2834* వ రోజు ....

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల?

N.H. 16. సుందరీకరణలో - @2834* వ వేకువ!

          గురువారం (27.07.2023) వేకువ జామున సైతం 4.15 కే జాతీయ రహదారి పచ్చతోరణం పనులు మొదలై 6.14 దాక నిర్విఘ్నంగా నెరవేరాయి.

1) సకాల సమాచార లోపం వల్లా

2) అనిశ్చిత వాన బీభత్సం కారణంగానూ స్వచ్ఛ కార్యకర్తల సంఖ్య బొత్తిగా బక్క చిక్కి పోయింది!

          ఐతేనేం? మెరికల్లాంటి 15 మంది రాటు తేలిన వాళ్లతో - మరీ ముఖ్యంగా ముగ్గుర్నలుగురు కరుడుగట్టిన (ఇందులో ఇద్దరే 50 మొక్కలు తమ ఖాతాలో వేసుకున్నారని తెలిసింది!) స్వచ్ఛ వీరుల్తో  రాదారికిరుప్రక్కలా అష్టోత్తర శత పూల మొక్కలు కొలువు తీరాయి!

          “తక్కువ తిను - ఎక్కువ కష్టించు - అత్యధిక కాలం జీవించు” అనే సూత్రం ఈ వేకువ మరో పద్ధతిలో అమలయింది! ఏదో – అల్లాటప్పా, పైపై కార్యకర్తలం నలుగురం ఉన్నా - ఈ 10 మందే 108 పాదులు త్రవ్వి, రంగురంగు గద్దగోరు (చిన్న తురాయి) పూల మొక్కలు నాటారు మరి! పనిమంతుల సంఖ్య తక్కువా - పనెక్కువా అన్నట్లు గా - గమ్మత్తుగా జరిగిన కార్యక్రమం!

          అటు ముసుగుతన్ని, హాయిగా సుఖనిద్రాపరవశులైన వాళ్ళకీ, ఇటు రహదారి సుందరీకర్తలకీ నేటి వేకువ వాతావరణం అనుకూలించింది. నాల్గు రోజులుగా విసిగించిన వాన మహాశయుడు మాత్రం విశ్రాంతి తీసుకొన్నాడు. తెల్లారాక - 6.00 కు చూస్తే - అక్కడి పొలాల్నిండా నీళ్లూ, బాటకు రెండు దిక్కులా వాలంటీర్ల శ్రమకు సాక్ష్యంగా బారులు తీరిన పూల మొక్కలూ!

          ఇవి కాక - ఇకపై నాటవలసిన గుడి గన్నేరు, నూరు వరహాలు, అడవి తంగేడు వంటి పూల చెట్లు నాటడం బహుశా ఈ వారంలోనే పూర్తయితే - ఇంకొక నెల నాళ్లు మనం వేచి చూస్తే - చల్లపల్లికి దక్షిణాన - ఈ NH I6 రహదారి భాగం 2.2 కిలోమీటర్ల మేర ఎంత ఆహ్లాదంగా ఉంటుందో చూడాలి!

          ప్రస్తుతానికైతే - ఈ రహదారి హరిత - సుందరీకర్తలకు గ్రామస్తుల తరపున అభివందనాలు! నిలిచి, పెరిగి, పుష్పించి, కనువిందు చేయబోయే 1500 పూలమొక్కలకు ముందస్తు శుభాకాంక్షలు! పరుల ఆహ్లాదమే ధ్యేయంగా శ్రమిస్తున్న కార్యకర్తల్తో సహచరిస్తున్నందుకు ధన్యోస్మి!

          సమీక్షా కాలంలో శ్రమదానోద్యమ సంకల్ప నినాదాల్ని గట్టిగా వినిపించింది జాస్తి ప్రసాదు గారు, 2 గంటల శ్రమ సన్నివేశాల్ని పర్యవేక్షించి, చరవాణిలో బంధించి, ఆనందించింది DRK.  ప్రసాదు గారు,

          రేపటి మన బాధ్యతా నిర్వహణ కోసం అందరం కలుసుకోదగింది కాసానగర్ సమీపాన!

          ఎంతగా ఇది మార్పుచెందునొ!

కొద్దిమంది తెగించితేనే - హద్దులెరుగక శ్రమిస్తేనే -  

సమయదానం ప్రదర్శిస్తే - సమాజ బాధ్యత నిర్వహిస్తే-

ఊరు ఇంతగ మారుతుంటే - కనుల పండుగ చేయుచుంటే –

ఇంటికొక్కరు పూనుకొంటే ఎంతగా ఇది మార్పుచెందునొ!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   27.07.2023.