చల్లపల్లి స్వచ్ఛ సైనికులు ఎక్కడే సామాజిక సేవల అవసరం పడినా " Eveready "గా ఉంటారనే గదా!

        ఇక - గోపాళం శివన్నారాయణ- కోమలి జంట 20-25 ఏళ్లు తెలుగు రాష్ట్రాల్లో దున్నేస్తున్న వైద్యసేవలూ, అందు నిమిత్తం వైద్య శిబిరాలూ, తద్వారా ఏపాతిక ముప్పైవేల మందో స్వస్తత పొందుతున్న సంగతీ, వాటిలో వైద్య సహకారమందిస్తున్న వైద్యులూ, కార్యకర్తలదీ  వేరే కథా కమామిషు!

        తొమ్మిదేళ్లుగా చల్లపల్లిలోని స్వచ్ఛంద సేవలు గానీ - 2/3 రాష్ట్రాల్లో వ్యాపించిన GBR ధార్మిక సంస్థ కృషిగానీ చూడగలిగితే మన కళ్లెదుట నడుస్తున్న- నమ్మక తప్పని చరిత్రలు ! ఇప్పటికీ స్పందించని ప్రజలకూ, వైద్యులకూ హెచ్చరికలు!  ఏ సామాజిక శాస్త్రవేత్తకైనా, కవి-గాయక- కళాకారులకైనా సద్యః ప్రేరణలు! ఎప్పటి కప్పుడు ఓడిపోకుండా సమాజాన్ని గెలిపిస్తున్న సమకాలిక సంఘట నలివే!

        నేటి స్వచ్ఛ కార్యకర్తల శ్రమ వేడుక గురించి క్రొత్తగా చెప్పేదే ముంటుంది! వైద్యశిబిరం దక్షిణ మార్గాన వాళ్లు చేయని మురికి- బురద పనేముందీ! చెట్టు కొమ్మలు హద్దు మీరి రోడ్డెక్కుతుంటే అదుపుచేసి, దిక్కుమాలిన ప్లాస్టిక్ /గాజు సారాబుడ్లుంటే ఏరి, పుల్లలూ, ఆకులూ, దుమ్మూ ఊడ్చి, ఈ వ్యర్థాలన్నిటినీ మళ్లీ ట్రాక్టర్ లో నింపి, డంపింగ్ యార్డుకు చేర్చి, ఈ ప్రయత్నాల్లో బట్టలకు బురదంటించుకొన్నా పట్టించు కోక- నేటి తమ వీధి పారిశుద్ధ్య లక్ష్యం నెరవేరిందో లేదో చూసుకొని.... ఈ కథంతా 2833 నాళ్లుగా జరిగే నిత్య నూతనమేననుకోండి!

     6.40 తరువాత - ఇంకా వైద్య శిబిరంలో తమ అవసరమేముందోచూసుకొని, నందేటి శ్రీనివాసుని గ్రామోద్యమ నినాదాలకు స్పందించి, నేటి తమ పని ముగించారు!

        బుధవారం నాటి స్వచ్చ సుందరీకరణ కోసం మనం కలుసుకోవలసిన చోటు బందరు బైపాస్ రోడ్డులో కళ్ళేపల్లి అడ్డ రోడ్డు దగ్గరే!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   23.07.2023.